kalinga institute
-
ఒడిశాలో నేపాల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హాస్టల్లో ఏం జరిగింది?
భువనేశ్వర్: ఒడిశాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో విద్యార్థిని మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సదరు విద్యార్థిని నేపాల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఇక, మూడు నెలల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం అనుమానాలను తావిస్తోంది.వివరాల ప్రకారం.. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(22)ని మృతిచెందింది. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్గంజ్. సదరు విద్యార్ధిని గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలికల హాస్టల్లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దీంతో, యూనివర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.మూడు నెలల్లో ఇద్దరు మృతి..ఇక, గత మూడు నెలల్లో కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మరణించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 16న బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లమ్సాల్ అనే నేపాల్ విద్యార్థిని కూడా ఇదే విధంగా హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో సహచర విద్యార్థి ఒకరు తనను లైంగికంగా వేధించారని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ (ఐఆర్వో) కు ఫిర్యాదు చేసినట్టు తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది ‘తీవ్ర నిర్లక్ష్యం’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) వ్యాఖ్యానించింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించడంతో, ఆమె మరణించిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశారు. బీజేడీ నేత, మాజీ ఎంపీ అచ్యుత సమంత స్థాపించి, నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.A Nepali undergraduate student was found dead in her hostel room in Bhubaneswar’s Kalinga Institute of Industrial Technology (KIIT) on Thursday (May 1) evening. This is the second such case in less than three months.Prisha Shah was studying computer science and hails from… pic.twitter.com/XcCVY9vM6X— News9 (@News9Tweets) May 2, 2025 -
కేఐఐటీ డీయూలో వై20 కన్సల్టేషన్స్
భువనేశ్వర్: జీ20 సదస్సులో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ(కేఐఐటీ డీయూ)లో ‘వై20 కన్సల్టేషన్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని 21వ శతాబ్దంలో మన దేశాన్ని అగ్రగామిగా తీర్చదిద్దడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పడంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. వై20 కన్సల్టేషన్స్‌కు కేఐఐటీ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత అధ్యక్షత వహించారు. -
60 కుటుంబాలు.. ఒక జలదేవత
గొడ్డలి నీటిలో పారవేసుకుంటే జలదేవత ప్రత్యక్షమవడం మనకు తెలుసు. కాని ఇక్కడ నీళ్లు లేవు. పారవేసుకోవడానికి పెన్నిధీ లేదు. ఆకలి బతుకుల గిరిజన జీవితం తప్ప. ఒరిస్సా అడవిలో అరవై కుటుంబాలు. ఎవరికి పడతాయి. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోతున్నాయి. అప్పుడు మాలతి సిసా వచ్చింది. ఏకంగా నీరు తగిలేంత లోతు బావి తవ్వింది. ‘వాటర్ గర్ల్’ అని మీడియా అంటోంది. జలదేవతే సరైన పదం. ఇది అచ్చు సినిమాల్లో జరిగినట్టే జరిగింది. 25 ఏళ్ల మాలతి భువనేశ్వర్‌లోని కళింగ యూనివర్సిటీలో ఎం.ఏ ఎకనామిక్స్ చేసి మల్కన్‌గిరి జిల్లాలోని తన గ్రామం బోండాఘాటీకి చేరుకుంది రెండు నెలల క్రితం. బోండాఘాటి అడవి ప్రాంతం. అక్కడ బోండులు అనే గిరిజన తెగ జీవిస్తూ ఉందని 1950 వరకూ భారత ప్రభుత్వం గుర్తించలేదు. గుర్తించాక కూడా వారి కోసం జరిగింది తక్కువ. ఇంకా చెప్పాలంటే మాలతి ఆ ఊరి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అమ్మాయి. అంటే ఇన్నేళ్లు అక్కడ వారి అభివృద్ధికి ఏ మేరకు పని జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సరే, అభివృద్ధి పెద్దమాట. తాగడానికి నీళ్లు ప్రాణాధారం కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్నట్టే ఇప్పుడూ తన కుటుంబం నీళ్ల కోసం అవస్థ పడటం మాలతి గమనించింది. ఊళ్లో ఉండే బోరింగులు పాడయ్యాయి. కుళాయిలు పని చేయవు. నీళ్లు కావాలంటే తల్లి, తన ముగ్గురు చెల్లెళ్లు కిలోమీటరు మేర బిందెలు తల మీద పెట్టుకుని బయలుదేరాల్సిందే. ఇంతకు ముందు ఇదంతా మామూలు మాలతికి. కాని ఇప్పుడు తను చదువుకుంది. తనకు జరుగుతున్న అన్యాయం ఏమిటో... తమ వారి పరిస్థితులు ఏమిటో... బయట లోకం ఎలా ఉందో చూసింది. ఈ కష్టాలు మనమే తీర్చుకోవచ్చు అని తల్లిదండ్రులకు చెప్పింది. ‘మనమే బావి తవ్వుదాం’ అంది. ఇలా ఊళ్లో ఎవరూ ముందుకు వచ్చిన దాఖలా లేదు. మాలతి తండ్రి ధబులు, తల్లి సమరి కూతురికి సపోర్ట్ చేయాలనుకున్నారు. మాలతి ముగ్గురు చెల్లెళ్లు సుక్రి, లిలీ, రంజిత... ‘అక్కా... మేము నీకు సాయం పడతాం’ అన్నారు. ‘ఈ బావి మన కోసం మాత్రమే కాదు... ఊళ్లో ఉన్న 60 కుటుంబాల కోసం’ అంది మాలతి. వెంటనే బావి తవ్వే పని మొదలైంది. మాలతి, ఆమె ముగ్గురు చెల్లెళ్లు పలుగూ పారా తీసుకుని నాలుగైదు అడుగుల వెడల్పు ఉన్న చుట్టు బావి తవ్వడం మొదలెట్టారు. తలా కొంచెం తవ్వి పోస్తున్నారు. 14 అడుగుల లోతుకు వెళ్లాక నీళ్లు పడ్డాయి. కాని సహజంగానే అవి బురద నీరు. ఆ నీటిని తోడి పోస్తూ మరి కాస్త లోతుకు వెళితే తేట నీరు వస్తాయి. ‘నా దగ్గర డబ్బు లేదు. అయినా నీ కోసం ప్రయత్నిస్తా’ అని తండ్రి అటు తిరిగి ఇటు తిరిగి 7 వేలు తెచ్చి మాలతికి ఇచ్చాడు. మాలతి దాంతో మోటరు కొని బురద నీళ్లు బయటకు తోలించింది. మళ్లీ బావి తవ్వింది. ఇప్పుడు తేట నీళ్లు వచ్చాయి. తియ్యటి నీళ్లు. దాహం తీర్చే నీళ్లు. ఊళ్లోని అందరూ వచ్చి ఈ నీళ్లు చూసి మాలతిని పట్టుకుని మెటికలు విరిచారు. ‘మా తల్లే మా తల్లే’ అన్నారు. మాలతిని చూసి ఇంకో రెండు మూడు యువ బృందాలు మరో రెండు మూడు బావులు తవ్వుతున్నాయి. అవి పూర్తవుతున్నాయి కూడా. ఈ సంగతి తెలిసిన మీడియా మాలతి మీద కథనాలు రాసి ఆమెను ‘వాటర్ గర్ల్’గా వ్యాఖ్యానించాయి. అధికారులు కదిలారు. ‘మీ బావి ఖర్చు, కూలి ఖర్చు ఇస్తాం’ అంటున్నారు. ‘వాటి సంగతి తర్వాత నా బావికి సిమెంటు రింగులు లేవు అవి వేయించండి’ అంటోంది మాలతి. మాలతి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి గొప్ప పని చేసింది’ అంటున్నారు. మాలతి ఇంతటితో ఆగాలని అనుకోవడం లేదు. గూడెంలో పిల్లలకు చదువు చెప్పాలని అనుకుంటోంది. అందరి కోసం పని చేయాలని అనుకుంటోంది. అంతా కలిసి 25 వేల జనాభా కూడా ఉండదు బోండులది. అరుదైన తెగ అది. దానిని కాపాడుకుని సంతోషంగా ఉండేలా చూడటం కూడా చేయడం లేదు ప్రభుత్వాలు. వారి కళ్లు తెరుచుకోవాలంటే ఇంటికో మాలతి అవసరమే. -
టైమ్స్ హయ్యర్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో కేఐఐటీ
కోల్‌కతా: టైమ్స్ హయ్యర్ వరల్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్–2019లో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ)కి తొలిసారి చోటుదక్కింది. ప్రపంచంలోని 1001 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఈ నెల 26న విడుదల అయిన జాబితాలో తూర్పు భారత్ నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఏకైక సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీ కేఐఐటీనే కావడం విశేషం. వర్సిటీ వ్యవస్థాపకురాలు ప్రొ. అచ్యుతా సమంత తమకు దక్కిన ర్యాంక్‌పై హర్షం వ్యక్తం చేస్తూ..దేవుడి ఆశీస్సులు, సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 1997లో ఓ అద్దె భవనంలో కళాశాలగా ప్రారంభమైన కేఐఐటీ 2004లో డీమ్డ్ యూనవర్సిటీ హోదా దక్కించుకుంది.