breaking news
landpulling
-
పూలింగ్‌లో రైతులకు పరిహారం పెంపు
- 48 గంటల్లో గడువు ముగియనుండగా సీఎం ప్రకటన - జరీబు రైతులకు అదనంగా 150 చ.గ. వాణిజ్య భూమి ఇస్తామని వెల్లడి - మంగళగిరి చుట్టుపక్కలున్న 5 గ్రామాల రైతులందరికీ జరీబు భూములకిచ్చే పరిహారం - పూల, పండ్ల తోటలకిచ్చే పరిహారం రూ.లక్షకు పెంపు - భూములివ్వకపోతే.. చట్టపరంగా ముందుకు పోతామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం కొత్త పరిహార ప్యాకేజీని ప్రకటించారు. ఆ మేరకు రైతులకిచ్చే పరిహారాన్ని పెంచారు. ల్యాండ్‌పూలింగ్ విధానం కింద భూసమీకరణ ప్రక్రియ మరో 48 గంటల్లో ముగియనున్న తరుణంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని నవులూరు, పెనుమాక, ఉండవల్లి, బేతపూడి, ఎర్రబాలెం గ్రామాలకు చెందిన రైతులతో గురువారం హైదరాబాద్ సచివాలయంలోని తన చాంబర్లో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రైతులతో చర్చలు ముగిశాక సాయంత్రం 6.45 గంటలకు మంత్రుల కమిటీతో భేటీఅయ్యారు. అనంతరం మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో కలసి విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. - జరీబు భూముల రైతులకు ముందు ప్రకటించిన 1,300 చదరపు గజాల పరిహారాన్ని 1,450 చదరపు గజాలకు పెంచుతున్నాం. ఎకరాకు వెయ్యిగజాల నివాస ప్రాంతంతోపాటు 450 గజాల వాణిజ్య భూమిని ఇస్తాం. జరీబు భూములకు ఆ ప్రాంతంలో ఉన్న ధరల విషయాన్ని రైతులు నా దృష్టికి తెచ్చిన నేపథ్యంలో పరిహారం పెంచాలన్న వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. - నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి, బేతపూడి గ్రామాలు మంగళగిరి పట్టణానికి సమీపంలో ఉన్నందున.. అక్కడి భూములన్నింటికీ జరీబు రైతులకు ప్రకటించిన పరిహార ప్యాకేజీ అందజేస్తాం. ఎకరాకు వెయ్యి గజాల నివాస ప్రాంతంతోపాటు 450 గజాల వాణిజ్య భూమిని ఇస్తాం. - ఎకరాలోపు భూమి ఇచ్చే మెట్టరైతుకు ఏటా రూ.30 వేల చొప్పున, జరీబు రైతుకు రూ.50 వేల చొప్పున పదేళ్లపాటు అందజేస్తాం. - రాజధాని ప్రాంతంలో మల్లె, నిమ్మ, జామ, సపోట, ఉసిరి, మామిడి వంటి పూల, పండ్లతోటలు వేసుకున్న రైతులకు ప్రత్యేక సాయంగా గతంలో ఒకే విడతగా రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. దానిని రూ.లక్షకు పెంచుతున్నాం. - ఈ ప్రాంతంలో పండ్లతోటలు, ఉద్యానవన పం టలు వేసుకున్న రైతులకు రుణ విముక్తి(రుణమాఫీ) పథకంలో రూ.లక్షన్నర వరకు అవకాశం కల్పిస్తాం. - పౌల్ట్రీ రైతుల వివరాలను సేకరిస్తున్నాం. వివరాలందాక వారికి చేసే సాయాన్ని ప్రకటిస్తాం. - ఇప్పటికే భూములప్పగించిన రైతులకు మార్చి 1 నుంచి ప్రభుత్వం ఏటా చెల్లించే పరిహారం అందజేస్తాం. అంగీకార పత్రాలిచ్చిన రైతులు ఏప్రిల్ నెలాఖరు వరకు తమ భూములను అప్పగించవచ్చు. అలాంటివారికి అప్పగించే సమయాన్ని బట్టి పరిహారం అందిస్తాం. భూములివ్వకపోతే వెనక్కిపోం.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే గుర్తించిన గ్రామాల్లో ఎవరైనా భూములివ్వనప్పటికీ ఆయా గ్రామాల్లో ప్రాజెక్టును ఆపే పరిస్థితి మాత్రం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. చట్టపరంగా ఏం చేయాలో అది చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళతామన్నారు. చట్టపరంగా అంటే భూ సేకరణేనా? అని ప్రశ్నించగా.. అంతకంటే మరో మార్గముందా? అని ఆయన ఎదురుప్రశ్నించారు. రాజధానికోసం రైతులు ఇప్పటికే 25 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌పూలింగ్ పద్ధతిన అందజేశారంటూ.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జరీబు భూమి మరో ఏడువేల ఎకరాల వరకు సమీకరించాల్సి ఉందన్నారు. రాజధాని విషయంలో కొందరు అక్కడి రైతుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినా.. రైతులు మాత్రం తనపైనున్న నమ్మకంతో సహకరిస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చారు. అసత్యాలు చెప్పేవారి మాటవిని రైతులు భూములివ్వడం జాప్యంచేస్తే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమై అక్కడి భూముల ధరలు వేగంగా పెరగవని సీఎం హెచ్చరించారు. పుకార్లు, అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దన్నారు. రాజధానిని నిర్మించుకోకపోతే అభివృద్ధిలో మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడలేమని చెప్పారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై స్థాయిలో మనం రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రానికి ఇబ్బందులున్న ఈ తరుణంలో ప్రజలు తమ సహకారాన్ని అందజేయాలని కోరారు. సీఆర్డీఏ పరిధిలోని రైతుల ఇబ్బందుల పరిష్కారానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. -
ఈ నెల 28 తర్వాత భూసేకరణే..!
- ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తాం - సీఆర్డీఏ గ్రామాల రైతులకు తెగేసి చెప్పిన సీఎం చంద్రబాబు - సచివాలయంలో సీఎంతో సమావేశమైన రాజధాని ప్రాంత రైతులు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల్లో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను బెదిరించి దారికి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండలాల పరిధిలోని 29 గ్రామాల నుంచి దాదాపు వందమంది రైతులను గురువారం హైదరాబాద్‌కు రప్పించి సమావేశమయ్యారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామన్న రైతులపై సీఎం ఈ సందర్భంగా కన్నెర్ర చేశారు. ‘‘ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే ఈ నెల 28 తర్వాత భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తాం’ అని తెగేసిచెప్పారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సీఎం చంద్రబాబు ఆ దేశ మంత్రి షణ్ముగం గురువారం హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో రైతులను హుటాహుటీన రప్పించడం గమనార్హం. షణ్ముగంతో భేటీ పూర్తయిన కొద్దిగంటల్లోనే రైతులతో సీఎం సమావేశమయ్యారు. కర్షకులు తమ డిమాండ్లను ఏకరువు పెట్టారు. ‘‘జరీబు భూములకు ఎకరానికి 1000 గజాలు కాకుండా 1400 గజాల ప్లాట్లు ఇవ్వాలి. మల్లెతోటలు.. పండ్ల తోటలకు ఎకరానికి రూ.50 వేలు కాకుండా కనీసం రూ.రెండు లక్షలివ్వాలి. సీఆర్డీఏ పరిధిలో గతంలో రియల్ వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను ల్యాండ్పూలింగ్నుంచి మినహాయించాలి. పశువుల మేతకోసం గ్రామం చుట్టూ 500 మీటర్ల మేరకు భూమిని ఖాళీగా ఉంచాలి’’ అని విన్నవించారు. సీఎం ముక్తసరిగా స్పందిస్తూ.. ‘‘మీ డిమాండ్లపై మంత్రుల కమిటీతో చర్చించి.. ఓ నిర్ణయం చెబుతా. రాజధాని నిర్మాణం వేగంగా జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కొందరు రైతులవల్ల రాజధాని నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోంది. ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే 28 తర్వాత భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం’’ అని తెగేసిచెప్పారు. కాగా తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామని.. లేదంటే సీఆర్డీఏ గ్రామాల్లో సమావేశాలుపెట్టి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామన్న తమను చంద్రబాబు తీవ్రస్థాయిలో బెదిరించినట్లు కొందరు రైతులు పేర్కొంటూ భయాందోళన వ్యక్తం చేశారు. సీఎంతో సమావేశానంతరం మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన కె.శివసత్యనారాయణ, చావలి లింగయ్య, వెంకట నారాయణలు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామని చెప్పారు.