breaking news
Indian Naval Band
-
వీనులవిందుగా ఇండియన్ నావెల్ బ్యాండ్
భవానీపురం (విజయవాడ పశ్చిమం) : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇండియన్ నావెల్ బ్యాండ్ వీనుల విందుగా సాగింది. మొత్తం 36 మంది వాయిద్య కళాకారులు ఉన్న ఈ బృందం శాక్సాఫోన్స్ వాయిద్య పరికరాలతోపాటు సంప్రదాయ మృదంగం, తబలా, ఫ్లూట్, సన్నాయి వంటి పరికరాలను వినియోగించి తమ ప్రతిభను చాటారు. ఈ నెల 2,3,4 తేదీలలో భవానీపురం పున్నమి ఘాట్‌లో నిర్వహించిన నేవీ విన్యాసాలు శనివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఇక్కడ నావెల్ బ్యాండ్‌ను నిర్వహించారు. రోజా చిత్రంలోని ‘చిన్ని చిన్ని ఆశ’ గీతాన్ని మనోహరంగా వినిపించి ఆహూతుల హర్షధ్వానాలు అందుకున్నారు. వందేమాతరం, స్లమ్ డాగ్ చిత్రంలోని ‘జయహో’, పాత హిందీ చిత్రంలోని ‘కల్ హో న హో’, మహాత్మాగాంధికి ఇష్టమైన ‘వైష్ణవ జన తో’ భజన, వీర అమర జవాన్లకు నివాళులు అర్పించే ‘ఆయే మేరే వతన్ కె లాగాన్’ గీతాలను వినిపించి ఆకట్టుకున్నారు. బెస్ట్ ఆఫ్ ది బిగ్ బ్యాండ్‌ను వినిపిస్తున్నప్పుడు ఆడిటోరియంలోని ఆహూతులందరూ లేచి నిలబడి మ్యూజిక్కు అనుగుణంగా చప్పట్లు కొట్టారు. చివరిగా ట్రైసర్వీస్ మార్చింగ్ మెడ్లీ పేరుతో ’సారే జహాసే అచ్ఛా’ గీతానికి, జనగణమన పాటలను వినిపించారు. ఈ గీతాలన్నీ సతీష్ కె.ఛాంపియన్, ఎస్.జానకిరామన్, ఆంటోని రాజ్ సంగీత దర్శకత్వం వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే డి.నరేంద్ర విచ్చేసి ప్రభుత్వం తరఫు వారిని అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. -
భిన్నత్వంలో ఏకత్వం
సందేశాత్మకంగా సాగిన ఇండియన్ నేవల్ బ్యాండ్ సాక్షి, విశాఖపట్నం: భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఇండియన్ నేవల్ బ్యాండ్ రాష్ట్రపతికి గౌరవ సూచకంగా శనివారం సాయంత్రం ఇచ్చిన ప్రదర్శన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాముద్రిక నేవల్ ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రదర్శనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిలకించారు. 74 ఏళ్లుగా నేవీ బ్యాండ్ జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలిస్తోంది. అదే విధంగా విశాఖలోనూ తమ వాయిద్యాలతో స్ఫూర్తి నింపింది. సముద్ర జలాలపై ప్రపంచ దేశాల మధ్య శాంతి, సమైక్యతలనుకోరే భారత చిహ్నంగా నేవీ బ్యాండ్ వ్యవహరిస్తోంది. అమెరికా, బ్రిటన్, రష్యా, క్యూబా, జపాన్ వంటి దేశాల్లోనూ పర్యటించి ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఐఎఫ్ఆర్లో భాగంగా విశాఖలో ఇచ్చిన ప్రదర్శనలో భారత సంప్రదాయ సంగీతంతో పాటు పాప్, ఫోక్ మ్యూజిక్ వినిపించారు. సుమారు 80 నిమిషాల పాటు నేవీ బాండ్ అలరించింది.