breaking news
khrif
-
కరువు కాటు
ఖరీఫ్ కరిగిపోయి.. రబీ ఆగిపోయి! – అక్టోబర్ నుంచి జాడలేని వర్షాలు – పెట్టుబడులు కూడా దక్కక అల్లాడుతున్న రైతులు - ధరల పతనంతో దయనీయంగా జీవనం - ప్రకటించిన కరువు మండలాల్లోనూ కోత పెట్టిన అధికారులు - పంట రుణాల పంపిణీ అంతంతే.. కర్నూలు అగ్రికల్చర్: వర్షాభావం ఖరీఫ్‌ను తుడిచిపెట్టేసింది. అక్టోబర్ నుంచి చినుకు జాడ లేకపోవడం రబీ ఆశలను కూడా గల్లంతు చేసింది. సీజన్ ముగుస్తున్నా పంటల సాగులో పురోగతి లోపించింది. రబీలో సాధారణ సాగు 3,54,341 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 2,92,381 హెక్టార్లకే పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయానికి 3,44,895 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించినా 10 మండలాల్లో ఎలాంటి కరువు లేదని, పంటలు బాగా పండినట్లు మండల స్థాయి అధికారులు నివేదికలో స్పష్టం చేశారు. ఈ పది మండలాల్లోనూ వర్షాధారం కింద పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు ఉన్నారు. నీటి పారుదల కూడా అస్తవ్యస్తం కావడంతో రైతులు భారీగా దెబ్బతిన్నారు. అయితే రైతుల ప్రయోజనాలకు అధికారులే తూట్లు పొడిచారు. పశుగ్రాసం కొరత.. తాగునీటి కష్టాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రబీ రైతులకు పంట రుణాలు అంతంతమాత్రమే.. రబీలో పంట రుణాల పంపిణీ నామమాత్రంగా ఉంది. రైతుల పట్ల ప్రభుత్వం, బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుండగా.. ప్రకృతి కూడా సహకరించలేదు. రబీ పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.1345.79 కోట్లు కాగా.. పంపిణీ రూ.382.60 కోట్లకే పరిమితమైంది. 2016–17 సంవత్సరానికి 19వేల మందికి పైగా కౌలు రైతులకు రుణఅర్హత కార్డులు పంపిణీ చేసినా 1569 మందికి రూ.9.91 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. తగ్గిన శనగ.. పెరిగిన మినుము సాగు ఈసారి శనగ సాగు బాగా తగ్గింది. రబీలో సాగు భారీగా పెరిగే అవకాశం ఉన్నా అక్టోబర్ నెల మొదటి వారం నుంచి చినుకు జాడ లేకపోవడంతో భూమిలో తేమ శాతం పడిపోవడం వల్ల సాగు పడిపోయింది. సాగు చేసిన శనగ సైతం అధిక ఉష్ణోగ్రతలు ఉండటం, భూమిలో తేమ లేకపోవడం వల్ల దెబ్బతినింది. జిల్లాలో శనగ సాధారణ సాగు 1,92,744 హెక్టార్లు ఉండగా, ఈసారి 1,79,027 హెక్టార్లకే పరిమితమయింది. గతేడాది ఇదే సమయానికి 1,99,842 హెక్టార్లలో పంట సాగయింది. సెప్టెంబర్ నెల చివరికే వర్షాలు పరిమితం కావడం.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో వర్షాల జాడ లేకపోవడంతో భూముల్లో తేమ శాతం తగ్గిపోయింది. అందువల్ల రబీ పంటల సాగులో పురోగతి లోపించింది. కేసీ కెనాల్‌కు నీటి విడుదల లేకపోవడంతో నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, నంద్యాల, ఆళ్లగడ్డ, గోస్పాడు తదితర మండలాల్లో సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. రబీలో వరి 19,296 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉంది. కానీ 8,930 హెక్టార్లకే పరిమితమైంది. కేసీ కేనాల్‌కు నీటి విడుదల నిలిచిపోవడంతో వరితో పాటు ఇతర ఆరుతడి పంటలు కూడా దెబ్బతిన్నాయి. రబీలో నంద్యాల, కర్నూలు డివిజన్లలో మినుము సాగు గణనీయంగా పెరిగింది. మినుము సాధారణ సాగు 9221 హెక్టార్లు ఉండగా, ఈ సారి 20,263 హెక్టార్లలో సాగవడం విశేషం. జొన్న సాగు కూడా బాగా తగ్గిపోయింది. సాధారణ సాగు 62,203 హెక్టార్లు ఉండగా, 43373 హెక్టార్లలో(69.73 శాతం) మాత్రమే సాగయింది. ధరలు దయనీయం కరువు కోరల్లో చిక్కుకొని సతమతం అవుతున్న రైతులను ధరలు మరింత దెబ్బ తీశాయి. అన్ని పంటలకు ధరలు పడిపోవడం వల్ల రైతుల ఆందోళన అంతాఇంతా కాదు. వేరుశనగ, పప్పుశనగ, కందులు, ఉల్లి, ఎండుమిర్చి, టమాట, పత్తి తదితర పంటల ధర పడిపోవడం కరువు రైతుల పాలిట శాపంగా మారింది. అక్టోబర్ నెలలో రైతులు కిలో శనగ విత్తనాలు రూ.100 ప్రకారం కొనుగోలు చేసి సాగు చేశారు. భూమిలో తేమశాతం పడిపోవడంతో దిగుబడులు 60శాతం పైగా తగ్గిపోయాయి. ధరలు కూడా అక్టోబర్‌తో పోలిస్తే 50శాతం పడిపోయాయి. కందుల ధర నేలను తాకడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడాది జూన్, జూలై నెలల్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పోటీ పడిసాగు చేశారు. ఇప్పుడు క్వింటా ధర రూ.4,500లకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ధర పతనం కావడంతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. టమాట రైతులదీ ఇదే పరిస్థితి. ఇక వేరుశనగ ధర రోజురోజుకూ పడిపోతోంది. ఖరీఫ్, రబీ సీజన్లలో 60 శాతం మంది రైతులకు పెట్టుబడులు కూడా దక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. -
జిల్లాకు 68,395 క్వింటాళ్ల విత్తనాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు అవసరమైన విత్తనాలను వ్యవసాయశాఖ మంజూరు చేసింది. అన్ని రకాల విత్తనాలు కలిపి 68,395 క్వింటాళ్లు కేటాయించింది. ఇందులో వేరుశనగలు 50,600 క్వింటాళ్లున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 97500 క్వింటాళ్ల వేరుశనగకు ప్రతిపాదించగా సంగం మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇందులో కే-6 రకం వేరుశనగ 48,100 క్వింటాళ్లు, కే-9 రకం 2500 క్వింటాళ్లున్నాయి. మార్క్‌ఫెడ్ 25,600 క్వింటాళ్లు, ఆయిల్‌ఫెడ్ 25వేల క్వింటాళ్ల ప్రకారం సరఫరా చేస్తాయి. కందులు ఎల్‌ఆర్‌జీ -41 రకం 3500 క్వింటాళ్లు, పెసలు 500, మినుములు 3000, ఆముదం 650, కొర్ర 540, దయంచ 7500, పిల్లి పెసర 1200, ప్రొద్దుతిరుగుడు 125, ఉలవలు 50, సజ్జలు 200, జొన్నలు 130, మొక్కజొన్న 250, సోయాబీన్ 150 క్వింటాళ్ల ప్రకారం కేటాయించారు. వేరుశనగ మినహా మిగిలిన విత్తనాలను ఏపీసీడ్స్ సరఫరా చేస్తుంది. మే నెల చివరి నాటికి విత్తనాలు పొజిషన్ చేసి పంపిణీ చేపట్టడానికి వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ధరలు, సబ్సిడీ ఖరారు కావాల్సి ఉంది.