కందికుంట అనుచరుల వీరంగం
– అప్పు చెల్లించాలని వచ్చిన వారిపై దాడి
– టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి ఫోన్ కాల్‌తో వెనక్కు తగ్గిన వైనం!
– చివరకు కేసులు లేకుండా రాజీ
కదిరి : అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అనుచరులు రెచ్చిపోయారు. అప్పు అడగడానికి వచ్చిన వారిపై దాడి చేశారు. చివరకు వారు తమ పార్టీ వారేనని తెలియడంతో కేసులు లేకుండా రాజీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల చిన్నన్నరూములు వీధిలో కాపురముంటున్న ఉప్పులూరు రామసుబ్బారెడ్డి, వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లికి చెందిన బోరెడ్డి నరసింహారెడ్డిలకు కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య రూ.1.25 కోట్ల అప్పు ఉన్నారు. దీంతో ఆయన కదిరి బస్టాండ్ సమీపంలో ని తన ‘జొన్నా లాడ్జీ’ని వారి పేరుపై 2014 జూలై 7న ఆయకపు దస్తావేజు రాయించారు. తమ అప్పు చెల్లించాలంటూ వారు కొన్ని నెలలుగా రామయ్యపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు దష్టికి కూడా వెళ్లింది. ఎస్పీ ఈ కేసును పరిష్కరించాలంటూ సీఐ గోరంట్ల మాధవ్‌కు అప్పగించారు.
అయితే.. ఈ మధ్యే ఆ లాడ్జీని రామయ్య కదిరి టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకొని వారు బుధవారం మరో 10 మందిని వెంటబెట్టుకొని నేరుగా జొన్నా లాడ్జీ వద్దకు చేరుకున్నారు. ‘మా అప్పు ఇస్తావా? లేదంటే లాడ్జీకి తాళం వేయమంటావా?’ అంటూ గట్టిగా దబాయించారు. ఇదే సందర్భంలో అక్కడే ఉన్న రామయ్య తనయుడు పరమేష్ (‘నా మనసుకేమైంది’ సినిమా హీరో) జోక్యం చేసుకున్నాడు. దీంతో వారు అతని చొక్కా చింపి దాడికి దిగారు. ఇప్పటికే తాము వీరికి రూ100కి రూ.10 చొప్పున వడ్డీలు కట్టామని, అయినా తమను చంపడానికి వచ్చారంటూ పరమేష్ మీడియా ముందు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కందికుంట వెంకట ప్రసాద్ తన అనుచరులతో లాడ్జీ వద్దకు చేరుకున్నారు. ఆయన వేంపల్లి మండలానికి చెందిన నరసింహారెడ్డితో మాట్లాడుతుండగానే.. అనుచరులు ఒక్క సారిగా దాడికి దిగారు. విషయం తెలుసుకున్న కదిరి టౌన్ ఎస్ఐలు మ«ధుసూధన్‌రెడ్డి, గోపాలుడు సిబ్బందితో అక్కడికి చేరుకొని రామసుబ్బారెడ్డితో పాటు నరసింహారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి విషయం తెలుసుకొని నేరుగా కందికుంటతో ఫోన్లో మాట్లాడి వారు తమ అనుచరులేనని, రాజీ చేసి పంపాలని చెప్పినట్లు సమాచారం. దీంతో కందికుంట సూచన మేరకు ఇరువర్గాలు ఎటువంటి కేసులూ వద్దంటూ పోలీస్‌స్టేషన్‌లో రాసిచ్చి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.