breaking news
humer Plus
-
కంకాళకేయుడి కథ
హ్యూమర్ ఫ్లస్ ఫ్లాష్‌బ్యాక్‌లు వినివిని మైండ్ బ్లాకయిపోయిన ఆజానుబాహుబలి రిలీఫ్ కోసం వంటల పోటీకి వెళ్లాడు. గాడి పొయ్యి అంటించి అగ్గిరాముడై వెలుగుతుండగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి ‘బాహుబలి’ అని గొణిగాడు. ఒళ్లంతా తారు పూసుకుని ఒక కంటికి గాజు కన్నుని ఎకస్రా ్టఫిట్టింగ్ చేసుకుని ఉన్నాడతను. అతని పక్కనున్న వ్యక్తి గంగాళంలోకి గరిటెకి బదులు చెయ్యిని పెట్టి కెవ్వున అరిచి ‘బాహుబలా?’ అన్నాడు. దాంతో అందరూ పూనకం పట్టినట్టు ‘బాహుబలి’ అని అరిచారు. ఇది చూసి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ప్రమాదముందని గ్రహించిన బలి పారిపోడానికి ప్రయత్నించాడు. గాజు కన్ను అడ్డుగా నిలబడ్డాడు. ‘‘తప్పేముంది స్టార్ట్ చెయ్యి’’ అన్నాడు బలి నిస్సహాయంగా. ‘‘నా పేరు కంకాళకేయుడు. కంటితో చూసిందేదీ నిజం కాదని గ్రహించిన నేను ఈ గాజుకన్నుతో లోకాన్ని చూస్తున్నాను. మీ నాన్న చేతిలో మానం పోయి నగ్నసత్యాన్ని తెలుసుకున్న కళావర్కేయుడు మా అన్న. అరటి ఆకులు కప్పుకుని ఎదుట నిలబడిన మా అన్నని చూసి ఏం జరిగిందని అడిగాను. ‘హరహర మహాదేవ సాంబశివగామి’ అని అరిచాడు. నేను జడుసుకుని ఆ శబ్దానికి అర్థమేమిటని అడిగాను. ఆమె ఒక స్త్రీమూర్తని, ఆమెతో ఏం మాట్లాడినా ప్రమాదమని చెప్పి, ప్రపంచంలో ఎవరికీ అర్థంకాని భాషలో ఆమెతో మాట్లాడితే బతికి బట్టకట్టొచ్చన్నాడు. దాంతో మా రాజ్యంలో నిఘంటువులు అమ్మేవాడిని పిలిచి ఎవరికీ అర్థం కాని భాష తయారు చేయమన్నాను. ఐదు నిముషాల్లో వాడు కిలకిల భాషని రెడీ చేశాడు. శాంపిల్‌గా ‘మిన్కిన్ డంకిన్, చెన్బన్ డమాడమాన్’ అని ఒక వాక్యం వదిలాడు. ఆకారాలను చూసి కాకుండా నకారాలను చూసి భయపడ్డం అదే మొదలు. యుద్ధానికి బయలుదేరాం. అనుకున్నట్టుగానే సాంబశివగామి చర్చలకు వచ్చింది. ‘‘లకలకన్, మకన్టెకన్, నిన్నన్కున్’’ అని అన్నాను. శివగామి చిరునవ్వు నవ్వి తమకు నమ్మకంగా ఉంటూ శత్రువులకి అతినమ్మకంగా రహస్యాలు చేరవేసే ఆఠీన్ జాకీని అనువాదకునిగా ప్రవేశపెట్టింది. వాడు తుండు గుడ్డని నోట్లో కుక్కుకుని ‘నా నోటితో చెప్పలేనమ్మగారూ’ అంటూ బోరున ఏడవసాగాడు. నేను తత్తరపడ్డాను. ‘‘మీ మీద వాడు మనసుపడ్డాడు అమ్మగారు’’ అని వాడు అనువాదం చేశాడు. నేను కోపంతో ‘‘చెత్తనా... (బీప్) నా లాంగ్వేజ్‌కి అర్థమే లేనపుడు ఎలా అనువాదం చేస్తావురా’’ అని బండబూతులు తిట్టాను. ‘‘మీ బాడీ లాంగ్వేజి ద్వారా అనువాదం చేశాను. ప్రపంచంలో అసలైన ప్రమాదం అనువాదమే. అనువాదకుడికి అర్థాలతో పనేలేదు. అసలు ఏ భాషా రాకుండా తెలుగులో పుస్తకాలే అనువాదం చేసినవాళ్లు ఎందరో వున్నారు తెలుసా’’ అన్నాడు జాకీ. వాడికి ఏ కీలుకాకీలు విరుద్దామనుకుంటూ ఉంటే శివగామి పళ్లునూరింది. కొడుకులు కత్తులు నూరారు. వాళ్ల వ్యూహాలన్నింటిని నేను చిత్తు చేస్తూ వుంటే శివగామి ‘గుర్రప్పా’ అని అరిచింది. గుర్రప్ప గుర్రంలా దబేలుమని దూకి అశ్వవ్యూహం అమలు చేశాడు. గుర్రం ఆకారంలో సైన్యం నిలబడి మమ్మల్ని వెనుక కాళ్లతో తన్నసాగింది. మా సైన్యంలో యుద్ధం చేసేవాళ్ల కంటే చూసేవాళ్లు ఎక్కువ ఉండడంతో తన్నులు తిని ఓడిపోయాం. అవమాన జ్వాలతో తిరిగి వెళ్లలేక ఇలా మంటముందు వంటవాడిగా మిగిలిపోయాను’’ అని కంకాళకేయుడు ముగించాడు. ఆజానుబాహుబలి కోపంతో ఊగిపోతూ ‘‘ప్రతివాడు ఫ్లాష్‌బ్యాక్‌లు చెప్పడమే కానీ ఇంతకూ మా నాన్న, వంటవాడు ఎలా అయ్యాడో చెప్పిచావండి’’ అని అరిచాడు. ‘‘అది మీ అమ్మ చారుసేన మాత్రమే చెప్పగలదు. పుట్టిన వెంటనే కేర్‌కేర్ మనకుండా చారుచారు మనడంతో ఆమెకాపేరు. డైమండ్ బళ్లాలుడి కోటలో ఉంది వెళ్లి అడుగు.’’ ‘‘ఎలా గుర్తుపట్టడం?’’ ‘‘కాలికి సంకెళ్లు వేసుకుని, ఎవరైతే కట్టెపుల్లలు ఏరి, పొయ్యిలో పెట్టి కాఫీ చేస్తూ ఉంటారో ఆమే చారుసేన.’’ - జి.ఆర్.మహర్షి -
గుర్రప్ప నాడార్ కథ
హ్యూమర్ ఫ్లస్ ఆజానుబాహుబలి కూరగాయల మార్కెట్‌కి వచ్చాడు. వర్షమొచ్చింది. కీలకమైన సమయాల్లో వానరావడం సినిమాల్లోనే కాదు, జీవితంలో కూడా సంభవమే. ఉన్నట్టుండి సర్రున ఎవరో జారుతున్న శబ్దం వినిపించించింది. ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా ఒక వ్యక్తి మోకాళ్లపై జోరుగా జారుతూ అతివేగంగా వచ్చి బ్రేకు వేశాడు. ‘తొక్కమీద కాలేశారా?’’ అడిగాడు బలి. ‘‘ఇలా జారడం మా ఆచారం బాహుబలి’’ ‘‘నా పేరు నీకెలా తెలుసు?’’ ‘‘నాకింకా చాలా తెలుసు. నా పేరు గుర్రప్ప నాడార్. నాడా దొరికితే గుర్రాలను వెతికే వ్యక్తిని నేను. అందుకే ఆ పేరు’’ ‘‘ఈ మెరుపులు మనకు ఫ్లాష్ కొడుతున్నాయి కానీ, నువ్వు ఫ్లాష్ లేకుండా బ్యాక్‌స్టోరీ చెప్పు’’ అన్నాడు బలి. ‘‘నేను చెప్పే కథ మీ చిన్నతాత ముక్కల దేవుడి దగ్గర మొదలవుతుంది. ఆయన చదవడు, రాయడు కానీ పేకాటరాయుడు. ముక్కలు పట్టుకుని పట్టుకుని ఒక చెయ్యి పనికి రాకుండా పోయింది. ఆయన దగ్గర ఎవరూ గెలవలేరు. ఒకవేళ గెలిచినా ఆయన ఓడిపోవడానికి ఒప్పుకోడు. గెలిచిన వాళ్లని చావగొడతాడు. అందువల్ల ఎవరూ గెలవకుండా జాగ్రత్తపడేవాళ్లు. దాంతో ఆయన పే అంటే పేకముక్కలు పడేవి. ఈ విషయం నాకు తెలియక ఆయనతో పేకాటకి సవాల్ చేశాను. అప్పుడు నేను, ఎక్కిన ప్రతి గుర్రం పారుతుందనే ఆవేశంలో ఉండేవాణ్ణి. ఎత్తిన ప్రతిముక్కా జోకరేననే అజ్ఞానంలో ఉండేవాణ్ణి. గ్రహచారం బాలేక ముక్కల దేవుడితో మూడుముక్కలాటకి కూచున్నాను. నేను గెలిస్తే ఆరుతరాలు, ఆయన గెలిస్తే మూడుతరాలు బానిసగా నేనే ఉండాలని షరతుతో ఆట మొదలైంది. కన్ఫ్యూజన్లో ఒప్పుకున్నాను. మూడుతరాల బానిసత్వం, పాత పేకముక్కలు మిగిలాయి నాకు’’ అంటూ గుర్రప్ప ఒక్క క్షణం ఆగి బాహుబలి పాదాన్ని తన నెత్తిన ఉంచమన్నాడు. ‘‘నెత్తి మీద చేతులు పెట్టడం తెలుసు కానీ, కాలు పెట్టడం వినలేదే’’ అనుమానంగా అడిగాడు బాహుబలి. ‘‘వేదం కంటే వాదమే గొప్పదని మా ఆచారం’’ ‘‘మై ఫుట్. ఆచారాలు మానేసి కథ చెప్పు’’ ‘‘ఇలా ఉండగా మీ తాత పోగా, కొన్ని నెలలకు మీ నాన్నని కని మీ నాయనమ్మ వెళ్లిపోయింది. మీ చిన్న నాయనమ్మ హరహర మహాదేవ సాంబశివగామి...’’ ‘‘ఇంత పెద్దపేరు అవసరమా?’’ ‘‘ఆ పేరంటే ఆమెకి చాలా ఇష్టం. నోరు తిరగని వాళ్లని కొరడాలతో కొట్టించేది’. ప్రశ్న వేయకుండా కథ వినండి. ఆమె మీ నాన్నని, చిన్నాన్న డైమండ్ బళ్లాలుణ్ణి పెంచింది. పెరిగి పెద్దవాళ్లయి వాళ్ళు కూడా పేకాటలో నిష్ణాతులయ్యారు. మీ నాన్న కళ్ళు మూసుకుని కూడా ఆడగలిగితే, మీ చిన్నాన్న కళ్ళు తెరుచుకుని అందరి ముక్కలు చూడ్డంలో రి‘కార్డు’ సాధించాడు. ఇలా ఉండగా మీ దగ్గర నమ్మకంగా ఉన్న ఆఠీన్ జాకీ అనే అనుచరుడు మీ శత్రువైన కళావర్ కేయుడు అనేవాడికి పేకాట రహస్యాలు చేరవేశాడు. దాంతో వాడు మందీమార్బలంతో ‘పేకోబలి’ అని అరుస్తూ వచ్చాడు. ‘‘మీ నాన్న, చిన్నాన్న ఆటకి దిగారు. ‘‘డైమండ్ జాకీ, కళావర్ ఆసు, ఆఠీన్ కింగ్, ఇస్పేట్ రాణి’’ అని శత్రువు అరిస్తే అది వాడి భాషనుకుని పొరబడ్డాం. ఇస్పేట్ రాణి అని తననే అంటున్నాడని అనుమానించిన మీ చిన్న నాయనమ్మ హర హర మహా..’’ ‘‘వద్దులే నాయనమ్మ అను చాలు’’ ‘‘మీ నాయనమ్మ పేకోద్రేకంతో కళావర్కేయుడి మొలతాడుతో సహా ఎవరు గెలిస్తే వాడికే ‘ఆసు’ష్మతి రాజ్యమని ప్రకటించింది. ఈ కళావర్కేయుడి బలహీనత ఏమంటే వాడికి రాణుల పిచ్చి. క్వీన్ ముక్క కనబడితే బోన్స్ విరిగినా లెక్కచేయడు. ఇది గ్రహించి మీ నాన్న వాడికి పనికిరాని ప్లెయిన్ ముక్కలు వేసి సులభంగా ఓడించాడు. చివరికి మొలతాడు, పంచె మిగిలాయి. పంచె గెలుచుకున్నా ప్రమాదమే. మొలతాడు గెలుచుకున్నా ప్రమాదమే. మొలతాడు లేకపోతే పంచె ఎలాగూ ఊడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి ప్రజలు పారిపోవడానికి ప్రయత్నించడం వల్ల తొక్కిసలాట జర గొచ్చు. ప్రజాసంక్షేమం దృష్ట్యా మీ నాన్న ఆలోచనలో పడగా మూర్ఖుడైన మీ చిన్నాన్న షో చూపించి మొలతాడు లాగేశాడు. ఊహించినట్టే ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. గెలిచిన మీ చిన్నాన్నను కాకుండా, ప్రజల గురించి ఆలోచించిన మీ నాన్ననే వారసుడిగా ప్రకటించింది నాయనమ్మ’’. ‘‘అయితే కింగ్ ఆఫ్ ది కార్డ్స్‌గా వున్న మా నాన్న అమరేంద్ర నరబలిగా ఎలా మారాడు? వంటవాడు ఎలా అయ్యాడు?’’ ‘‘అది వేరే ఫ్లాష్‌బ్యాక్’’ ఇంతలో ‘‘గుర్రప్పా’’ అని పిడుగులాంటి కేక వినిపించింది. స్లో మోషన్లో చూస్తే హరహర మహాదేవ సాంబశివగామి. మోకాళ్లపై ఒక రౌండ్ స్కేటింగ్ చేద్దామనుకున్నాడు కానీ చిప్పలు టకటకలాడేసరికి తమాయించుకున్నాడు. ‘‘మొత్తం ఫ్లాష్‌బ్యాక్ చెప్పే అర్హత నీకు లేదు, నువ్వు బానిసవి’’ ‘‘మహాప్రసాదం తల్లీ. మరోసారి పాదం ఇస్తే ఆనెలు అవి ఉన్నాయేమో చెక్ చేసి ఇస్తా’’ అతని మాటలు వినిపించుకోకుండా సాంబశివగామి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లింది. (ఆ వివరాలు వచ్చే సంవత్సరం) - జి ఆర్ మహర్షి