breaking news
huge protests
-
‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం
లండన్: కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన విదేశీ పర్యటనల్లో ఇదివరకెప్పుడూ లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది. భారత్‌ను కుదిపేసిన కథువా హత్యాచార ఘటనను నిరసిస్తూ, ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు హక్కుల సంఘాలు ఆందోళనలు చేశాయి. సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు. వాటిపై ‘మోదీ నాట్ వెల్కమ్..’, ‘జస్టిస్ ఫర్ ఆసిఫా’ రాతలను ప్రదర్శించారు. థేమ్స్ తీరంలోని బ్రిటన్ పార్లమెంట్ ఎదుట, చుట్టుపక్కల వీధుల్లో ఆ వాహనాలను తిప్పారు. బ్రిటన్‌లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్ స్క్వేర్ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఆందోళనల నేపథ్యంలో భారత ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో లండన్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే మరొకొన్ని చోట్ల మోదీ.. భారతీయు సమూహాలతో కరచాలనం చేస్తూ సందడి చేశారు. జమ్మూకశ్మీరులోని కథువా జిల్లా రసానలో గుర్రాలు మేపుతోన్న ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, రోజులపాటు సామూహిక అత్యాచారం జరిపి, చివరికు కొట్టి చంపిన ఘటనను ప్రపంచమంతా ఖండించింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఐక్యరాజ్యసమితి సైతం భారత ప్రభుత్వానికి సూచించింది. చిన్నారి హత్యాచారం కేసులో దర్యాప్తు చేసిన సిట్ ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేయగా, సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. అటు ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కథువా, ఉన్నావ్ ఘటనలపై గత శుక్రవారం స్పందించిన ప్రధాని మోదీ.. ఇటువంటి సంఘటనలు మన దేశానికి సిగ్గు చేటని, నేరస్థులను ఉపేక్షించేది లేదని అన్నారు. -
ఆలయంలో మద్యం సీసాలతో ఫారిన్ జంట
హంపీ: హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆలయంలో ఓ విదేశీ పర్యాటకుడు మద్యం సీసాతో ప్రవేశించడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఆలయం మొత్తం ఉద్రిక్త పరిస్థితిని నెలకొల్పింది. ప్రవేశ ద్వారం వద్దే అతడిని అడ్డుకొని వెనక్కి పంపించినా ఖాతరు చేయకుండా మళ్లీ ప్రవేశించడంతో పలువురు ఆలయ ధర్మకర్తలకు, కార్యకర్తలకు, భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అతడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన హంపీలోని విరుపాక్ష ఆలయంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గుర్తు తెలియని ఆ టూరిస్టు హాలండ్ ప్రాంతానికి చెందినవాడని అంటున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయ ప్రాంగణంలో, ఆవరణంలో మద్యపానంపై నిషేధం ఉంది. అలాంటిది అతడు మాత్రం ఏకంగా ఆలయం లోపలికి మద్యంతో అడుగుపెట్టాడు. తొలుత మేం చెప్పగానే అతడు తన పార్టనర్‌తో కలిసి బయటకు వెళ్లినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత వెనక్కు వచ్చారు. అయితే, ఎవరికీ కనిపించకుండా అతడి దుస్తుల వెనుక దాచుకొని మళ్లీ తెచ్చుకున్నాడు. దీంతో గట్టి వార్నింగ్ ఇచ్చి వెనక్కి పంపించాం’ అని సేవ్ హంపీ ఉద్యమకారుడు రచ్చయ్య తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని, ఆ టూరిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ టూరిస్టుకోసం ప్రయత్నిస్తున్నారు.