breaking news
insufficient supplies
-
‘భగీరథ’కు నీటి కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి నీటి కొరత అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఈ ఏడాది జూన్, జూలై నుంచి ‘భగీరథ’ద్వారా తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా ప్రధాన రిజర్వాయర్లలో నీరు లేకపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నాగార్జున సాగర్, శ్రీశైలంలలో నీటి మట్టాలు పడిపోవడం, కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్లలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఆందోళన చెందుతోంది. మరీ ముఖ్యంగా నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూర్ రిజర్వాయర్‌లో అత్యంత కనిష్టానికి నీరు చేరడం, ఈ రిజర్వాయర్‌కు నీరు అందకుండా శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తోడేస్తుండటం భగీరథ కష్టాలను మరింత పెంచుతోంది. అంచనాలు తలకిందులు.. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి తాగునీటికి 10 శాతం నీరు తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనికిగానూ కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని 37 ప్రాజెక్టుల నుంచి ఈ జూన్ నుంచి ఏడాది వరకు 59.17 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో కృష్ణా బేసిన్‌లోని జూరాల నుంచి 1.22 టీఎంసీలు, ఎల్లూర్ రిజర్వాయర్ నుంచి 7.12, కోయిల్‌సాగర్ నుంచి 1.3 టీఎంసీలతో పాటు సాగర్ ప్రాజెక్టు పరిధిలోని అక్కంపల్లి, ఉదయసముద్రం, పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా సుమారు 16 టీఎంసీలు తీసుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని గ్రామాలకు నీరివ్వాలని ప్రణాళిక వేశారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లో నీటి కొరతతో నీటి సరఫరా గగనంగా మారింది. ముఖ్యంగా శ్రీశైలం జలాలపై ఆధారపడిన ఎల్లూర్ రిజర్వాయర్ కింద 7.12 టీఎంసీల అవసరం ఉండగా లభ్యత 0.3 టీఎంసీలే ఉంది. ‘పాలమూరు’కు ఇక్కట్లే.. శ్రీశైలంలో నీటిమట్టం ఇప్పటికే 800 అడుగులకు చేరగా, పవర్‌హౌజ్‌ల ద్వారా ఏపీ మరింత నీటిని వాడుకోవడంతో 799.90 అడుగులకు చేరింది. మరింత నీరు వాడుకుంటే మోటార్లు అమర్చినా నీరు తీసుకోవడం సాధ్యపడేలా లేదు. బీమా ప్రాజెక్టు పరిధిలోని శంకరసముద్రం రిజర్వాయర్‌లోనూ అనుకున్న స్థాయిలో మట్టాలు లేనందున పాలమూరు జిల్లాలో జూన్ నుంచి భగీరథకు నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. వైరా రిజర్వాయర్ కింద కనీస నీటిమట్టం 94.65 మీటర్లుగా నిర్ణయిస్తే ఇప్పటికే 94.29 మీటర్లకు పడిపోయింది. పాలేరు రిజర్వాయర్ పరిధిలో కనీస నీటిమట్టం 133.29 మీటర్లు కాగా 132.94 మీటర్లుకు చేరడంతో భగీరథకు నీరెలా అందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమీక్షించనున్న ప్రభుత్వం భగీరథ ద్వారా జూన్ నుంచి నీటిని సరఫరా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, రిజర్వాయర్లలో నీటి కొరతతో ఆందోళన చెందుతోంది. నీటి విషయమై పూర్తిస్థాయిలో సమీక్షించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రస్తుతం రిజర్వాయర్లలోని మట్టాలు, జూన్ నుంచి ఆగస్టు వరకు నీటి లభ్యత, ఆవిరి నష్టాలపై నివేదిక కోరింది. -
అరకొర సరఫరాపై రైతన్నల ఆగ్రహం
తూప్రాన్, న్యూస్‌లైన్: రైతులకు పండుగనాడూ కరెంటు కష్టాలు తప్పలేదు. వ్యవసాయానికి సర్కార్ ఇస్తామన్న 7 గంటల సరఫరాలో కేవలం గంట మాత్రమే విద్యుత్ ఇస్తుండడంతో ఆగ్రహించిన నాగులపల్లి గ్రామ రైతులు గ్రామ సమీపంలోని 33/11 సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అంతటితో ఆగకుండా సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న లైన్‌మన్ జీవన్‌రెడ్డి, ఆపరేటర్లు రాజిరెడ్డి, రాజేష్‌లను గదిలో నిర్బంధించి తాళం వేశారు. ట్రాన్స్‌కో ఏఈ వచ్చి తమ సమస్య పరిష్కరిచేంత వరకూ సబ్‌స్టేషన్ నుంచి కదలబోమని భీష్మించుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. గ్రామ సర్పంచ్ ఏశబోయిన శ్రీశైలంయాదవ్ ఫోన్లో ట్రాన్స్‌కో అధికారులను సంప్రదించి సమాచారం తెలిపినా,అధికారులు సంఘటన స్థలానికి రాలేదు. దీంతో మరింత ఆగ్రహించిన రైతులు తమ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు రైతు లు, వారం రోజులుగా వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటును రెం డు, మూడు గంటలు మాత్రమే అందిస్తున్నారని, ఆదివారం మాత్రం గంట సేపు సరఫరా ఇచ్చారన్నారు. అయినప్పటికీ రికార్డుల్లో మాత్రం ఎక్కువ గంటలు సరఫరా చేసినట్లు నమోదు చేశారన్నారు. ట్రాన్స్‌కో ఏఈ వచ్చి తమ సమస్య పరిష్కరించేంత వరకు తాము ఇక్కడి నుంచి కదలబోమన్నారు. దీం తో పోలీసులు ట్రాన్స్‌కో అధికారులను ఫోన్ సంప్రదించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ట్రాన్స్‌కో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, వ్యవసాయానికి తప్పకుండా ఏడు గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. సబ్‌స్టేషన్ ముట్టడి కొల్చారం: వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల పరిధిలోని సంగాయిపేట గ్రామ రైతులు వరిగుంతం సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించినా ట్రాన్స్‌కో అధికారులెవరూ అక్కడకు రాకపోవడంతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన పలువురు రైతులు, రెండు రోజుల్లో సమస్య పరిష్కరించి సాగు కు 7 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. నాట్లువేసే సమయం లో సాగుకు విద్యుత్ కోతలేమిటంటూ ప్రశ్నించారు. సాగుకు 7 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తామన్న సర్కార్, 3 గంటలు కూడా ఇవ్వడం లేదనీ, అందులోనూ కోతలు విధిస్తూ రైతులు వేధించడం దారుణంగా ఉందన్నారు. ప్రస్తుతం నాట్లు వేసేం దుకు సిద్ధమైన తాము విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.