breaking news
Kharif grain purchase
-
చివరి గింజనూ కొనాల్సిందే
* రైతు వెనుదిరిగితే బాధ్యత మీదే * తేమ శాతం నిబంధన తప్పని సరి * రైతులకు ‘మద్దతు’ ఇవ్వండి * అధికారులను ఆదేశించిన డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి సిద్దిపేట జోన్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతు వెనుదిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, రైతులు పండించిన పంట దళారుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ (డీఆర్డీఏ పీడీ) సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం స్థానిక స్త్రీ శక్తి భవన్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వినూత్నంగా వరి తరహాలోనే మొక్కజొన్నకు 3 గ్రేడింగ్‌లను అమలు చేస్తోందన్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయని, నవంబర్ 1 నుంచే స్లాబ్ విధానం ద్వారా 3 గ్రేడింగ్‌లో రైతు మక్కను కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ -గ్రేడ్‌కు రూ.1,310, బీ- గ్రేడ్‌కు రూ. 1,230, సీ- గ్రేడ్‌కు రూ. 1,180 చెల్లించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం, మక్క గింజలను నిబంధనలకు అనుగుణంగా తేమ శాతాన్ని పరీక్షించాలన్నారు. చెత్త, పొల్లు, తేమ శాతం పేరిట రైతు ధాన్యాన్ని తిరస్కరించ వద్దన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైతు ధాన్యంతో తిరిగి వెనక్కి వెళ్లకుండా స్థానిక కేంద్రాల్లోనే విక్రయించేలా నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతకుముందు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్థానిక అధికారులు డీఆర్డీఏ పీడీకి పలు సమస్యలు విన్నవించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పరీక్షించే మిషన్లు కాలం చెల్లినవిగా ఉన్నాయని, దీంతో తేమ శాతం గుర్తింపు ఇబ్బందిగా మారుతోందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని కేంద్రాల్లో ఏఈఓలు అదనపు బాధ్యతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఒక్కొక్కరికి ఆరు కొనుగోలు కేంద్రాల్లో శాంపిల్స్ పరీక్షించాల్సిన ఉండడంతో కొంత జాప్యం ఏర్పడుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక వెంటనే అలాంటి కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో తేమ శాతాన్ని పరీక్ష మిషన్లను మార్చుతామన్నారు. ధాన్యం పరీక్ష సమయంలో గింజ పరిమాణం, సైజు, నల్ల మచ్చల పేరిట తిరస్కరించవద్దని, గ్రేడింగ్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం ఎంతైనా కొనాల్సిందేనని అందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం పుష్కలంగా విడుదల చేసిందన్నారు. ఈ ఏడు రైతులకు ఆన్లైన్ విధానంలో డబ్బులు చెల్లిస్తున్నందున బిల్లుల చెల్లింపులలో నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఇక సిబ్బంది కొరతపై డీఆర్డీఏ పీడీ స్పందిస్తూ, సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమేనని, స్థానిక సమస్యలను సమయ స్ఫూర్తితో అధిగమించాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ఒకే సారి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకురాకుండా వారిలో అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గోదాంల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖతగా ఉందని, స్థానికంగా ప్రైవేటు గోదాములను జిల్లా అధికారులు పరీశీలిస్తున్నారని త్వరలో నిల్వ సమస్య పరిష్కారం కానుందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించే అధికారులు, ఆయా శాఖల సిబ్బంది సెలవులకు దూరంగా ఉండాలని, ధాన్యం, మక్కలు పెద్ద ఎత్తున వస్తున్న క్రమంలో సిబ్బంది ఓపికతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ఏపీడీ వెంకటేశ్వర్లు, డీఎల్సీఓ ప్రసాద్, జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్న ఐకేపీ, డీసీసీబీ, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూనే రైతుకు ప్రభుత్వం మద్ధతు ధర అందేలా సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లికలు స్పష్టం చేశారు. శనివారం వారు సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్ల కోసం విస్తృతంగా కేంద్రాలను ఏర్పాటు చేసి ఐకేపీ, సహకార సంఘాల ద్వా రా పెద్ద ఎత్తున కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా రైతు ఖాతాలో చేరే విధంగా ఆన్లైన్ విధానాన్ని జిల్లాలో ఇటీవలే మంత్రి హరీష్‌రావు ప్రారంభిచారన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి దళారుల ప్రమేయం లేకుండా చూస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వరి, మక్క కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించామని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు. మక్కగింజ నిల్వల కోసం గోదాముల్లో అనువైన సాంకేతిక పరికరాలను అమర్చడం జరుగుతుందన్నారు. దీని ద్వారా మక్క గింజల్లో నాణ్యత లోపం ఉన్నప్పటికి నిల్వ పరిమితి కాలం ఎక్కువైన గింజ నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. ఆ దిశగా మార్క్‌ఫెడ్ శాఖ ప్రత్యేక చర్యలను చేపడుతుందని స్పష్టం చేశారు. సిద్దిపేట డివిజన్ పరిధిలో 69 వరి, 41 మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తుందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ ఏపీడీ వెంకటేశ్వర్లు, డీఎల్సీఓ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఇక ఖరీఫ్ కొనుగోళ్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ధాన్యం సేకరణకు యాక్షన్‌ప్లాన్ విడుదలైంది. ఇందుకోసం జిల్లాలో 290 కేం ద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్ర భుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు మార్గదర్శకాలను నిర్దేశించారు. డీఆర్డీఏ ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ ఏడాది రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధా న్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. 36 మండలాలలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. గతేడాది ఇదే సీజన్లో 280 కేంద్రాల ద్వారా 1,39,500 మెట్రి క్ టన్నులు కొనుగోలు చేయగా, ఈసా రి పెరిగిన ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) అవసరాల దృష్ట్యా మరో పది కేంద్రాలను అదనంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 నుంచి 6 వరకు దశల వారీగా కేంద్రాలను ఏర్పాటు చేసి, దసరా తర్వాత కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసారీ సీఎంపీనే 2014-15 ఖరీఫ్ యాక్షన్‌ప్లాన్ ప్రకారం జిల్లాలో ఈ సీజన్లో 3,20,761 లక్షల హెక్టార్లకు గాను 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.33 లక్షల హెక్టార్లలో సోయా, 45 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 13,500 హెక్టార్లలో పత్తి, 13,500 హెక్టార్లలో పసుపు సాగవుతుందని అంచనా వేయగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2,12,680 హెక్టార్ల లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 86,881 హెకార్లలో రైతులు వరిని సాగు చేశారు. గతేడాదితో పోలిస్తే 19 వేల హెక్టార్లలో వరి సాగు తగ్గింది. ఈ నేపథ్యం లో రైతులు, పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఈసారి పౌరసరఫరాల శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ ద్వారా 50 కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా 240 కేంద్రాలను నిర్వహించనున్నారు. వీటి పర్యవేక్షణకు డిప్యూటీ తహశీల్దార్లను సూపర్వైజర్లుగా నియమించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వచేసేందుకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఉన్న సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు, కొన్ని రైసుమిల్లులను ఎంపిక చేశారు. ఆ తరువాత ధాన్యాన్ని వీలైనంత మేరకు ఈసారి కూడ కస్టమ్ మిల్లిం గ్ కోసం రైసుమిల్లర్లకు అప్పగించనున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు శిక్ష ణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న క్రమంలో తేమ లేకుండా ధాన్యం మార్కెట్‌కు తర లించేలా చూడాలని ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. మహిళా సంఘాలకు గతం (2010-11)లో ధాన్యం కొనుగోలుపై రూ.100లకు రూ.1.50లు కమీషన్ చెల్లించిన ప్రభుత్వం 2011-12లో రూ.2.50లకు పెంచింది. ఈసారి ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని గ్రేడ్-ఎ రకం ధాన్యం క్వింటాలుకు రూ.1,400, కామన్‌కు రూ. 1,365 చెల్లించి కొనుగోళ్లు జరపాల్సి ఉంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి కొనుగోళ్లు జరిగేలా చూడాలని రైతులు అంటున్నారు. ధాన్యంలో తేమ 14 శాతం దాటితే కొనుగోలు చేయకూడదన్న నిబంధనలతో పాటు గ్రేడ్-ఎ, కామన్ రకాల ధాన్యంలో రా రైసుమిల్లుకు విరుగుడు 25 శాతం, బాయిల్డ్కైతే 16 మించకుండా చూడాలన్న నిబంధన కూడ ఉంది. అయితే నిబంధనల పేరిట రైతులకు కనీస మద్దతు ధరకు ప్రతిబంధకాలు కలగకుండా చూడాలని అధికారులను రైతులు కోరుతున్నారు.