breaking news
Jaraganahalli
-
బెంగళూరులో ఘోరం
-
బెంగళూరులో ఘోరం
కన్నకూతురిని మేడపై నుంచి తోసేసి హత్య హత్య అనంతరం మేకప్ వేసుకుని ముస్తాబు తల్లికి దేహశుద్ధి చేసిన స్థానికులు సాక్షి, బెంగళూరు: ఏడేళ్ల చిన్నారిని కన్నతల్లే మూడంతస్తుల మేడపై నుంచి తోసి హత్య చేసిన ఘటన బెంగళూరు పుట్టేనహళ్లిలోని జరిగేనహళ్లిలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కాంచన్ సర్కార్ దంపతులు చాలాఏళ్ల క్రితం బెంగళూరు నగరానికి వచ్చారు. కాంచన్ సర్కార్ ప్రముఖ ఐటీ కంపెనీలో బిజినెస్ అనలిస్టుగా పని చేస్తుండగా, అతని భార్య స్వాతి సర్కార్ ఓ పాఠశాలలో హిందీ టీచరుగా పని చేసేది. అయితే గత కొద్ది కాలంగా ఆమె మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. భార్యతో మనస్పర్థలు కారణంగా ఆమె భర్త ఒంటరిగా ఇందిరా నగర్లో నివాసం ఉంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుండేవాడు. దీంతో స్వాతి సర్కార్ రోజురోజుకు మితిమీరి ప్రవర్తించసాగేది. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు ఇంట్లోనున్న ఏడేళ్ల కుమార్తె శ్రేయాను మూడో అంతస్తుపై నుంచి కిందకు తోసేసింది. అయితే శ్రేయ మూగ బాలిక కావడంతో కేకలు వేయలేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని మరోసారి పైకి తీసుకు వెళ్లి కిందకు పడేసింది. అంత ఎత్తు నుంచి పడిపోయిన ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తరువాత ఏం తెలియనట్లు స్వాతి సర్కార్ ఇంట్లోకి వెళ్లి మేకప్ వేసుకొని ముస్తాబై బయటకు రావడం గమనార్హం. ఒకవైపు కూతురి మృతదేహం ఉన్నా మరోవైపు పట్టించుకోకుండా వెళ్లిపోతున్న తల్లిని స్థానికులు అడ్డుకుని ప్రశ్నించగా, నా కూతురిని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఆగ్రహానికి గురైన స్థానికులు ఆమెకు దేహశుద్ది చేసి కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని నిందితురాలిని అరెస్ట్ చేసిన పుట్టెనహళ్లి పోలీసులు కుటుంబ కలహాలతోనే శ్రేయను హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.