breaking news
intenet
-
రణరంగంగా రాజధాని.. ఒకరు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న నిరసనతో దేశ రాజధాని నగరం రణరంగంగా మారింది. ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వేలాదిగా ట్రాక్టర్లు దేశ రాజధాని వైపు తరలి రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేసింది. తాజాగా మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖాజీపూర్, తిక్రిత్, సింగ్ నంగ్లోయి తదితర ప్రాంతాలలో అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. 72వ గణతంత్ర దినోత్సవంరోజు (జనవరి 26, మంగళవారం) రైతుల ట్రాక్టర్ రిపబ్లిక్ డే ర్యాలీలో ఢిల్లీ ఐటీఓ సమీపంలో ఒక నిరసనకారుడు మరణించడం మరింత ఆందోళనకు దారి తీసింది. నగరంలోకి చొచ్చుకొచ్చిన రైతులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీలు ఝళిపించారు. ఈ ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు మృతి చెందారని రైతు ఉద్యమకారులు తెలిపారు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్పూర్కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్టు చెప్పారు. అయితే ట్రాక్టరు తిరగబడటంతో రైతు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. మరోవైపు బారికేడ్లు, లాఠీచార్జ్, బాష్పవాయులను దాటుకొని రైతు ఆందోళనకారులు కొంతమంది ఎర్రకోట వైపు దూసుకొచ్చి రైతు జెండాను ఎగరవేశారు. దీంతో మరోసారి పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చెరేగింది. అయితే ఎర్రకోటలోజెండా ఎగురవేయడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏ సమస్యకూ హింస పరిష్కారం కాదని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు ర్యాలీ రూటు మార్పులో తమ పాత్ర ఏదీ లేదని సంయుక్త కిసాన్ మోర్చ నాయకులు పేర్కొన్నారు. కొంతమంది అరాచకవాదులు, అసాంఘిక శక్తులు తమ శాంతియుత ఉద్యమంలోకి చొరబడ్డాయని ఆరోపించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీసుల్లో నెట్ కట్!
సింగపూర్: తమ దేశ ప్రభుత్వ ఉద్యోగులకు సింగపూర్ ప్రభుత్వం షాకిచ్చింది. సెక్యూరిటీ పేరుతో ఆఫీసుల్లోని తమ కంప్యూటర్లకు నెట్ కనెక్షన్ కట్ చేయనుంది. దీంతో ప్రతి అంశానికి ఇక ఏ ఉద్యోగి కూడా గూగుల్‌లో విహరించే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో దాదాపు ఒక లక్ష కంప్యూటర్లు ఇక నెట్ లేకుండా కేవలం ఉద్దేశించిన పని నిమిత్తమై పనిచేయనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు దీనికి సంబంధించిన సమాచారం పంపించారు కూడా. సైబర్ చోరీలు ఎక్కువవుతుండటంతోపాటు హ్యాక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెట్ కనెక్షన్ ఇవ్వకూడదని సింగపూర్ ప్రభుత్వం భావించిందట. అయితే, ఎంపిక చేసిన కొద్దిమంది ప్రభుత్వాధికారులకు మాత్రం ఈ సౌకర్యం ఉండనుంది. 'మన దేశ నెట్ వర్క్ ను భద్రంగా ఉంచే ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రతి రోజు నిర్వహించిన సమీక్షలు, ఐటీ ప్రమాణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది' అని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. 'మేం ఎంపిక చేసిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం నెట్ కనెక్షన్ సౌకర్యం ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నాం. మరో ఏడాదిలో ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవకాశం ఉండబోదు' అని వారు ఆ ప్రకటనల్లో తెలిపారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే సామర్థ్యం, ఉత్పాదకత పెంచేందుకు, రక్షణతో కూడిన నెట్ వ్యవస్థ కోసం సింగపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.