ఈ వారం యూట్యూబ్ హిట్స్
చూస్తున్నా.. చూస్తున్నా..
ఓయ్ పిల్లాడా!
ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ జాసుల్స్
నిడివి : 1 ని. 37 సె., హిట్స్ : 8,61,806
‘ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ జాసుల్స్..’ అంటూ.. టెలిగ్రాఫ్ పత్రిక యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసిన వీడియో ఇప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ‘జాసుల్’ అంటే తోసుకు వచ్చేయడం, తోసుకుపోవడం! గ్రూప్ ఫొటో దిగుతున్నప్పుడు చిన్నపిల్లలు తమకు ఇష్టమైన వాళ్ల పక్కన నించోవడం కోసం తోసుకుని ముందుకు వచ్చేస్తుంటారు. సరిగ్గా అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ జి–20 దేశాధినేతల గ్రూప్ ఫొటోలో పై వరుస నుంచి మధ్య వరుసకు వచ్చి, మధ్య వరుస నుంచి కింది లైన్‌కి వచ్చి ఒక వ్యక్తి పక్కన నిలుచున్నాడు! ఆ వ్యక్తి ఎవరనుకున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇదంతా గమనిస్తూ ఉన్న జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ (ఆవిడ.. కింది వరుసలో ఉన్నారు) ‘చూస్తున్నా.. చూస్తున్నా.. ఓయ్ పిల్లాడా..’ అన్నట్లు మెక్రాన్ వైపు చూసి నవ్వారు. ఏటా ఒక్కోదేశంలో జరుగుతుండే జి–20 (ఇరవై దేశాధినేతల) సదస్సు ఈ నెల 7, 8 తేదీలలో జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగింది. సంప్రదాయం ప్రకారం సదస్సు ముగిశాక, ఎవరి దేశాలకు వాళ్లు వెళ్లిపోయే ముందు గ్రూప్ ఫొటో దిగుతారు. అలా ఫొటో దిగుతున్నప్పుడే మెక్రాన్ అందర్నీ తోసుకుంటూ వచ్చి ట్రంప్ పక్కన నిలబడ్డారు. అన్నట్లు మన మోదీజీ కూడా గ్రూపులో ఉన్నారు. నిజంగా ఇది స్కూల్ పిల్లలు గ్రూప్ ఫొటో దిగుతున్నట్లే ఉంది!
ఉపద్రవాలపై ఉపగ్రహాల యుద్ధం
జియోస్టార్మ్ : ట్రైలర్–2
నిడివి : 2. 29 సె.య హిట్స్ : 22,96,138
‘జియోస్టార్మ్’ చిత్రం రెండో ట్రైలర్ ఇది. అక్టోబర్ 20న విడుదల అవుతోన్న ఈ డిజాస్టర్ సైన్స్–ఫిక్షన్ కామెడీ ఆక్షన్ మూవీ ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నదో ట్రైలర్లో చూడొచ్చు. భూగోళాన్ని అంతుచిక్కని విపత్తులేవో వరుసగా పట్టి పీడిస్తుంటాయి. కుటుంబాలు చెల్లాచెదురైపోతుంటాయి. ఈ వాతావరణ విపత్తుల నుంచి మానవాళిని కాపాడేందుకు దేశాధినేతలంతా కలసి ఆలోచిస్తారు. ఉపగ్రహాలతో అత్యంత ఆధునికమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకుంటారు. అయితే ఎక్కడో ఏదో బెడిసి కొడుతుంది. భూగోళాన్ని రక్షించాల్సిన నెట్వర్క్, భూగోళాన్ని కబళించే దిశగా పని మొదలు పెడుతుంది. లోకం మొత్తం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. అయితే ఇదంతా నెట్‌వర్క్‌లో లోపం వల్ల జరగలేదనీ, ఎవరో కావాలనే వినాశనం వైపు నెట్‌వర్క్‌ను మళ్లించారని తెలుస్తుంది. చివరికేమిటన్నది సినిమాలో చూడాల్సిందే. లేదా ఆ లోపు విడుదలయ్యే మూడో ట్రైలర్లో తెలుసుకోవచ్చు. ముగింపు తెలిస్తే ఇక ఆసక్తి ఏముంటుంది అంటారా? కానీ ఇది ఆదీ అంతం లేని హాలీవుడ్ థీమ్! కనుక డోన్ట్ వర్రీ.
ఆడి ఆడి అలసి.. అమ్మ ఒడిలో సొలసి
కంగారూ జోవీ ఫస్ట్ హాప్స్
నిడివి : 35 సె. హిట్స్ : 2,64,913
సిడ్నీ నుంచి అరగంట ప్రయాణ దూరంలో ఉన్న ఆస్ట్రేలియన్ రెపై్టల్ పార్క్ కొన్నాళ్లుగా సందడి సందడిగా ఉంటోంది. జెల్లీ బీన్ అనే పేరున్న ఓ ఎనిమిది నెలల కంగారూ పిల్ల (కంగారూ పిల్లను ‘జోవీ’ అని అంటారు ఇంగ్లిష్‌లో) చెంగు చెంగున గెంతులు వేస్తూ, మధ్యలో అలుపు వచ్చినప్పుడు తల్లి పొట్ట కింద సంచిలో సేదతీరుతున్న దృశ్యాన్ని చూసి పార్క్ సందర్శకులు కేరింతలు కొడుతున్నారు. జూ పార్క్‌లో ఇలాంటివి సర్వ సాధారణమే అయినా, ఆస్ట్రేలియన్ రెపై్టల్ పార్క్ వాళ్లు ఈ పిల్ల కంగారూ గెంతులకు మురిసిపోయి, దీని కదలికను ప్రత్యేకంగా షూట్ చేయించి మరీ యూట్యూబ్‌లోకి ఎక్కించారు. పార్క్ ప్రతి రోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు తెరిచే ఉంటుంది. లోపల విహరించే మూగజీవులన్నిటికీ సందర్శకులు పరిమితంగా ఫీడింగ్ ఇవ్వొచ్చు. అలాగే వారు అక్కడే ఓ మూల వంటా వార్పూ చేసుకుని, ఆరగించి, మళ్లీ ఒకసారి పార్క్‌ను కలియతిరిగి వెళ్లొచ్చు.
ఎవరికి తెలియదండీ బటర్ చికెన్ చెయ్యడం?!
హోమ్ మేడ్ బటర్ చికెన్
నిడివి : 1 ని. 27 సె.య హిట్స్ : 2,57,640
అదే తొందరపాటు అంటే! తెలిసినా, ఇంకోసారి తెలుసుకోకూడదనేం ఉంది? ఏమో ఏ చెయ్యి ఎంత యమ్మీగా ఉంటుందో! ‘టేస్టీ’ అనే బ్లాగ్.. ‘హియర్ ఈజ్ వాట్ యు ఆల్ నీడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో నేర్పుతున్న ఈ వంటకాలు భలే రుచిగా ఉంటున్నాయని యూట్యూబ్‌లో కామెంట్స్ వస్తున్నాయి. లేటెస్టుగా రెండు రోజుల క్రితమే ఇండియన్ స్టెయిల్ బటర్ చికెన్‌ని ‘టేస్టీ’ బ్లాగ్ పోస్ట్ చేసింది. నలుగురికి సరిపడేలా బటర్ చికెన్‌ను చేసుకోవాలంటే ఏ పరిమాణంలో, ఏయే దినుసులు కావాలో, వాటిని ఏ పాళ్లలో కలుపుకోవాలో అన్నీ సచిత్రంగా, డీటెయిల్డ్‌గా ఉన్నాయి ఈ వీడియోలో. కళ్లు మూసుకుని బటర్ చికెన్‌ని చేసెయ్యొచ్చంటే నమ్మలేం కానీ.. ఇంచుమించు అంత ఈజీగానే ఉంది ఈ తయారీ. బ్యాచిలర్స్కి మరియు బద్ధకస్తులకు ఇలాంటివి ఓ ఐదారు తెలిసి ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది.