breaking news
ITMS
-
గూగుల్‌తో పోలీసు విభాగం కీలక ఒప్పందం
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ మూస ధోరణిలో నడుస్తోంది. చిన్న జంక్షన్లలో 90 సెకన్లు, పెద్ద జంక్షన్లలో 240 సెకన్లలో సిగ్నల్స్ సైకిల్ పూర్తవుతుంది. అంటే సదరు జంక్షన్‌లోని ఓ రోడ్‌కు గ్రీన్‌లైట్ ఆగి రెడ్‌లైట్ పడిన తర్వాత మళ్లీ గ్రీన్‌లైట్ పడటానికి పట్టే సమయం ఇది. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది. ఉదాహరణకు బేగంపేట మీదుగా సికింద్రాబాద్–పంజగుట్ట మధ్య ఉన్న రహదారినే తీసుకుంటే ఉదయం వేళల్లో సికింద్రాబాద్ వైపు నుంచి, రాత్రిపూట బేగంపేట దిశ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న జంక్షన్లలో మాత్రం సిగ్నల్ సైకిల్ ఒకేలా పనిచేస్తోంది. దీంతో ఆయా జంక్షన్లలోని కొన్ని రోడ్లు ఖాళీగా, మరికొన్ని బంపర్ టు బంపర్ జామ్‌తో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితి విద్యాసంస్థలు, వాణిజ్య ప్రాంతాలు, ప్రభుత్వ–ప్రైవేట్ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తరచూ కనిపిస్తోంది. దీంతో ట్రాఫిక్ విభాగం ఓ జంక్షన్‌లోని ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురావచ్చని భావించింది. దీని కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానాన్ని వినియోగించాలని నిర్ణయించింది. దీని కోసం గూగుల్ సంస్థతో పోలీసు విభాగం ఓ కీలక ఒప్పందాన్ని చేసుకుంది. స్మార్ట్ఫోన్లతో గుర్తిస్తున్న గూగుల్.. కీలక మార్గాలు, జంక్షన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. వీటిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న ఆ సంస్థ ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఏ రహదారిలో, ఏ దిశలో సెల్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయనేది గుర్తిస్తోంది. రహదారులపై ఉన్న సెల్ఫోన్లు సాధారణంగా వాహనచోదకులవే అయ్యి ఉంటాయి. ఇలా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ వివరాలు ఎప్పటికప్పుడు గూగుల్ సంస్థకు చేరుతున్నాయి. వీటి ఆధారంగానే ఆ సంస్థ తమ మ్యాప్స్‌లో ట్రాఫిక్ రద్దీ ఉన్నరహదారుల్ని ఎరుపు రంగులో చూపిస్తుంటుంది. ప్రస్తుత సమస్య.. ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో ఉన్న నాలుగు రోడ్లలో ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ సిగ్నల్స్ సైకిల్ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినా ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్ లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. పరిష్కారం.. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఓ జంక్షన్‌లోని 4 రహదారుల్లో ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలిస్తే సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురావచ్చు. సమస్యకు గూగుల్ సాయం.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆ సంస్థకు సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తమ లొకేషన్ తెలుసుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. దీంతో ఆయా ఫోన్లు ఉన్న లొకేషన్లు తెలుసుకునే అవకాశం గూగుల్ సంస్థకు కలుగుతోంది. దీంతో ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ వద్ద రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంటోంది. ఏపీఐ కోసం ఆ సంస్థతో ఒప్పందం.. గూగుల్ వద్ద ఉన్న ఈ వివరాలను వాహన చోదకులు, ప్రజలకు ఉపయుక్తంగా వినియోగించాలని పోలీసు విభాగం యోచించింది. దీంతో ట్రాఫిక్ అప్డేట్స్తో కూడిన గూగుల్ సర్వర్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కంట్రోల్ చేసే సర్వర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇది అమల్లోకి రావడంతో గూగుల్ సర్వర్ ఆధారంగా ఓ జంక్షన్ సమీపంలోని రహదారుల్లో వాహనాల రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. దీంతో ఓ చౌరస్తాకు సంబంధించి రద్దీ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు గ్రీన్‌లైట్ వెలుగుతుంది. రద్దీని బట్టి ఆయా మార్గాల్లో సిగ్నల్స్ సైకిల్‌ను సర్వర్ మార్చేస్తూ ఉంటుంది. అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టంగా పిలిచే దీని ఫలితంగా ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతోపాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని గచ్చిబౌలి చౌరస్తాలో ప్రయోగాత్మకంగా వినియోగించారు. విజయవంతం కావడంతో 3 కమిషనరేట్లలోని దాదాపు అన్ని జంక్షన్లలోనూ వినియోగించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను నిర్వహిస్తున్న బెల్ సంస్థ కాంట్రాక్ట్ నవంబర్‌లో పూర్తయి కొత్త కాంట్రాక్ట్ మొదలవుతుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు అదే సమయానికి 3 కమిషనరేట్లలోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నుంచి ఐటీఎంఎస్‌లో భాగంగా ఏటీసీఎస్ విధానం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించనుంది. ప్రజలకు ఎంతో ఉపయుక్తం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో అంతర్భాగంగా అమల్లోకి రానున్న అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టంను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించాం. మంచి ఫలితాలు ఇస్తున్న ఈ విధానం ప్రజలకు, వాహనచోదకులకు ఉపయుక్తంగా మారుతుంది. మౌలిక వసతుల కల్పన, ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితరాల్లో ఉన్న ఇబ్బందుల్ని అధిగమిస్తున్నాం. త్వరలోనే ఏటీసీఎస్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానున్నాం. గూగుల్ సంస్థ సహకారంతో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే సర్వర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. - అనిల్‌కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ -
24/7 నిఘా నేత్రం
దేశంలోనే తొలిసారిగా వాహన ఉల్లంఘనలపై నిఘాకు ప్రత్యేక వ్యవస్థ - ఐటీఎంఎస్ ఏర్పాటు.. రాత్రీపగలూ నిరంతరాయంగా పరిశీలన - పరిమితికి మించి వేగంగా వెళితే చిక్కినట్లే.. - రెడ్ సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్లో వచ్చినా అంతే.. - ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మధ్య ఏర్పాటు హైదరాబాద్: అర్ధరాత్రి సమయం.. ట్రాఫిక్ పోలీసులెవరూ ఉండరనే ఉద్దేశంతో అత్యంత వేగంగా వాహనం నడిపాడు ఓ యువకుడు.. కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకుపోయాడు.. కానీ ఒకటి రెండు రోజుల్లోనే అతడి ఇంటికి ఈ–చలానా వచ్చింది. పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లినందుకు, రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు జరిమానా విధించారు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన అత్యాధునిక సెన్సర్ కెమెరాల వ్యవస్థ పనితీరు ఇది. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ముందుకెళ్లిపోవడం, రాంగ్ రూట్లో వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలన్నింటినీ రాత్రి సమయాల్లోనూ ఈ సెన్సర్ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)గా పిలిచే ఈ వ్యవస్థను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని కేబీఆర్ పార్కు–జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మధ్య ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఎన్ని వాహనాలు వెళ్లినా.. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ వి.రవీందర్ గురువారం ఈ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 10,800 వాహనాలు వెళ్లినట్లుగా అందులో వెల్లడైంది. ఇక్కడ నిర్దేశించిన గరిష్ట వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లుకాగా.. 64 శాతం వాహనాలు పరిమితికి లోబడి వెళ్లాయని, మిగతావి ఎక్కువ వేగంతో వెళ్లాయని తేలింది. ఇక బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 11,706 వాహనాలు వెళ్లగా... 2,200 వాహనాలు పరిమితికి మించిన వేగంతో వెళ్లినట్లు గుర్తించారు. నాలుగు వాహనాలు 100 కి.మీపైన వేగంతో.. తొమ్మిది వాహనాలు 120 కి.మీపైగా వేగంతో దూసుకుపోయాయి. ఒక ఆడి కారు (ఏపీ 09 సీఏ 7119) గంటకు 127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ఐటీఎంఎస్‌లో నమోదైంది. మొత్తంగా సగానికిపైగా వాహనాలు నిర్దేశిత పరిమితికి మించి వేగంతో వెళ్లినట్లు తేలింది. స్మార్ట్ సిటీ, సేఫ్ సిటీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌వ్యాప్తంగా అన్ని కూడళ్లు, కారిడార్లలో పదివేల సెన్సర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా రవీందర్ వెల్లడించారు. ప్రయారిటీ ట్రాఫిక్ కూడా.. ట్రాఫిక్ ఎక్కువై ముందున్న వాహనాలు కదలకపోవడం, రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగిపోవడం వంటి వాటి కారణంగా చాలాసార్లు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటాయి. అయితే ఐటీఎంఎస్‌లో ఏర్పాటు చేసే కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్‌కు అనుసంధానమై.. అంబులెన్స్‌లు వేగంగా ముందుకు కదిలేలా గ్రీన్‌సిగ్నల్స్ ఇస్తాయని అధికారులు చెబుతున్నారు.