ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లు
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఈ రోజు తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపుదాడికి పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలను భారత ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆపరేషన్ సింధూర్‌లో రఫేల్, సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. వాటి గురించి తెలుసుకుందాం.డసాల్ట్ రఫేల్డసాల్ట్ రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇది అధునాతన ఏవియానిక్స్, మెరుగైన పోరాట సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది. అటాక్ చేసే సమయంలో యుద్ధభూమిలో పరిస్థితుల అవగాహన కోసం ఆర్బీఈ2 ఏఈఎస్ఏ రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, ఫ్రంట్-సెక్టార్ ఆప్ట్రోనిక్స్ను అమర్చారు. రెండు ఎస్ఎన్సీఎంఏ ఎం88 టర్బోఫాన్ ఇంజిన్లను ఇందులో ఉపయోగించారు. ఇది సూపర్ క్రూయిస్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 9,500 కిలోల వరకు ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ఫైటర్ పైలట్లకు యుద్ధభూమిలో రియల్ టైమ్ సమాచారం అందించేందుకు బహుళ సెన్సార్లను ఉపయోగించారు. నౌకాదళం కోసం 26 రఫేల్-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ గతంలో రూ.63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఈ జెట్లను ఉంచాలని నిర్ణయించింది.సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐఈ ట్విన్ ఇంజిన్, మల్టీరోల్ ఎయిర్ సుపీరియరిటీ ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ ఆయుధాగారంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి.ఇది థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్‌తో ఏఎల్-31FP టర్బోఫాన్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఇంధనం నింపితే గరిష్టంగా 3,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంధనం నింపితే 8,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.మల్టీ-మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ)ను కలిగి ఉంది. ఇజ్రాయెల్, ఫ్రెంచ్, ఇండియా ఏవియానిక్స్‌లో ఇవి ఉన్నాయి.గగనతల క్షిపణులు, గైడెడ్ బాంబులతో సహా 8,000 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు.భారత వైమానిక దళంలో 260కి పైగా ఈ జెట్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ రుణం దిగిరావాలిసెపెకాట్ జాగ్వార్సెపెకాట్ జాగ్వార్ అనేది ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ ఇంజిన్, సూపర్ సోనిక్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్. తక్కువ ఎత్తులో హైస్పీడ్ ఆపరేషన్స్ కోసం రూపొందించారు. శత్రు భూభాగంలో దాడులకు అనువైనది. మెరుగైన రాడార్, జీపీఎస్ నావిగేషన్, నైట్ ఫ్లయింగ్ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు రోల్స్ రాయిస్ టర్బోమెకా అడౌర్ టర్బోఫాన్ ఇంజిన్లతో దీన్ని రూపొందించారు. లేజర్ గైడెడ్ బాంబుల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ 1979 నుంచి కీలక స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అంబాలా, గోరఖ్‌పూర్, జామ్ నగర్ వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించారు.