జిల్లా ఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తా
జనగామ : జిల్లాల జాబితాలో జనగామకు అన్యాయం చేస్తే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోనని మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన రిలేదీక్షలను మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామను జిల్లా చేస్తరని నమ్మకం ఉంది.. లేని పక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియమ్మను ఒప్పించి ప్రజల ఆకాంక్ష సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో 11వ జిల్లా జనగామ చేస్తానని మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఘోరంగా మోసం చేశాడన్నారు. ఈ ప్రాంత ప్రజల బతుకులు ఆగం చేసేందుకే యాదాద్రిలో కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మై హోం రామేశ్వరావు భూముల కోసమే యాదాద్రిని తెరపైకి తీసుకువచ్చాడన్నారు. నేషనల్ హైవేతోపాటు రైల్వే వ్యాగన్ పాయిం ట్, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జనగామను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిం దని, జనగామ జిల్లా కోసం ముక్తకంఠంతో అభిప్రాయాలను తెలిపితే సీఎం కనీసం స్పందించడంలేదన్నారు. మరో రెండు నెలల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్థానంలో నేనే వస్తున్నా.. ఏంటో చెప్పను.. చమత్కారం చూస్తారు అంటూ కొసమెరుపు ఇచ్చారు. ఆయన వెంట నాయకులు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ.అన్వర్, ధర్మపురి శ్రీనివాస్, మేడ శ్రీనివాస్, ఆకుల వేణుగోపాల్‌రావు, మంగ సత్యం, ఆలేటి సిద్దిరాములు, రంగరాజు ప్రవీణ్‌కుమార్, రంగు రవి, బక్క శ్రీనివాస్ ఉన్నారు.