breaking news
ITIs Guild
-
ఉలిక్కిపడ్డ సిటీ
ఐటీఐ గిల్డ్‌లో ప్రమాదం - భీతిల్లిన జనం - కోట్ల రూపాయల ఆస్తినష్టం మెహిదీపట్నం: నగరం నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో సిటీ ఉలిక్కిపడింది. గంటల పాటు ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. కిలోమీటర్ల మేర పొగలు వ్యాపిస్తూ మంటలు ఎగిసి పడటంతో సమీప ప్రాంతవాసులు కలవర పడ్డారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక అధికారులు ఉరుకులు,పరుగులు తీశారు. పదహారు అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి, ఐదు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఆదివారం సాయంత్రం విజయనగర్‌కాలనీ మల్లేపల్లి ఐటీఐ గిల్డ్ స్థలంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ చాలా కాలం నుంచి చిన్న చిన్న వాహనాల రిపేర్ షెడ్లతో పాటు వెల్డింగ్ దుకాణాలు, డెంటింగ్ షెడ్లు వంటి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం విజయనగర్‌కాలనీ చౌరస్తా వైపు ఓ మూలన చిన్న షెడ్డులో మధ్యాహ్నం 3:30 గంటల సమీపంలో చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మంటలు కొద్ది కొద్దిగా వ్యాపిస్తూ మిగతా షెడ్లలోకి వ్యాపించాయి. షెడ్లలో దాదాపు రసాయనాలు, పాత టైర్లు ఉండడంతో మంటలు వేగంగా చెలరేగాయి. ఈ ప్రారంతం ఎప్పుడూ ర ద్దీగా ఉంటుంది. ఆదివారం సెలవు కావడంతో షాపులు మూతపడ్డాయి. దీంతో ప్రాణనష్టం, పెనుప్రమాదం తప్పింది. స్పందించిన ఎస్బీ కానిస్టేబుల్... ఘటనా స్థలం నుంచి బైక్‌పై వెళ్తున్న స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ టి.దిగంబర్సింగ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అందరూ సకాలంలో వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 16 ఫైరింజన్లు 20 నీళ్ల ట్యాంకర్లు... మాదాపూర్, మొగల్పురా,సికింద్రాబాద్,హైకోర్టు, మలక్‌పేట, మౌలాలీ, సనత్‌నగర్, ఇంబ్రహీంపట్నం, లంగర్‌హౌస్, అసెంబ్లీ, గౌలిగూడ, ఫిలింనగర్, ముషీరాబాద్, సాలార్జంగ్ మ్యూజియం ఫైర్ స్టేషన్ల నుంచి వాహనాలు వచ్చాయి. మరో 20 నీళ్ల ట్యాంకర్లు(ప్రైవేట్) రప్పించారు. సహాయక చర్యల్లో ఫైర్ డెరైక్టర్ పి.వెంకటేశ్వర్, డీఎఫ్ఓ మహేందర్‌రెడ్డి, ఫైర్ ఆఫీసర్ విజయ్‌కుమార్‌లతో పాటు ఆయా ఫైర్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం కావడంతో తప్పిన ప్రాణ నష్టం... ఆదివారం సెలవు దినం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కేవలం రూ.కోట్లలో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఇక్కడ 110 షాపులలో (కారు మెకానిక్, కార్పెంటర్, డెంటర్, పెయింటర్ తదితర కార్ఖానాలు) కనీసం మూడు వేల మంది కార్మికులు పని చేస్తుంటారు. సాధారణ రోజుల్లో ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. నిల్వ ఉన్న ఆయిల్ కొంప ముంచింది... ఐటీఐ గిల్ సుమారు ఐదేకరాల స్థలంలో ఉం ది. ఈ ప్రభుత్వ భూమిని కొందరు లీజ్‌కు తీసుకుని మొటారు మెకానిక్ వర్క్‌షాపులను నిర్వహిస్తున్నారు. ఈ గిల్‌లోని అన్ని దుకాణాలలో ఇంజన్ ఆయిల్ నిల్వలు ఉండటం కూడా మంటలు అదుపు రాకపోవడానికి ఒక కారణం. దీనికి తోడు కార్లకు ఉపయోగించే పెయింట్స్ కూడా ఉండటంతో మంటలు క్షణాల్లో చుట్టుపక్క దుకాణాలకు పాకాయి. -
ఫైర్ ‘సేఫ్టీ’ ఏదీ?
⇒ అగ్నిప్రమాదాల నివారణలో అధికారుల వైఫల్యం ⇒ అరకొర వసతులతో ఫైర్ విభాగం సతమతం ⇒ సకాలంలో స్పందించలేకపోతున్న సిబ్బంది ⇒ 45 కిలోమీటర్ల దూరం నుంచి ఫైరింజన్ల రాక ⇒ అప్పటికే బుగ్గిపాలవుతున్న ఆస్తులు మెహదీపట్నం: అగ్ని ప్రమాదాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. ఎన్నిమార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదు. తాజాగా ఆదివారం విజయ్‌నగర్‌కాలనీలోని ఐటీఐ గిల్డ్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఫైర్, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, కార్మిక శాఖ విభాగాల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా చెప్పుకోవచ్చు. ప్రమాదం చోటుచేసుకోక ముందే ఇలాంటి వర్క్‌షాపుల వద్ద పాటించాల్సిన భద్రతా చర్యలపై ఏ ప్రభుత్వ శాఖ కూడా స్పందించలేదు. గౌడాన్స్లు, వర్క్‌షాపుల యజమానులు పాటించాల్సిన కనీస నిబంధనలను సైతం కనిపెట్టలేకపోయారు. కనీసం ప్రమాదం చోటుచేసుకున్న కొద్ది నిముషాలలో మంటలు ఆర్పేందుకు సరైన వసతులు ఫైర్ విభాగం వద్ద లేవు. చాలిచాలనీ సిబ్బంది, అరకొర ఫైరింజన్లతో కుంటుతున్న ఫైర్ విభాగం దీనస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఫైర్ విభాగానికి సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే తగిన సమయంలో తగిన విధంగా సిబ్బంది స్పందించి వేగవంతంగా మంటలను ఆర్పేస్తారు. ఆదివారం సాయంత్రం 4.45 గంటలకు చిన్నపాటి అగ్నిప్రమాదమే చోటుచేసుకుంది. ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి వచ్చినా, వారివద్ద తగినన్ని వాహనాలు లేకపోవడంతో మంటలను ఆర్పడం కష్టమైంది. ఒక మూలన మంటలను అదుపు చేస్తుంటే మరో వైపునుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో రాత్రి 8.45 గంటలకు మంటలు పూర్గిగా అదుపులోకి వచ్చాయి. తగినన్ని ఫైరింజన్లు నగరంలోనే ఉంటే గంట వ్యవధిలో మంటలను అదుపులోకి తేవచ్చు. విజయ్‌నగర్ కాలనీలోని ఘటనా స్థలానికి నగరానికి 45 కిలో మీటర్ల దూరంలో నున్న స్టేషన్ల నుంచి ఫైరింజన్లను రప్పించాల్సి వచ్చింది. నగరం నడిబొడ్డున ఫైరింజన్లు లేకపోవడంతో సనత్‌నగర్, ఇబ్రహీంపట్నం నుంచి కూడా ఫైరింజన్లను రప్పించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రమాదం చోటుచేసున్న నిముషాల వ్యవధిలోనే నాలుగైదు ఫైరింజన్లు వచ్చివుంటే ఇంత పెద్ద భారీ స్థాయిలో ప్రమాదం చోటుచేసుకునేది కాదు. ఇక అదృష్టవశాత్తు ఐటీఐ గిల్డ్‌కు నాలుగు వైపులా రహదారులే ఉన్నాయి. రహదారి దాటిన తరువాతనే కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ఐటీఐ గిల్డ్‌కు ఈ బస్తీలు ఆనుకుని ఉంటే నాలుగు గంటల పాటు ఎగిసిన మంటలకు బస్తీలు కూడా బుగ్గిపాలయ్యేవి. ఐటీఐ గిల్డ్‌కు ఆనుకునే చిన్న పిల్లల స్పెషాల్టీ దవాఖానా ఉంది. ఘటన సమయంలో ఇందులో ఉన్న రోగులు బయటికి పరుగులు తీశారు. పొగతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు.