రూ.8 లక్షల పరిహారం చెల్లించండి
కేబీజీవీ విద్యార్థినుల మృతి కేసులో హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం (కేబీజీవీ) అధికారుల నిర్లక్ష్యంవల్ల మృతి చెందిన ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. చిన్నారులను కోల్పోవడంతో వారి తల్లిదండ్రుల గుండె గాయాలను మాన్పడం, ఆ బాధను కొలవడం సాధ్యం కాదని, అయితే ఈ పరిహారంవల్ల వారికి కాసింత ఉపశమనం లభిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్కో బాలికకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు..
అందులో రూ.5 లక్షలను ఆ బాలికల తల్లుల పేరిట, రూ.3 లక్షలను వారి మిగిలిన పిల్లల పేరిట డిపాజిట్ చేయాలంది. ఈ ప్రక్రియను 12 వారాల్లో పూర్తి చేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు. కనీస వసతులు లేని, విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారిన పాఠశాలలను మూసివేయడమే మేలని తన తీర్పులో అభిప్రాయపడ్డారు. అదిలాబాద్ జిల్లా, దహేగావ్లోని కేబీజీవీలో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు 2006 ఆగస్టులో పాము కాటుకు గురై మరణించారు. పాఠశాల అధికారులు సకాలంలో స్పందించి ఉంటే బాలికలిద్దరూ బతికి ఉండేవారని, నిర్లక్ష్యం వల్లే వారు మృత్యువాత పడ్డారన్నారు.