breaking news
Justice Kurian Joseph
-
తమిళనాడుకు స్వయంప్రతిపత్తి!
చెన్నై: రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలకు అధికారాలు, హక్కులు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడుకు స్వయంప్రతిపత్తి(అటానమీ) సాధించే దిశగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంప్రతిపత్తిపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.స్టాలిన్ మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కులకు పరిరక్షించుకోవడానికి, కేంద్ర–రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న పరిస్థితులు దాపురించాయని, దీనికి సంబంధించి రాజ్యాంగంలోని నిబంధనలను పునఃసమీక్షించాలని చెప్పారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై అమల్లో ఉన్న విధానాలు, చట్టాలు, సహకార సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలను సమానంగా సృష్టించినట్లు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు. పరస్పరం సహకరించుకోవాలి తప్ప ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు, అధికారాలను క్రమంగా నీరుగారుస్తూ పెత్తనం సాగిస్తోందని, రాజ్యాంగం సూచించిన సున్నితమైన సమతూకాన్ని దెబ్బతీస్తోందని ఆక్షేపించారు. బలహీనమైన రాష్ట్రాలతో బలమైన కేంద్రాన్ని నిర్మించడం సాధ్యం కాదన్నారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం తమిళనాడుకు స్వయంప్రతిపత్తి కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని స్వయంప్రతిపత్తిపై స్టాలిన్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్లలోగా పూర్తిస్థాయి నివేదిక ఉన్నత స్థాయి కమిటీలో అశోక్‌వర్దన్ షెట్టీ, ఎం.నాగనాథన్ను సభ్యులుగా నియమిస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి, స్వయంప్రతిపత్తి సాధనపై సిఫార్సులు చేస్తుందని అన్నారు. 2026 జనవరి నాటికి మధ్యంతర నివేదిక, రెండేళ్లలోగా పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని చెప్పారు. స్టాలిన్ ప్రకటనను విపక్ష అన్నాడీఎంకే నేతలు తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకున్నప్పుడు స్వయంప్రతిపత్తి గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. -
జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గురువారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులోని ప్రముఖ న్యాయమూర్తుల్లో జస్టిస్ జోసెఫ్ ఒకరని సుప్రీం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశంసించారు. ఈ ఏడాది జనవరిలో బెంచ్‌లకు కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ మదన్.బి.లోకూర్‌తో కలిసి జస్టిస్ జోసెఫ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధమనీ, చెల్లదని ప్రకటించిన ధర్మాసనంలో జోసెఫ్ ఉన్నారు. కొలీజియం సిఫార్సులపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై, తాజ్‌మహల్ పరిరక్షణపై జస్టిస్ జోసెఫ్ చాలాసార్లు బహిరంగ లేఖలు రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జీల నియామకానికి కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ జ్యూడీషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ చట్టాన్ని జస్టిస్ జోసెఫ్ బెంచ్ కొట్టివేసింది. 1,035 తీర్పులతో టాప్–10 సుప్రీం జడ్జీల జాబితాలో పదో స్థానం దక్కించుకుని జస్టిస్ జోసెఫ్ అరుదైన ఘనత సాధించారు. కాగా, ఉన్నత న్యాయస్థానాలు యువ న్యాయవాదులను జడ్జీ బాధ్యతలు స్వీకరించేలా ఆకర్షించలేకపోతున్నాయని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కేరళ నుంచి మొదలైన ప్రస్థానం.. జస్టిస్ జోసెఫ్ కేరళలో 1953, నవంబర్ 30న జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఎర్నాకులం జిల్లాలోని సెయింట్ జోసెఫ్ స్కూలులో పూర్తిచేశారు. అనంతరం తిరువనంతపురంలోని కేరళ లా అకాడమీ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీని అందుకున్నారు. కేరళ హైకోర్టులో 1979లో ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన, 1994లో అక్కడే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆరేళ్ల అనంతరం జస్టిస్ జోసెఫ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010, ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చివరకూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013, మార్చి8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్ పదోన్నతి పొందారు. -
‘కొలిజియం సిఫార్సును తోసిపుచ్చలేరు’
సాక్షి, తిరువనంతపురం : ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సుప్రీం కొలిజియం చేసిన సిఫార్సును కేంద్రం తోసిపుచ్చిన క్రమంలో నెలకొన్న వివాదం కొనసాగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం కొలిజియం చేసిన సిఫార్సును కేంద్రం తిరస్కరించడం తగదని సుప్రీం కోర్టు కొలీజియం సభ్యుడు జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. కేంద్రం నిర్ణయంపై తీవ్ర చర్చ జరుగుతోందని, ఇలాంటి ఉదంతం గతంలో ఎన్నడూ చోటుచేసుకోలేదన్నారు. కేఎం జోసెఫ్‌ను సుప్రీం న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన కొలిజియంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, మదన్ బీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు సభ్యులుగా ఉన్నారు. మరోవైపు కేఎం జోసెఫ్ అంశంపై నిర్ణయాన్ని సుప్రీం కోర్టు పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించిన క్రమంలో కురియన్ జోసెఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, జోసెఫ్ నియామకం వాయిదా పడిన క్రమంలో కోల్‌కతా, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను కూడా సుప్రీం న్యాయమూర్తుల నియామకానికి కొలిజియం పరిశీలిస్తోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఇందూ మల్హోత్రా పేరును ఆమోదించిన కేంద్రం జోసెఫ్ ఫైల్‌ను పునఃపరిశీలించాలని కొలిజియంకు తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఆయన నియమాకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ వివరిస్తూ ఆరు పేజీల వివరణాత్మక నోట్‌ను కూడా కేంద్రం పంపింది. -
అక్కడ అంతా సమానులే
ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు. ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ ((2017) 1 ఎస్సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిసెస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ లోకుర్, కురియన్ జోసెఫ్ కలసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు రెండు మాసాల క్రితం రాసిన లేఖ పూర్తి పాఠం. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన న్యాయ సంబంధమైన కొన్ని ఆదేశాలు ‘న్యాయ వ్యవస్థ నిర్వహణ మీద ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించాయి’అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులలో పైన పేర్కొన్న ఆ నలుగురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ ఆ లేఖ– గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిగారికి! అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న కొన్ని ఆదేశాలు మొత్తం న్యాయ వ్యవస్థ పని తీరు మీద, హైకోర్టుల స్వాతంత్య్రం మీద, వీటితో పాటు గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థ నిర్వహణ మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఈ అంశాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకు రావడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆందోళనతో, తీవ్ర క్షోభతో ఈ లేఖ రాశాం. కలకత్తా, బొంబాయి, మద్రాసు హైకోర్టులు మూడింటిని ప్రత్యేక అధికారాలతో నెలకొల్పిన నాటి నుంచి న్యాయ వ్యవస్థలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఆ మూడు హైకోర్టులు ఆవిర్భవించిన తరువాత దాదాపు వందేళ్లకు రూపుదిద్దుకున్న ఈ అత్యున్నత న్యాయస్థానం ఆ ఆచారాలూ, సంప్రదాయాలనే స్వీకరించింది. ఈ సంప్రదాయాలన్నీ ఆంగ్లో– సాక్సన్ న్యాయ సిద్ధాంత అధ్యయనం, అమలు ద్వారానే నెలకొన్నాయి. ఒకసారి స్థిరపడిన ఈ సిద్ధాంతాల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ (జాబితా)లో, ఆ రోస్టర్‌ను నిర్ణయించడంలో అధికారం కలిగిన పెద్ద అనే హోదా దక్కించుకున్నారు. లావాదేవీలు జరిపేందుకు అవసరమైన కోర్టుల సంఖ్య, కోర్టులు నడిచేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు ఏర్పాట్లు, సుప్రీంకోర్టులో ధర్మాసనం/సభ్యుని నిర్ణయం వంటివాటికి ప్రధాన న్యాయమూర్తి బాధ్యులు. రోస్టర్‌ను రూపొందించడంలో, వ్యాజ్యాన్ని సభ్యులకు/ధర్మాసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక హక్కును గుర్తించడమనేది కూడా సంప్రదాయమే. ఇది కోర్టు లావాదేవీలు సమర్థంగా, క్రమపద్ధతిలో సాగేందుకు ప్రవేశపెట్టిన సంప్రదాయమే కానీ, దీనితో ప్రధాన న్యాయమూర్తి న్యాయ నిర్వహణ పరంగా, వాస్తవంగా మిగిలిన తన సహచరుల కంటే అధికునిగా గుర్తించడానికి కాదు. న్యాయ శాస్త్ర వ్యవహారాలలో స్థిరపడిన సంప్రదాయం ప్రకారం భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి అంటే, తనతో సమ స్థాయిలో ఉన్నవారిలో మొదటివారు మాత్రమే అవుతారు. అంతకు మించి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలాగే రోస్టర్ నిర్ధారణలో కూడా ప్రధాన న్యాయమూర్తికి మార్గదర్శకంగా ఉండే విధంగా బాగా స్థిరపడిన, కాల పరీక్షకు నిలిచిన సంప్రదాయాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ వ్యాజ్యానికి సంబంధించిన ధర్మాసనాన్ని పటిష్టం చేయడానికి అవసరమైన సంప్రదాయాలను పాటించాలి. పైన పేర్కొన్న ఈ సిద్ధాంతం సహజ పరిణామం ఏమిటంటే బహుళ సభ్యులు కలిగిన ఒక చట్ట బద్ధ వ్యవస్థలో ఉన్నవారు, ఈ ఉన్నత న్యాయస్థానం సభ్యులతో సహా– ఒక ప్రత్యేక వ్యాజ్యం కోసం నియమించిన ధర్మాసనం మీద తమకు తాము ఆధిపత్యం తెచ్చుకోకూడదు. ధర్మాసనం కూర్పులో గానీ, సంఖ్య విషయంలో గాని నిర్ధారించిన రోస్టర్ మేరకు జరిగిన నిర్ణయం మీద వారు ఆధిపత్యం చేయలేరు. ఈ రెండు నియమాలను అధిగమించినట్టయితే వికృతమైన, అవాంఛనీయమైన పరిణామాలు ఎదురవుతాయి. వ్యవస్థ పరిపూర్ణత గురించి సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటి సంక్షోభం గురించి మౌనం వహించడం కూడా అలాంటి పలాయనం ఫలితమే కాగలదు. ఇటీవలి కాలంలో ఈ రెండు నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండే పరిస్థితి లేదని చెప్పడానికి చింతిస్తున్నాం. ప్రధాన న్యాయమూర్తి అప్పగించిన వ్యాజ్యం ద్వారా జాతికి, వ్యవస్థకి విస్తృత స్థాయి పరిణామాలు ఎదురైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే ఆ కేసుల కోసం ధర్మాసనాలలో నియమించిన ‘వారి సమక్షం’గురించి ఎలాంటి హేతుబద్ధత కనిపించదు. ఎంత మూల్యం చెల్లించి అయినా ఇలాంటి దాని నుంచి రక్షణ కల్పించాలి. వ్యవస్థను ఇబ్బందికి గురి చేయరాదన్న ఉద్దేశంతోనే మేం పూర్తి వివరాలను ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ పైన పేర్కొన్న నిబంధనల ఉల్లంఘన కారణంగా వ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే కొంతమేర దెబ్బతిన్నది. పైన పేర్కొన్న ఈ నేపథ్యంలోనే ఆర్.బి. లూథ్రా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో అక్టోబర్ 27, 2017న ఇచ్చిన ఆదేశాలను గురించి కూడా మీ దృష్టికి తీసుకురావడం తప్పనిసరి అని భావించాం. ఈ న్యాయస్థానంలో అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్–ఇతరులు వర్సెస్ భారత ప్రభుత్వం కేసులలో (2016)5 ఎస్సీసీ1) రాజ్యాంగ ధర్మాసనం అదే విధాన క్రమపత్రం గురించి విచారిస్తున్నది. ఆ కేసుపై ఇచ్చిన ఆదేశంలో ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనుసరించవలసిన పద్ధతికి సంబంధించిన విధాన పత్ర రూపకల్పనలో మరింత జాప్యం నివారించాలని చెప్పారు. అయితే అదే విధాన క్రమపత్రం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుండగా జాప్యం జరగరాదని ఇతర బెంచ్ ఎలా చెప్పగలుగుతుందో అర్థం చేసుకోవడం కష్టం. ఇదే కాకుండా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం దరిమిలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన (మీతో సహా) కొలీజియం క్షుణ్ణంగా చర్చించి విధాన క్రమపత్రానికి తుది రూపం ఇవ్వడం జరిగింది. దీనినే మార్చి నెల 2017లో గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. కానీ ఈ సమాచారానికి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కేంద్రం మౌనం నేపథ్యంలో కోలీజియం ఆమోదించి తుది రూపం ఇచ్చిన విధాన క్రమపత్రానికి సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (సుప్ర) కేసులో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా భావించవలసి వచ్చింది. ఆ విధంగా విధాన క్రమపత్రం తుది రూపానికి సంబంధించి పరిశీలించడానికి ధర్మాసనానికి ఎలాంటి అవకాశం కూడా లేకపోయింది. ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు. ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ (2017)1 ఎస్సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. విధాన క్రమపత్రం విషయంలో ఏ అంశాన్నయినా ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనే, అది కూడా అందరు న్యాయమూర్తులు కలసి చర్చించాలి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఆ అంశంలో చట్టపరిధికి సంబంధించిన నిర్ణయం తీసుకోవలసి వస్తే అది ఒక్క రాజ్యాంగ ధర్మాసనమే తీసుకోవాలి. పైన పరిణామాన్ని ఇంత తీవ్రమైన అంశం అన్న స్థాయిలోనే పరిశీలించాలి. విధి నిర్వహణలో నిబద్ధంగా వ్యవహరించే గౌరవ ప్రధాన న్యాయమూర్తి కొలీజియంతో పూర్తి స్థాయి చర్చలు జరిపి పరిస్థితిని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం. అలాగే తరువాతి దశలో ఇందుకు అసవరమైతే ఇతర న్యాయమూర్తులతో కూడా చర్చించాలి. పైన ఉదహరించిన, అంటే ఆర్పీ లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వం వాజ్యంలో అక్టోబర్ 27, 2017న కోర్టులో వెలువడిన ఆదేశాల విషయంలో మీరు మళ్లీ ఒకసారి దృష్టి సారించగలిగితే, ఈ న్యాయస్థానం ఇచ్చిన అలాంటి ఇతర ఆదేశాలను కూడా మీ ముందుకు తీసుకువస్తాం. వాటిని కూడా అదే తీరులో పరిశీలించవలసి ఉంది. గౌరవాభినందనలతో... జె. చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ బి లోకుర్, కురియన్ జోసెఫ్ -
ఉర్దూలో నీట్‌కు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఉర్దూలో నిర్వహించడానికి సిద్ధమేనని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు . ఈ ఏడాది ఉర్దూ మాధ్యమంలో నీట్ నిర్వహణ సాధ్యం కాదని ఆయన కోర్టుకు విన్నవించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నీట్‌ను ఉర్దూలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కేసులో తమ అభిప్రాయాన్ని మార్చి22లోగా తెలియజేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీసీఐ), సీబీఎస్సీలను సుప్రీం ఆదేశించింది.