breaking news
Indian auto industry
-
ఆటో రంగానికి వైరస్ కాటు...!
న్యూఢిల్లీ: దేశీ ఆటో పరిశ్రమకు కోవిడ్–19 (కరోనా) వైరస్ కుంగదీసింది. గతేడాదిలో భారీ పతనాన్ని నమోదుచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన ఈ రంగాన్ని తాజాగా కరోనా వైరస్ మళ్లీ పడేసింది. దిగ్గజ ఆటో సంస్థ మారుతి సుజుకీ దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.6 శాతం పడిపోయాయి. గత నెల్లో 1,36,849 యూనిట్లకు పరిమితమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర (ఎం అండ్ ఎం) అమ్మకాలు ఏకంగా 42 శాతం క్షీణించాయి. కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి సప్లై తగ్గడం వల్ల ఈ స్థాయి పతనం నమోదైందని సంస్థ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వెల్లడించారు. వైరస్ కారణంగానే తమ కంపెనీ ఫిబ్రవరి విక్రయాలు తగ్గాయని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. -
ఆటో ఇండస్ట్రిలో ఆరున్నర కోట్ల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ : భారత్ ఆటోమొబైల్ ఇండస్ట్రి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో ఒకటిగా పేరొందుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా దృష్టిసారిస్తున్న భారత ఆటో మొబైల్ పరిశ్రమ వచ్చే దశాబ్దంలో దేశ జీడీపీలో 12 శాతం కంటే ఎక్కువగా తనవంతు దోహదం చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని, కొత్త ఉద్యోగాల కల్పనకు పీఠం వేయనుందని ఇండస్ట్రి అధికారులు పేర్కొంటున్నారు. 2026 కల్లా ఈ పరిశ్రమ దేశవ్యాప్తంగా ఆరున్నర కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని దేశీయ అగ్రగామి ఆటో పరిశ్రమ మారుతిసుజుకి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెనిచి అయుకవా తెలిపారు. వచ్చే దశాబ్దంలో భారత ఆటోమొబైల్ ఇండస్ట్రి, దేశ జీడీపీలో 12 శాతం కంటే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయాలనే లక్ష్యాన్ని తాము నిర్దేశించుకున్నామని, ఈ నేపథ్యంలో 2026 కల్లా 65 మిలియన్ల అదనపు ఉద్యోగాలను కల్పించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో దేశ జీడీపీలో 7.1 శాతం సహకారం అందిస్తుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 32 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. గత పదేళ్లలో 35 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపారు. సామాజిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థలను కలుపుకుని స్థిరమైన, పరస్పర లాభదాయకమైన అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్ట్చర్స్(సియామ్) నిర్వహించిన మొదటి కార్పొరేట్ సామాజిక బాధ్యత సమావేశంలో పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ గ్రామాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి గణనీయమైన పాత్ర పోషించిందని, తమ ప్రయత్నాలు కూడా ప్రభుత్వ మిషన్ క్లీన్ ఇండియా అండ్ స్కిల్ ఇండియాకు సమాంతరంగా ఉన్నట్టు ఆనందం వ్యక్తంచేశారు. 2026 కల్లా ఆటోమొబైల్ ఇండస్ట్రి కేవలం మొబిలిటీని మాత్రమే కాక, సురక్షితమైన, సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల విధానాలపై ఫోకస్ చేస్తుందని హామీ ఇచ్చారు.