breaking news
jumping japongs
-
తెలంగాణలో కాషాయ కథలు.. అలా జరిగితే బీజేపీ పెద్ద తప్పు చేసినట్లేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన విషయం చెప్పారు. తన కుమార్తెను పార్టీనే మారాలని బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చిందని ఆయన తెలిపారు. దేశంలో బీజేపీ వికృత రాజకీయాలకు ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కచ్చితంగా అలా జరిగితే బీజేపీ పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. సహజంగానే బీజేపీ ఈ ఆరోపణను తోసిపుచ్చుతుంది. కాని కేసీఆర్ ఈ సంగతి తెలియచేసినప్పుడు ఏ సందర్భంలో బీజేపీ అంత సాహసం చేసింది? దానికి రాయబారం చేసింది ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారన్న అభియోగంపై ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా, కవిత వద్దకు ఆ ప్రతిపాదన చేసినవారిని ఆధారసహితంగా పట్టుకుని ఉంటే బీజేపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడి ఉండేది. సంతలో సరకు కాదు కదా.! అసలు ఈ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోళ్లు, ఆయా రాజకీయ పార్టీల వైఖరులు, న్యాయవ్యవస్థలో డీల్ చేస్తున్న వైనం అన్నింటినీ పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయి. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు జరుగుతున్న తీరు చూస్తే పలు ప్రశ్నలు తొలుస్తాయి. ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం పెద్ద నేరం అయితే, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేయడం అనండి.. అమ్మేయడం అనండి.. పూర్తిగా జరిగిపోతే మాత్రం అది పెద్ద కేసుగా మారకపోవడంపై మనబోటివాళ్లకు బోలెడు డౌట్లు రావచ్చు. వాటిని ఎవరూ తీర్చే పరిస్థితి మన దేశ ప్రజాస్వామ్యంలో లేదేమో! ఆయా రాష్ట్రాలలో, కేంద్రంలో జరుగుతున్న ఫిరాయింపుల పర్వాలను గమనించినప్పుడు ఈ అభిప్రాయం కలుగుతుంది. ఇక తెలంగాణలో తాజా విషయానికొస్తే.. టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీతో సంబంధాలు ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారన్నది అభియోగం. దానిపై వారిని ఆడియో, వీడియో ఆధారాలతో అరెస్టు చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరినవారు. వారు మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో విలీనం అయ్యారు. అసలు ఈ విలీనాలు ఎంతవరకు హేతుబద్దం అంటే సమాధానం దొరకదు. ఈ ప్రశ్నకు శాసనవ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఇప్పటికీ జవాబు ఇవ్వలేదు. రాజకీయ వ్యవస్థలో అధికారంలో ఉన్నవారు తమ ఇష్టానుసారం చేసుకుపోతున్నారు. నిజానికి ఒక పార్టీ శాసనసభా పక్షం విలీనం అన్నది ఫిరాయింపుల చట్టాన్ని వక్రీకరించడమే అనిపిస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే క్రమంలో శాసనసభా పక్షంతో పాటు, పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు అన్నీ తీర్మానాలు చేసి ఎన్నికల సంఘం ఆమోదం కూడా పొందాయి. అంత కష్టం ఎందుకని రాజకీయ నేతలు భావించినట్లు ఉన్నారు. వెనక తతంగం, ముందు స్వాగతం తమకు అవసరమైన ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిపేసుకుని పార్టీ ముద్ర వేస్తే సరిపోతుందన్న ఐడియాను కనిపెట్టారు. దీనికి ఏ ముఖ్యమైన పార్టీ అతీతం కాదని చెప్పాలి. కొన్ని రాష్ట్రాలలో బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహించి వారితో రాజీనామా చేయించి తమకు పూర్తి మెజార్టీ వచ్చేలా చేసుకుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఇదే పద్దతి అవలంభించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీని ముందుగా మరో పార్టీలోకి విలీనం చేయించి, తదుపరి ఆ పార్టీని బీజేపీలో కలుపుకున్నారు. రాజస్తాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యేలను ఇదే పద్దతిలో కాంగ్రెస్ కలుపుకుంది. ఏపీ, తెలంగాణలలో గత టరమ్‌లో ఆ పాటి కష్టం కూడా పడలేదు. తెలంగాణలో ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్, బిఎస్పీ, సిపిఐ వంటి పక్షాల ఎమ్మెల్యేలను తడవతడవులుగా టీఆర్ఎస్లో చేర్చుకుని పార్టీ ఆఫీస్‌లోనే కండువా కప్పేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా, పెద్దగా ఫలితం రాలేదు. స్పీకర్ వ్యవస్థ ఈ ఫిరాయింపులకు పూర్తిగా సహకరించినట్టయింది. 23కు సరిగ్గా 23 జవాబు ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 మధ్య కాలంలో వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు అప్పట్లో తన పార్టీలో చేర్చుకున్నారు. పైకి డబ్బుల వ్యవహారం కనిపించకపోయినా.. ఏం జరిగిందో సామాన్యడు కూడా చెప్పగలడు కాబట్టే.. 2019 ఎన్నికల్లో ఆయనకు 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారని చెబుతారు. నాడు వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పినప్పుడు వీరిలో ఒక ఎమ్మెల్యే అయితే బహిరంగంగానే తాను ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయానని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే తనకు ఉన్న కోట్ల అప్పులన్నీ ఫిరాయింపుతో వచ్చిన డబ్బుతో తీర్చేసినట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణలలో ఇలా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు కూడా అయ్యారు. వీరు నేరం చేసినట్లా? కాదా? వీరిపై కోర్టులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎందుకు చర్య తీసుకోలేదు? వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదు. అంతెందుకు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏజెంట్‌గా వెళ్లిన రేవంత్ రెడ్డి నగదు కట్టలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా.. ఇంత వరకు కేసు తెమలలేదు. పైగా మనవాళ్లు బ్రీఫ్డ్మీ అంటూ ఫోన్లో మాట్లాడినట్టు కేసు ఎదుర్కొంటోన్న చంద్రబాబు.. ఆ మాటలు నావి కావు అని చెప్పకుండా.. ఓటుకు లంచం ఇవ్వడం నేరం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. న్యాయపరమైన అంశాలేంటీ? ఒక ఈశాన్య రాష్ట్రంలో మాత్రం ఇలాంటి ఫిరాయింపునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఇతర రాష్ట్రాలలో ఎందుకు ఇలాంటి నిర్ణయాలు చేయలేదు? స్పీకర్లు ఎందుకు ఈ ఫిరాయింపులకు ఆమోద ముద్ర వేశారు? ఇది న్యాయ సమ్మతమేనా? ఇలాంటి సందేహాలు ఉన్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మకంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని కొనుగోలు చేయబోయారన్న అభియోగంపై ముగ్గురిని అరెస్టు చేయించి ఒక సంకేతాన్ని ఇచ్చారు. తద్వారా ఇలాంటి లావాదేవీలలో ఎవరు పాల్గొన్నా అరెస్టులు తప్పవన్న హెచ్చరిక చేసినట్లయింది. అయితే అదే సమయంలో కేవలం ఫోన్ లావాదేవీలు, మంతనాల ఆధారంగానే కేసులు అవుతాయా అన్న చర్చ ఉంది. దానిపై న్యాయ వ్యవస్థ కూడా భిన్నరూపాలలో నిర్ణయాలు చేసింది. ఏసీబీ కోర్టు అరెస్టు చెల్లదని చెబితే హైకోర్టు చెల్లుతుందని పేర్కొంది. బీజేపీ దీనిపై సీబీఐ విచారణ కోరితే హైకోర్టు అంగీకరించలేదు. ఈ కేసుతో బీజేపీ పిటిషన్ వేయడాన్ని ప్రశ్నించింది. నేరుగా సంబంధిత పార్టీ కాదు కదా అని అభిప్రాయపడింది. ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందా? కానీ ఇదే సమయంలో కొన్ని కేసులలో ఎవరో సంబంధం లేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే సీబిఐ విచారణ చేయించడం, కొంతమంది ప్రముఖులను నెలల తరబడి జైలులో ఉంచడం వంటి ఘటనలు కూడా జరిగాయి. పిల్స్ విషయంలో న్యాయ వ్యవస్థ దేశ వ్యాప్తంగా ఒక పద్దతి అనుసరించడం లేదని న్యాయ కోవిదులే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన విషయం వెల్లడించారు. తన కుమార్తెనే బీజేపీ వారు పార్టీ మారమన్నారని ఆరోపించారని కథనం. దీనికి సంబంధించి ఏదైనా ఆధారం బయటపెట్టి ఉంటే దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి ఉండేది. భవిష్యత్తులో ఏమైనా కొత్త సమాచారం ఇస్తారేమో చూడాలి. ఈ తరహా రాజకీయాలపై తెలంగాణ నుంచే పోరాటం ఆరంభిస్తామని ఆయన అన్నారు. ఇది మంచి విషయమే. కానీ ముందుగా తాను కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఈ పోరాటం చేస్తే ఇంకా గొప్పపేరు వస్తుంది. ఇప్పటికైనా ఆయన ఒక విధాన నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన అంశమే. పార్టీ మారతారా అని అడిగితే చెప్పుతో కొడతామని చెప్పండని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ మారొచ్చా? ఎలా మారాలి? ఇక్కడే ఒక అంశం ప్రస్తావనకు వస్తుంది. రాజ్యాంగంలో పార్టీలు మారే స్వేచ్చ ఉంటుంది. కాకపోతే దానికి కొన్ని పద్దతులు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ మారవచ్చు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ మాట చెప్పి ఉండవచ్చు. ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్నారన్న కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తోంది. దీనిపై హైకోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే సిట్ దర్యాప్తు వివరాలను లీక్ చేయవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు ఎంతవరకు దారి తీస్తుందో తెలియదు కాని కేసీఆర్ తన రాజకీయ అవసరాలకోసం ఈ కేసును ఉపయోగించుకోవడం కాకుండా, ఫిరాయింపుల నిరోధానికి ఉపయోగిస్తే దేశంలోనే కేసీఆర్‌కు ఒక ప్రత్యేక స్థానం లభిస్తుంది. మరి కేసీఆర్ అలా చేస్తారా? పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టాప్ ఫైవ్ జంపింగ్ జపాంగ్‌లు
జంప్ జిలానీలు... జంపింగ్ జపాంగ్ లు.... పేరేదైతేనేం ఎన్నికల సమయంలో ఈ విచిత్ర జీవులు హఠాత్తుగా పుట్టుకొస్తాయి. నిన్నటిదాకా వేసుకున్న కండువాను విసిరేసి, కొత్త పార్టీ కండువాలు వేసేసుకుంటారు. అయితే ఆ కండువా ఎన్నాళ్లుంటుంది? కోడి కూతలో పార్టీలు మార్చే వాళ్లు ఈ ఎలక్షన్లోనూ ఉన్నారు. పార్టీలు మారడం చొక్కాలు మార్చినంత తేలిగ్గా చేస్తారు. మన రాష్ట్రంలో టాప్ అయిదుగురు జంపింగ్ జపాంగ్ లెవరో చూద్దామా? 1) జేసి దివాకర్ రెడ్డి - అసలు జెసి కాంగ్రెస్ ను విడిచిపెడతారన్నది ఎవరూ ఊహించని పరిణామం. కానీ ఈ పరిణామం స్విచ్ నొక్కితే లైటు వెలిగినంత వేగంగా జరగలేదు. కోడి గుడ్డు పొదిగినంత నిదానంగా జరిగింది. 'పార్టీకి భవిష్యత్తుండదు,' 'నేను తప్ప పార్టీలో ఎవరూ మిగలరు' వంటి స్టేట్ మెంట్లు ముందు వచ్చాయి. తరువాత మువ్వన్నెల కండువా రంగు మారి పసుపు రంగుకి నెమ్మదిగా మార్ఫింగ్ చేసినంత సులువుగా జరిగింది. ఇప్పుడు జెసి, ఆయన సోదరుడు పచ్చ కండువా వేసుకున్నారు. 2) ఆకుల రాజేందర్ - 'కన్ ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను' అన్న హీరోకి ఉన్న దూకుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కి కూడా ఉంది. కాంగ్రెస్ నుంచి చెప్పా పెట్టకుండా వచ్చి టీఆర్ ఎస్ కండువా వేసుకున్నారు. అదీ కేసీఆర్ సమక్షంలో. ఆ మరుసటి రోజే గులాబీ కండువాను పారేసి, మళ్లీ పాత కండువా వేసేసుకున్నారు. ఇంత శరవేగంగా పార్టీలు మారిన ఘనత ఈ మధ్యకాలంలో ఆకుల రాజేందర్ కే దక్కింది. ఇంత చేసినా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. 3) రఘురామ కృష్ణం రాజు - బిజెపి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ సీపీ, అక్కడి నుంచి మళ్లీ బీజేపీ. కానీ కట్ చేస్తే ఆయన నర్సాపుర్ లోకసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి. ఆయన పోటీ పడితే పాదరసంతోనే పోటీ పడాలి. అంత వేగంగా స్టెప్పులేశారు రఘురామ. 4) దాసోజు శ్రవణ్ - ఆవేశం శ్రవణ్ సొంతం. ఆయన విమర్శించడం మొదలుపెడితే కామాలు, ఫుల్ స్టాపులు ఉండవు. పీఆర్ పీలో ఉన్నప్పుడు అంతే. అక్కడనుంచి టీఆర్ ఎస్ కి వచ్చినప్పుడు అంతే. అక్కడ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. కండువాలైతే మారాయి కానీ విమర్శ ఊపు మాత్రం అదే. కేసీఆర్ ను ఆయన పొగిడినంతగా ఎవరూ పొగడలేదు. ఆయన తిట్టినంతగా ఎవరూ తిట్టలేరు. 5) డీ ఎల్ రవీంద్రా రెడ్డి - బెస్ట్ జంపింగ్ జపాంగ్ మాత్రం డీ ఎల్ రవీంద్రా రెడ్డిదే. ఉన్న తాజ్ మహల్ ను లేనట్టు చేసే ఐంద్రజాలికుడు ఆయన. ఆయన పార్టీ మారకుండానే పార్టీ మారిన ఫీలింగ్ ఇవ్వగలరు. మొదట్లో టీడీపీలో చేరతానని లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే మాట వినిపిస్తున్నారు. వెళ్తారా, వెళ్లరా అన్నది మాత్రం తెలియదు మరి.