breaking news
jagampeta
-
బాబు శంకుస్థాపన శిలాఫలకానికే పరిమితం...
సీఎం చేతుల మీదుగా మేలో జగ్గంపేట డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన ఐదునెలలు గడిచినా ప్రారంభం కాని పనులు వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి అనుమానమే మోడల్ డిగ్రీ కళాశాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు మేనెలలో ఆవిష్కరించిన శిలాఫలకం జగ్గంపేట : మోడల్ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునాదిరాయి వేసి ఐదు నెలలు దాటుతున్నా పనులు మాత్రం ముందుకుసాగడం లేదు. జగ్గంపేట డిగ్రీ కళాశాల మెట్ట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. కాంగ్రెస్ పార్టీ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జగ్గంపేటకు డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎంపీ తోట నరసింహం డిగ్రీ కళాశాల తరగతులను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. చాలీచాలని గదుల్లో ఒకపూట ఇంటర్మీడియేట్, ఇంకోపూట డిగ్రీ తరగతులను నిర్వహిస్తున్నారు. సొంత భవనం కోసం అప్పట్లో తోట నరసింహం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో రూ.12కోట్ల నిధులు మంజూరయ్యాయి. మోడల్ డిగ్రీ కళాశాలగా ఈ నిధులతో తీర్చిదిద్దాల్సి ఉంది. అయితే స్థలం లేకపోవడంతో గ్రామానికి సంబంధం లేనిచోట జె.కొత్తూరుకు సమీపంలో జటాద్రి కొండను ఆనుకుని కళాశాల భవన నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి తోట నరసింహం శంకుస్థాపన చేయించారు. అక్కడ భవనాలు అలంకారప్రాయమవుతాయని జగ్గంపేటను ఆనుకునే నిర్మాణాలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయాలను మెజార్టీ ప్రజలు వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ జటాద్రి కొండ వద్ద డిగ్రీ కళాశాల పనులకు అడ్డు చెప్పారు. జగ్గంపేటలో విస్తరించి ఉన్న పోలవరం కాలువకు సేకరించిన ఉన్న స్థలంలో నిర్మాణాన్ని చేపట్టాలని పట్టుబట్టారు. ఆయన పట్టుదల నెరవేరింది. గ్రామ శివారున గోకవరం రోడ్డులో పోలవరం కాలువ మట్టినిల్వకు సేకరించిన సుమారు 10 ఎకరాల్లో మే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికి ఐదు నెలలు గడిచినా పనులు ఇంకా ప్రారంభించలేదు. స్థలంలో ఉన్న మట్టిని బయటకు పంపితేగాని పనులు ప్రారంభించే అవకాశం లేదు. నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో వచ్చే విద్యాసంవత్సరం నాటికి తరగతి గదులు అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలవరానికి సేకరించిన స్థలంలో డిగ్రీ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టమే కాకుండా అధికారులకు ఫిర్యాదులు చేశారు. సాధ్యమైనంత త్వరంలో డిగ్రీ కళాశాల భవనాలను నిర్మించి విద్యార్థులకు ఇరుకు గదుల సమస్యలనుంచి తప్పించాలని జనం కోరుకుంటున్నారు. -
రెండు కేసుల్లో రిపోర్టర్ అరెస్టు
జగ్గంపేట : జె.కొత్తూరుకు చెందిన తుట్టా రామయ్య ఆత్మహత్య కేసులో, మరో కేసులో అదే గ్రామానికి చెందిన మీడియా రిపోర్టర్ కుమార్‌పాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు ఎస్సై అలీఖాన్ శుక్రవారం తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల తన పొలంలో రామయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్‌పాల్ వేధింపులతో మనస్తాపం చెందిన తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన అక్కమ్మ అనే మహిళ తన కుమార్తె మస్కట్‌లో అనారోగ్యంతో ఉందని చెబితే ఆమెను తీసుకువస్తానని కుమార్‌పాల్ చెప్పి రూ.30వేలు తీసుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఈ రెండు కేసుల్లో కుమార్‌పాల్‌ను శుక్రవారం అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు.