breaking news
kharif problems
-
ఖరీఫ్.. ఉఫ్!
జాడలేని వానలు ఎండుతున్న పంటలు.. ఆశల్లేని రైతులు అడ్డాపై కూలీగా పనుల కోసం పరుగులు మెదక్: ఖరీఫ్ కన్నీరు పెట్టిస్తోంది.. ఆశలన్నీ సూరీడు ఆవిరి చేస్తున్నాడు.. వరుణుడు మొఖం చాటేశాడు.. పంటలన్నీ ఎండిపోతున్నాయి. పెట్టుబడులు రాని దుస్థితి. అప్పులు మీదపడ్డాయి. బతుకు కష్టమవుతోంది.. మళ్లీ పొట్టచేతపట్టుకుని రైతన్న వలసబాట పడుతున్నాడు. అన్నదాతను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సరైన వర్షాలు కురవక.. ఖరీఫ్ సాగక.. రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు. వర్షాకాలం ప్రారంభంలో కురిసిన అడపాదడపా వర్షాలకు సాగుచేసిన ఆరుతడి పంటలు కూడా ఎండిపోతున్నాయి. 20 రోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలకు పంటలన్నీ చేతికందకుండా పోతున్నాయి. బోర్ల ఆధారంగా వేసిన వరిపంటలకూ నీరందక నెర్రలు బారాయి. కనీసం పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. దీంతో దిక్కుతోచని స్థితిలో మళ్లీ పొట్టచేతపట్టుకుని వలస బాటపడుతున్నాడు. రెండేళ్లుగా కరువు తాండవం చేయడంతో పల్లెలను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన అన్నదాతలు ఎంతో ఆశతో.. ఈసారి ఖరీఫ్‌కు సన్నద్ధమయ్యారు. ఈయేడు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయన్న ఆశతో పల్లెలకు తిరిగి చేరుకున్నారు. వేలాది రూపాయల అప్పులుచేసి పంటలు సాగుచేస్తే వర్షాలు లేక సాగుచేసిన ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి పల్లెల్లో కానరావడం లేదు. పల్లెల్లో చేసేందుకు పనులు దొరకక మెదక్ పట్టణంలోని కూలీల అడ్డామీదకు పల్లెల నుంచి తరలివస్తున్నారు. మాకు పనులు చూపాలని వేడుకుంటున్నారు. ఒక్కరిని కూలికి పిలిస్తే నలుగురు ఎగబడుతున్నారు. జిల్లా అంతటా కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయి. మురిపించిన వర్షాల ఆధారంగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, పెసర్లు, కందులు, జొన్న పంటలను 1.20లక్షల హెక్టార్లలో రైతులు వేసుకున్నారు. కొద్దోగొప్పో నీరు వచ్చే బోర్ల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. వర్షాలు పడకపోవడంతో చేతికందే దశలో ఉన్న ఆరుతడి పంటలన్నీ ఎండిపోయాయి. బోరుబావుల్లో సైతం నీటి ఊటలు అడుగంటిపోయి వరి పొలాలు నెర్రలు బారాయి. ఇక చేసేదిలేక అడ్డా మీదకు కూలీ పనులకోసం పరుగులు తీస్తున్నారు. మెదక్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలాల నుంచి నిత్యం వెయ్యి మందికిపైగా రైతులు కూలి పనులకు వస్తున్నారు. ఇక్కడ కూడా వారికి పనులు చెప్పేవారు లేకపోవడంతో నిరాశతో వెనక్కి తిరిగిపోతున్నారు. ఆటో, బస్సుచార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాల నుంచి పనికోసం వస్తే పనులు దొరకక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్క ఎండిపోయింది సారూ.. రెండెకరాల పొలం ఉంది. అందులో రూ.20వేల అప్పు చేసి మొక్కజొన్న పంట వేశాను. తీరా కంకి దశకు చేరుకున్న దశలో వర్షాలు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దీంతో అడ్డామీదకు కూలీపని కోసం వచ్చినా.. ఇక్కడ కూడా పనిదొరకడం లేదు. ఎట్లా బతకాల్లో అర్థమైతలేదు. - నర్సింగ్, జానంపల్లి గిరిజనతండా రెండెకరాల వరి పోయినట్టే నాకు రెండెకరాల పొలం ఉంది. అందులో రెండు బోర్లున్నాయి. వాటిల్లో కొద్దిపాటి నీరు వస్తుండటంతో రూ.30వేల అప్పు చేసి వరి పంట సాగుచేశాను. వర్షాలు పడకపోవడంతో బోర్లలో నీటి ఊటలు అడుగంటాయి. పంట ఎండిపోతోంది. అడ్డామీద పనికొచ్చినా.. పనిచెప్పేవారే లేరు. - రైతు శ్రీను, అవుసులపల్లి పనులు చూపించాలి మళ్లీ కరువు మొదలైంది. పంటలుఎండిపోయాయి. ప్రభుత్వం స్పందించి పల్లెల్లో పనులు చూపించి ఆదుకోవాలి. బుక్కెడు కూడు కోసం అడ్డామీద పడిగాపులే.. వారానికి రెండు రోజులైన పని దొరకడం లేదు. పల్లెల్లోనే ఉపాధి పనులు చేపట్టి ఆదుకోవాలి. - ఏసుమణి, మక్తభూపతిపూర్ పోషణ భారమైంది నాకున్న రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసిన. వర్షాలు కురవక ఎండిపోయింది. అందుకోసం చేసిన అప్పులు మీద పడ్డాయి. బతుకు దెరువుకోసం అడ్డామీద కూలీవస్తే పని దొరకుతలేదు. కన్నబిడ్డలను పోషించుకునేందుకు ఆదేరువులేదు. ప్రభుత్వమే పనులు చూపించి ఆదుకోవాలి. - లంబాడి మీరి, జానకంపల్లితండా కుటుంబం చిన్నాభిన్నం వరుస కరువులతో నా కుటుంబం చిన్నాభిన్నమైంది. 5 ఎకరాల పొలం ఉంది. ఆరు బోర్లు వేయగా, ఒక్కదాంట్లోనే నీరుపడింది. వరుస కరువుతో పొట్టగడవక నా ముగ్గురు కొడుకులు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఎక్కడున్నారో కూడా తెలియదు. శరీరం సహకరించక చర్చి ప్రాంగణంలో కొబ్బరికాయలు, అగ్గిపెట్టెలు, అగర్బత్తీలు అమ్ముకుంటున్నా. - సంగం ఎల్లయ్య, బొగుడ భూపతిపూర్ -
ఖరీఫ్‌కు వంశ‘ధార’
సమావేశం ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు పరిష్కరించినట్టు చెప్పారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్-2, ఫేజ్- 2 హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, మండలాల్లో 20 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా, 14 గ్రామాలను ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని వివరించారు. నిర్వాసిత గ్రామాల్లో నివసిస్తున్న 7,104 కుటుంబాకు సంబంధించి సామాజిక, ఆర్థిక సర్వేల ద్వారా వివరాలు సేకరించామన్నారు. ఈ కుటుంబాలకు రూ. 47.33 కోట్లు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. పునరావాస పునఃపరిశీలన స్కీం 2005 ప్రకారం ఆ మండలాల్లో ఇళ్ల సర్వేలు చేపట్టామన్నారు. వారిలో 700 కుటుంబాలకు గాజుల కొల్లివలస, 150 కుటుంబాలకు వెన్నెలవలసలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మూడు మండలాల్లోని 19 గ్రామాల్లో వివిధ పునరావాసాల కింద 24.69 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఇంకా 1779 ఇళ్ల నిర్మాణాలకు సహాయం అందజేయాల్సి ఉందని, నిర్వాసితులు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు అందజేయాల్సి ఉందన్నారు. వీరికి సంబంధించిన వివరాలు సేకరించాలని తహశీల్దార్లను ఆదేశించినట్టు చెప్పారు. -
రైతుల ఆశలు ఆవిరి
వర్షాలు కురుస్తాయనుకున్న రైతుల ఆశల మబ్బులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రుతుపవనాలు వస్తాయనికళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతన్న ఆశలు ఆవిరైపోయాయి. వర్షాలు వస్తాయని పొలాలు, దుక్కులు దున్ని అదను కోసం ఎదురు చూస్తున్న కర్షకులకు ఖరీఫ్ కష్టాలు తప్పేటట్టు లేవు. గుండ్లకమ్మ ఒడ్డున లక్షల్లో వరినారు వ్యాపారం జరిగేది. ఈ ఏడాది ఆ భూముల్లో పిచ్చిచెట్లు కూడా మొలవని పరిస్థితి. ఇలాగైతే తిండిగింజలకు కూడా కష్టమే. ఈ నేపథ్యంలో వరుణుడి కరుణ కోసం కర్షకులు ప్రార్థిస్తున్నారు. నూజెండ్ల,న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్ రైతులకు కష్టాలను మిగిల్చే సూచనలు కన్పిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడ చూసినా చుక్కనీరు కానరాకపోవడంతో ఖరీఫ్‌లో సాగు కష్టమేనని రైతులంటున్నారు. రుతుపవనాలు వెనుకకుపోవడం, గుండ్లకమ్మ నదిలో నీరు అడుగంటడంతో సాగు ప్రశ్నార్ధకంగా మారింది. ఖరీఫ్‌లో 2400 హెక్టార్లు సాగుబడి కావాల్సి ఉండగా ఇప్పటికి ఒక ఎకరా కూడా సాగు చేసిన దాఖలాలు లేవు విపరీతమైన ఎండలు, వర్షాలు లేక పోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గతేడాది ఈ సమయానికే గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతాలైన తెల్లబాడు, పాతనాగిరెడ్డిపల్లి, జంగాలపల్లి, ఉప్పలపాడు, ములకలూరు, త్రిపురాపురం, ఐనవోలు ప్రాంతాలలో గుండ్లకమ్మ నది కింద బిబిటి 5204 వరిని సాగు చేసేవారు. గుండ్లకమ్మ ఎండిపోయే దశకు చేరుకోవడంతో కనీసం నార్లు కూడా పోయలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఐనవోలు గ్రామంలో గుండ్లకమ్మ నది ఒడ్డున లక్షల రూపాయల వరినారు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం అక్కడ భూముల్లో పిచ్చి చెట్లు కూడా మొలవని పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావుల కింద కూడా వ్యవసాయం కష్ట తరంగా మారిందని రైతులు వాపోతున్నారు. కనుచూపు మేరలో వర్షాలు పడే అవకాశం లేక రైతులు దిగాలు పడుతున్నారు. గతేడాది ఈ పాటికి పెసర, జీలుగ విత్తనాలు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుత సీజన్లో నేటివరకు విత్తనాలు ఎప్పుడు ఇస్తారనే సందేహాలు రైతులను వేధిస్తున్నాయి. ఒకవైపు విపరీతమైన ఎండలు పెరిగిన ఉష్ణోగ్రతలతో సాగు అనుకూలంగా లేక పొలాలను బీడు భూములుగా వదిలివేయక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది తిండి గింజలు పండించడం కష్టమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల రుణాల మాఫీపై స్పష్టమైన విధానం లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీరుతాయనే అనుమానాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాడి పరిశ్రమ పైన ఆధారపడదామనుకుంటే కనీసం పచ్చిగడ్డి వేసేందుకు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప తమకు గత్యంతరం లేదంటూ రైతులు దేవుడిని ప్రార్ధిస్తున్నారు.