breaking news
Land deeds
-
ఇళ్ల పట్టాల కోసం ప్రత్యేక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు అందజేసేందుకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నివాస స్థల పట్టాలకు ఐదేళ్ల తర్వాత పూర్తి విక్రయ హక్కులు ఉంటాయి. ఇందుకోసమే దరఖాస్తు (డీకేటీ) పట్టా కాకుండా 25 లక్షల మందికి రూ.10 స్టాంపు పేపర్లపై కన్వేయన్స్ డీడ్ (రిజిస్ట్రేషన్ దస్తావేజు) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కన్వేయన్స్ డీడ్స్ జారీ చేసే అధికారం జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఆఫీసులో ఒక్కొక్కరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 295 మంది జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. రాష్ట్రంలోని 670 మండలాల పరిధిలో 25 లక్షల మందికి ఒకేరోజు కన్వేయన్స్ డీడ్స్ నమోదు చేయడం ఈ 295 మంది జాయింట్ సబ్ రిజిస్ట్రార్లతో అయ్యే పనికాదు. అందుకే నవరత్నాల కింద 25 లక్షల మందికి నివాస స్థలాలకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్స్ జారీ అధికారాన్ని రాష్ట్రంలోని 670 మంది తహసీల్దార్లకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల పేరిట కన్వేయన్స్ డీడ్స్ ప్రత్యేక అవసరార్థం తహసీల్దార్ కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా, తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సాంబశివరావు బుధవారం జారీ చేసిన వేర్వేరు జీవోల్లో పేర్కొన్నారు. వీటి ప్రకారం తహసీల్దార్లే నివాస స్థలాలకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్స్ జారీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్టాంపుల ప్రింటింగ్ ప్రెస్‌కు (మింట్) లేఖ రాసి రూ.10 విలువ గల నాన్ జ్యుడిషియల్ స్టాంపులు 25 లక్షలు తెప్పించింది. వీటిపైనే లబ్ధిదారుల పేరుతో కన్వేయన్స్ డీడ్స్‌ను తహసీల్దార్లు తయారు చేస్తారు. లబ్ధిదారులకు స్థలం బదలాయింపు స్థలాన్ని ప్రభుత్వమే లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. దీన్నే కన్వేయన్స్ డీడ్ అంటారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయాలంటే సదరు ఆస్తి విలువలో 7.5 శాతం రిజిస్ట్రేషన్ రుసుముల కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పేదల నుంచి రిజిస్ట్రేషన్ రుసుములు వసూలు చేయడం ఇష్టం లేనందున రాష్ట్ర సర్కారు ఈ కన్వేయన్స్ డీడ్స్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ, యూజర్ ఛార్జీలను మినహాయిస్తూ వేర్వేరు జీవోలు ఇచ్చింది. రూ.10 స్టాంపు పేపర్లపై కన్వేయన్స్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి వీలుగా రిజిస్ట్రేషన్ శాఖ అన్ని రకాల సేవలకు వాడుకునే కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్(కార్డ్) డేటాను ఈ ప్రత్యేక అవసరార్థం (కన్వేయన్స్ డీడ్స్) రిజిస్ట్రేషన్ల కోసం తహసీల్దారు కార్యాలయాలకు సమకూర్చనున్నారు. దీంతో తహసీల్దార్లే జాయింట్ సబ్ రిజిస్ట్రారు హోదాలో కన్వేయన్స్ డీడ్లను రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ప్రత్యేక పని కోసం మాత్రమే తహసీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించారు. -
పాలేటుపల్లి
నిత్యం కరువు ఛాయలతో ఉండే కనిగిరి ప్రాంతంలోని కనిగిరి, పీసీపల్లి మండలాల్లో వందలాది ఎకరాలను సస్యశ్యామలం చేయడంతో పాటు తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు అది. బ్రిటీష్ కాలంనాడే ప్రతిపాదించిన పాలేటిపల్లి ప్రాజెక్టు ఎట్టకేలకు కార్యరూపం దాల్చినా..ఇంకా బాలారిష్టాలు దాటడం లేదు. కాలువలకు భూసేకరణలో జాప్యం..నిధుల గండంతో పది నెలల నుంచి రిజర్వాయర్ పనులు నిలిచిపోయాయి. - పది నెలల నుంచి పాలేటిపల్లి రిజర్వాయర్ పనులకు బ్రేక్ - జరగని కుడి, ఎడమ కాలువల భూసేకరణ పనులు - నిజంగా సర్వే కోసమా.. లేక నిధుల గండమా..! కనిగిరి : కనిగిరి ప్రాంతప్రజల చిరకాలవాంఛ పాలేటిపల్లి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో కనిగిరి, పీసీపల్లి రెండు మండలాల్లోని గ్రామాల ప్రజలకు ఉపయోగం. సాగు, తాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే బ్రిటీష్ కాలం నుంచి ప్రతిపాదనల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనుల వ్యయం లక్షల్లో నుంచి కోట్లకు చేరింది. 15 ఏళ్ల క్రితం దీనికి రూ.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా కాలక్రమేణ రూ.17.8 కోట్లకు ప్రతిపాదనలు చేరాయి. 2013 ఏప్రిల్‌లో పాలేటిపల్లి రిజర్వాయర్‌కు నార్మల్ స్టేట్‌ప్లాన్ జనరల్‌ఫండ్ రూ.17.882 కోట్ల నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించారు. కారణాలు ఏమైనప్పటికీ పది నెలల నుంచి పనులు జరగడం లేదు. రిజర్వాయర్ నిర్మాణం ఇలా.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 1500 ఎకరాల ఆయకట్టుతో డిజైన్ రూపొందించారు. ప్రాజెక్టు చెరువు మునకతో కలిపి విస్తీర్ణం 350 ఎకరాలు. కుడికాలువ 9.2 కి.మీ, ఎడమకాలువ 2.7 కిమీల పొడవుతో డిజైన్ రూపొందించారు. దీనికింద పీసీపల్లి మండలంలో బట్టుపల్లి, పాలేటిపల్లి, తలకొండపాడు, కనిగిరి మండలంలో రాచగుండ్లపాడు, లింగోజిపురం పంచాయతీల్లో పారుదల ఉంటుంది. ఎడమ కాలువ కింద 510 ఎకరాలు, కుడికాలువ కింద 1500 ఎకరాల ఆయకట్టు సాగు ఉండగా, కనిగిరి మండలానికి సంబంధించి 220 ఎకరాల పారుదల ఉంటుందని అధికారులు తెలిపారు. పాలేరువాగు నుంచి పందువగండి, ఎన్.గొల్లపల్లి మీదుగా పాలేటిపల్లిలోకి నీళ్లు చేరుతాయి. పనులు ఆగింది ఇక్కడ.. రిజర్వాయర్‌కు సంబంధించి మంజూరైన రూ.17.8 కోట్లు మూడు దశలుగా ఖర్చు చేయాల్సి ఉంది. ప్రాజెక్టు అలుగులు, కట్టా, తూములు, తొట్టి నిర్మాణానికి కొంత, కుడి, ఎడమ కాలువల నిర్మాణాలకు కొంత, మునక భూములకు నష్టపరిహారం చెల్లింపులకు కొంత నిధులు కేటాయించి విడుదల చేస్తారు. నష్ట పరిహారం చెల్లింపులకు సంబంధించి రూ.2.5 కోట్లు కేటాయించగా, తొట్టి, తూము, కట్టలు, అలుగుకు ఇప్పటికి రూ.8 కోట్ల పనులకు టెండర్ పిలిచి పనులు చేశారు. మిగతా రూ.7.3 కోట్ల నిధులతో కుడి, ఎడమ కాలువలు పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అలుగు, తొట్టి, కట్ట పనులు పూర్తయి పది నెలలైనా మిగతా పనులు జరగడం లేదు. సర్వే కోసమా.. నిధుల గండమా..! పాలేటిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి 1980లో అప్పటి ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కుడి, ఎడమ కాలువలు 11.7 కిలోమీటర్ల పొడవుతో 1500 ఎకరాల ఆయకట్టుగా రూపొందించారు. అయితే ప్రస్తుతం ఆ సర్వే పనికి రాదని అధునాతన టెక్నాలజీతో కాలువ రీ సర్వే చేయాలని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రీ సర్వే కోసం హైదరాబాద్ సీఈకి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు కాలువ రీ సర్వే పనులు జరగలేదు. కాగా ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన నిధులకు నూతన ప్రభుత్వ నిధుల గండం తగిలిందా.. లేక కాంట్రాక్టర్లకు, అధికారులకు, నేతలకు మధ్య ఆమ్యామ్యాల లెక్క కుదరక పనులు ఆపారా..! అనేది అర్థం కాని ప్రశ్న. వాస్తవానికి సర్వే కోసమే ఆలస్యమైతే.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. నేతలు ఎందుకు ఒత్తిడి తేవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జేఈ ఏమంటున్నారంటే.. రిజర్వాయర్ నిర్మాణంలో జాప్యంపై ఇరిగేషన్ జేఈ లక్ష్మీ నారాయణను ‘సాక్షి’ అడగ్గా పది నెలల నుంచి పనులు ఆగింది వాస్తవమేనన్నారు. కుడి, ఎడమ కాలువ రీసర్వేకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో సర్వే పనులు ప్రారంభమవుతాయన్నారు. కాలువలకు భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. కాలువల నిర్మాణానికి జరగని భూ సేకరణ: పాలేటిపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా తొట్టి, అలుగు, తూములు, మునక భూములకు సంబంధించి 350 ఎకరాలకు భూసేకరణ పూర్తయింది. వాటికి మెట్టకు ఎకరాకు రూ.40 వేలు, మాగాణి భూములకు ఎకరాకు రూ.60 వేలు చెల్లించారు. ఇంకా కుడి, ఎడమ కాలువ నిర్మాణానికి భూ సేకరణ జరగాల్సి ఉంది. సుమారు 60 ఎకరాలు కాలువల నిర్మాణానికి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు లక్ష నుంచి లక్షా 20 వేల వరకు చెల్లించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. సుమారు 2 మీటర్ల వెడల్పులో నిర్మించే కాలువలకు ఇప్పటి వరకు భూసేకరణ చేయలేదు.