breaking news
jayalalitha photo
-
విజయధరణిపై వేటుపడుతుందా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేవలం ఒక ఎమ్మెల్యే ఏకంగా పార్టీ అధ్యక్షుడినే సవాల్ చేయడమా, పార్టీపై ధిక్కారాన్ని ఎంత మాత్రం సహించబోమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు తిరునావుక్కరసర్ అంటున్నారు. ఎమ్మెల్యే విజయధరణిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఉత్తరం రాసినట్లు బుధవారం ఆయన మీడియాకు తెలిపారు. అసలు విషయం ఏమిటంటే... దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని ఈనెల 12వ తేదీన స్పీకర్ ధనపాల్ అసెంబ్లీ హాలులో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఇతర అన్నాడీఎంకే ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీటీవీ దినకరన్ సహా డీఎంకే, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఆస్తుల కేసులో దోషిగా నిర్ధారణైన జయలలిత చిత్రపటం అసెంబీల్లో ఏమిటని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తీవ్రంగా ఖండించారు. జయ చిత్రపటం తరువాత ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్, సీరియల్ కిల్లర్ ఆటో శంకర్ ఫొటోలను అసెంబ్లీలో ఆవిష్కరిస్తారని అన్నాడీఎంకే నేతలను తమిళనాడు కాంగ్రెస్ మాజీ అద్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఎద్దేవా చేశారు.అయితే ఒక మహిళానేతగా జయలలిత చిత్రపటావిష్కరణను తాను సమర్థిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి బహిరంగంగా ప్రకటించడమేగాక స్పీకర్ చాంబర్‌కు వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఆమె పోకడపై తిరునావుక్కరరసర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ వివాదంపై ఒక టీవీ చానల్‌తో విజయధరణి మాట్లాడుతూ, రాహుల్‌గాంధీకే సవాలు విసిరారు. ఆస్తుల కేసులో ఆమె నిందితురాలని ప్రకటించిన తరువాతనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత వద్దకు రాహుల్‌గాంధీ, తిరునావుక్కరసర్ వెళ్లారు. ఆమె మరణించిన తరువాత అంత్యక్రియల్లో చివరివరకు పాల్గొన్నారు. ఆమె నేరస్తురాలని అప్పుడంతా తెలియదా, అంత్యక్రియలు బహిష్కరించవచ్చుకదాని నిలదీశారు. నేను ఇలా మాట్లాడడంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు అందుతాయి, జయ చిత్రపటంపై అభిప్రాయం చెప్పడం నా వ్యక్తిగత హక్కు. నా హక్కులను ఎవ్వరూ భంగపరచలేరు. అది రాహులైనా, తిరునావుక్కరసరైనా సరే. పార్టీ నిర్ణయం ప్రకారం ఆవిష్కరణకు హాజరుకాలేదు, అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను అని సమర్థించుకున్నారు. విజయధరణి కేవలం ఒక ఎమ్మెల్యే, అది మరిచిపోయి ఏకంగా అధిష్టానాన్నే నిలదీయడం ఏమిటని తిరునావుక్కరసర్ బుధవారం మీడియాతో అన్నారు. పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి, అధిష్టానాన్ని అవమానించిన విజయధరణిపై తగిన చర్య తీసుకోవాలని కోరుతూ రాహుల్‌గాంధీ, తమిళనాడు పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్వాస్నిక్కు ఉత్తరం రాసినట్లు ఆయన తెలిపారు. తిరునావుక్కరసర్‌కు ముందు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఇళంగోవన్‌ను సైతం విజయధరణ భేదిం సస్పెన్షన్ వరకు తెచ్చుకున్నారు. తాజా సంఘటనలో విజయధరణిపై వేటుపడుతుందా...వేచి చూడాల్సిందే. -
అమ్మ ఫొటో లేదని అలిగిన మంత్రి
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత ఫొటో లేదని ఆమె మంత్రివర్గంలోని ఓ మంత్రి గారు తీవ్రంగా కలత చెందారు. దీంతో ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభించకుండానే... వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. తిరుచ్చి వెస్ట్రి పాఠశాల మైదానంలో వినోదకరమైన పలు అంశాలతో ప్రభుత్వ ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమాచార, ప్రత్యేక కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ హాజరయ్యారు. ఆయన ఎగ్జిబిషన్‌లోని పలు స్టాల్స్‌ను ప్రారంభించారు. అయితే ఆ పక్కనే ఉన్న ఆర్బీఐ స్టాల్‌ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఇంతలో ఏమైందో ఏమో ఆయన ఆ స్టాల్‌ను ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. దాంతో జిల్లా కలెక్టర్‌తో ఈ స్టాల్‌ను ప్రారంభించారు. దీనిపై ఆర్బీఐ అధికారులను వివరణ కోరగా... ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్‌లో అమ్మ జయలలిత పొటో ఏర్పాటైందని... కానీ రిజర్వు బ్యాంకు స్టాల్లో ఆమె ఫొటో ఏర్పాటు చేయలేదన్నారు. దీన్ని గమనించి జిల్లా పార్టీ నిర్వాహకులు రిజర్వు బ్యాంకు స్టాల్లో ముఖ్యమంత్రి జయలలిత ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారని చెప్పారు. కానీ ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని... దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని చెప్పినట్లు తెలిపారు. అందువల్లే తమ స్టాల్‌ను మంత్రి రాజేంద్ర బాలాజీ ప్రారంభించకుండా వెళ్లారని ఆర్బీఐ అధికారులు చెప్పారు.