breaking news
kp sarathi
-
గొంతు నొక్కేశారు..
ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ప్రజా సమస్యలు చెప్పకుండా ప్రతిపక్షం గొంతునొక్కే కుట్ర జరి గింది. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికారపక్షం ఆదేశాలతో వైఎస్సార్ సీపీ నేతలపై జులుం ప్రదర్శించారు. కంకిపాడు మండలం కోలవెన్ను జన్మభూమి సభకు వెళ్లొద్దంటూ పార్టీ నేత కొలుసు పార్థసారథిని గృహనిర్బంధం చేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి రెండున్నర గంటల పాటు పలు ప్రాంతాల చుట్టూ తిప్పారు. మరోవైపు సభకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచి చంద్రశేఖర్ చేతిలో మైక్ లాక్కుని కిందికి నెట్టేశారు. కంకిపాడు (పెనమలూరు): మండలంలోని కోలవెన్ను గ్రామంలో మంగళవారం పోలీసులు జులు ప్రదర్శించారు. ప్రజల సమస్యలను జన్మభూమి సభలో ప్రస్తావించాల్సిన వైఎస్సార్ సీపీ నేతల గొంతును పాలకపక్షం నేతల ఆదేశాలతో నొక్కేశారు. గ్రామంలో ఉదయం 9 గంటలకు జన్మభూమి–మా ఊరు గ్రామసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో గ్రామ సమస్యలను అధికారులు, పాలకపక్షం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. పార్టీ మచి లీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఉదయం 8 గంటలకే సర్పంచి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి) ఇంటికి చేరుకున్నారు. స్థానికులు రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లస్థలాల సమస్యల అర్జీలను వారికి అందించారు. భారీగా మోహరించిన పోలీసులు జన్మభూమి సభకు ప్రతిపక్ష నాయకులు వెళ్తారనే సమాచారంతో డీసీపీ గజరావ్‌భూపాల్, ఏసీపీలు విజయభాస్కర్, ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు, టాస్క్ఫోర్సు, క్యూ ఆర్టీ, ఏపీఎస్పీ బృందాలు భారీగా గ్రామానికి చేరాయి. తుమ్మల చంద్రశేఖర్ ఇల్లు, పంచాయతీ ప్రాంగణం, మండపాల సెంటరు మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టి, సభకు వస్తున్నవారు వైఎస్సార్ సీపీ శ్రేణులని తెలిస్తే అక్కడే ఆపేశారు. నల్లరిబ్బన్లతో నిరసన వైఎస్సార్ సీపీ నేతలు పార్థసారథి, చంద్రశేఖర్, ఉపసర్పంచి నక్కా శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు బూసే జ్యోతి ఇతర నాయకులు జన్మభూమి సభకు బయలుదేరుతున్నారనే సమాచారంతో చంద్రశేఖర్ ఇంటిని పోలీసులు నిర్బంధించారు. తాము గొడవ చేసేందుకు రాలేదని, సభలో సమస్యలు వివరిస్తామని పార్థసారథి పోలీసులకు స్పష్టంచేశారు. కొంత సమయం తరువాత మండపాల సెం టరు మీదుగా పంచాయతీ కార్యాలయ వద్ద నిర్వహిస్తున్న గ్రామసభకు పార్థసారథి తదితరులు బయలుదేరారు. సభా ప్రాంగణానికి వెళ్లకుండానే పోలీసులు అడ్డగించారు. పోలీసుల తీరును నిరసిస్తూ పార్థసారధి సహా ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు నోటికి నల్లరిబ్బన్లు «కట్టుకున్నారు. పార్థసారధిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిం చారు. పార్టీ నాయకులు అడ్డుపడకుండా రోప్ పార్టీ సిబ్బంది స్థానికులను అడ్డగించారు. ఉదయం 10.30 గంట లకు సారథిని అరెస్టు చేసిన పోలీసులు రెండున్నర గంటలపాటు తమ వాహనంలో ఉయ్యూరు, ఉంగుటూరు, తేలప్రోలు, గన్నవరం ప్రాంతాల్లో తిప్పి విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద వదిలిపెట్టారు. చంద్రశేఖర్ నుంచి మైకు లాక్కున్న పోలీసులు గ్రామసభకు వెళ్లిన సర్పంచి తుమ్మల చంద్రశేఖర్ ప్రసంగిస్తూ గ్రామంలో ఇళ్లస్థలాల సమస్య అపరిష్కృతంగా ఉందని, సంక్షేమ పథకాల సమాచారం సర్పంచినైన తనకు తెలియనీయడం లేదన్నారు. టీడీపీ శ్రేణులు ఆయన్ను అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్, ఎస్ఐ హనీష్ వేదిక ఎక్కి సర్పంచి చేతిలో మైక్ లాక్కుని, వేదిక నుంచి కిందికి నెట్టి, లాక్కెళ్లారు. ఎమర్జెన్సీని తలపిస్తున్న పాలన అధికార పక్షం, పోలీసుల తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి విమర్శించారు. అరెస్టుకు ముందు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. టీడీపీ మీటింగ్ అయితే ఎవరం హాజరుకాబోమని, ప్రభుత్వ సభ కనుక, ప్రజల సమస్యలు వివరించేందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సత్తెనపల్లి వెళ్లొచ్చు కానీ, ప్రతిపక్షం సభలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉండగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కోలవెన్నులో 2.40 ఎకరాలు, 2 ఎకరాలు సేకరించామని గుర్తుచేశారు. అయితే నేటికీ ఇళ్లపట్టాలు మంజూరు చేయలేదని, ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించకూడదా? అని పేర్కొన్నారు. మినుము పంట పరిహారం కొందరికే అందిందని, స్థిరీకరణ నిధి నుంచి రైతులు అందరికీ న్యాయం చేయాలని కోరారు. గృహ నిర్మాణాల బిల్లులు బిక్షం వేసినట్లుగా అరకొరగా మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలు కూలి సొమ్ము అందక అవస్థ పడుతున్నారని విమర్శించారు. పోలీసులు బందోబస్తు లేకపోతే ప్రజల్లోకి వచ్చే ధైర్యంలేని అధికారపక్షం, ప్రజలకు న్యాయం చేయకపోతే తప్పుకోవాలని ఎద్దేవాచేశారు. -
అలమటిస్తున్నా పట్టించుకోరా..
మంత్రి ఉమా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి కృత్తివెన్ను : ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ఓ చేతకాని దద్దమ్మని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. శివారు ప్రాంతాలలో ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నా పట్టించుకోని ఉమా లాంటి వారికోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో తాగు, సాగునీటి కోసం వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యకర్తలు రంగాబొమ్మ సెంటరు నుంచి లక్ష్మీపురం లాకుల వరకు ర్యాలీగా వచ్చారు. లాకుల వద్ద జాతీయ రహదారిపై పార్టీ నేతలతో కలసి బైఠాయించారు. రాష్ట్రంలో కరువు తాండవించడంలో చిత్రమేమి లేదని కరువు, చంద్రబాబు ఇద్దరూ అన్నదమ్ములని ఎద్దేవా చేశారు. రూ.వందల కోట్ల పట్టిసీమ పేరుతో దోపిడీ చేసి ఇప్పుడు గండికొట్టారంటూ చెప్పడం విడ్డూరమన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కాలువకు గండి కొడితే పట్టుకోలేని చేతకాని తనంలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. పుష్కరాల పేరుతో చంద్రబాబునాయుడు పాలన గాలికి వదిలేశారని విమర్శించారు. తీర ప్రాంతాలలో ఇన్ని నెలలుగా ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతుంటే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కోటరీలో ఎమ్మెల్యేలు నిమిత్త మాత్రులేనని వీరికి ఎలాంటి ప్రాధాన్యం లేదంటూ సానుభూతి వ్యక్తం చేశారు. పుష్కరాలు ముగిసే లోపు కృత్తివెన్ను మండలంలోని శివారు ప్రాంతానికి నీరివ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. 18 నెలలుగా తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోకపోవడం దారుణమని ఉప్పాల రాంప్రసాద్ అన్నారు. త్వరలో నీరవ్వకపోతే పార్టీ నేతృత్వంలో ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. తరువాత పార్టీ నేతలంతా పల్లెపాలెం, లక్ష్మీపురం, పెదచందాలలో అడుగంటిన తాగునీటి చెరువులను పరిశీలించారు. ధర్నాలో పార్టీ యువజన రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము, ఎంపీటీసీల సంఘ జిల్లా కార్యదర్శి పిన్నెంటి మహేష్, పార్టీ మండల కన్వీనర్ జల్లా భూపతిరాజు, సంయుక్త కార్యదర్శి వైధాని వెంకట్రాజు, యువజన మండలాధ్యక్షుడు పులగం రాము, పార్టీ జిల్లా యువజన కార్యదర్శి వెలివెల చినబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాస్, మండల కార్యదర్శి ముత్యాల రాధాకృష్ణ, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ గూట్ల జయేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు కూనసాని రాంబాబు, కొల్లాటి కృష్ణ, నాయకులు గంధం నాగరాజు, దానియేలు, రాయపురెడ్డి శ్రీను పాల్గొన్నారు.