breaking news
Hollywood Films
-
6 హాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది
బాలీవుడ్ బిజీ స్టార్ ప్రియాంక చోప్రా.. ఇటీవల ఆరు హాలీవుడ్ సినిమాలకు నో చెప్పిందట. ఓ వైపు క్వాంటికో సిరీస్ షూటింగ్లో బిజీగా ఉండగా, మరోవైపు హాలీవుడ్లో తన తొలి చిత్రం 'బేవాచ్' ప్రమోషన్‌కు ప్రిపేర్ అవుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో బోలెడన్ని స్క్రిప్టులు కూడా విన్న పిగ్గీ చాప్స్.. 6 హాలీవుడ్ సినిమాకు నో చెప్పేసింది. తాజాగా ఆమె ఇంటర్నేషనల్ ప్రాజెక్టు 'ప్రాజెక్టు రన్ వే'లో మెరవనుంది. అమెరికన్ టెలివిజన్‌కి చెందిన ఫ్యాషన్ రియాలిటీ షోలో ఆమె సెలబ్రిటీ గెస్ట్‌గా అలరించనుంది. సెప్టెంబరు 15 నుంచి ప్రసారం కానున్న ప్రాజెక్టు రన్ వే సీజన్15లో ప్రియాంక పాల్గొననుంది. క్వాంటికో తరువాత ఆమె చేస్తున్న మరో టెలివిజన్ సిరీస్ ఇది. గత నెలలో ఆమె సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జొహార్, జోయా, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రముఖ దర్శకనిర్మాతలను కలుసుకున్నప్పటికీ ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇదే విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా ఓకే చెప్పలేదు. 6 సినిమాలను వదులుకున్నాను. ఇక నుంచి బెస్ట్ అనుకున్న సినిమాలకే ఓకే చెప్తాను. వచ్చే ఏడాది నుంచి ఇటు బాలీవుడ్లో, అటు హాలీవుడ్లో ఒక్కో సినిమానే చేయాలని అనుకుంటున్నాను. అది కూడా నాకు సమయం దొరికితేనే. నేను 70ఎంఎం గాళ్..ఏదేమైనా హిందీ సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదు. నేను నటిస్తున్న టీవీ సిరీస్‌ను కూడా 70 ఎంఎంలోనే చూస్తానంటూ సెలవిచ్చింది. తను కేవలం నటి మాత్రమే కాదని, ఆర్టిస్ట్నని.. ఎప్పుడూ ఒకే తరహాలో నటించలేనని, వెరైటీని ప్రేమిస్తానని తెలిపింది. క్రియేటివ్ ప్రస్ట్రేషన్కి గురవుతున్నానని.. ప్రస్తుతం ఒక సమయంలో ఒక సినిమాలోనే నటించాలని నిర్ణయించుకున్నానని వివరించింది ప్రియాంక చోప్రా. Namaste!Coming soon..Project Runway Season 15, Sept 15th!… https://t.co/LWVX2rkwDy @ninagarcia @zacposen @heidiklum @georginachapmanmarchesa — PRIYANKA (@priyankachopra) 8 August 2016 -
హాలీ... జాలీ... సమ్మర్
వేసవిలో సందడి చేయడానికి హాలీవుడ్ సూపర్‌హీరోలు సిద్ధమైపోయారు. బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ లతో పాటు సూపర్‌హీరోలు ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా తమ పోరాటాలతో వెండితెరపై సరికొత్త అనుభూతిని అందించడానికి సై అంటున్నారు. ఈ ఫిక్షన్ చిత్రాలతో పాటు ఓ నిజజీవిత కథ కూడా ఈ వేసవికి తెరపై రానుంది. మరి ఈ వేసవిలో విడుదలయ్యే హాలీవుడ్ చిత్రాల విశేషాలు.... బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ తలపడితే: మూడేళ్ల క్రితం వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ కథలో ప్రపంచాన్ని కాపాడిన సూపర్‌మ్యాన్ అందరికీ ఆరాధ్య దైవం అయిపోతాడు. కానీ కాలక్రమంలో సూపర్‌మ్యాన్ ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు వస్తుంది. సూపర్‌మ్యాన్ వైఖరి నచ్చక, అతనితో పోరాటానికి బ్యాట్‌మ్యాన్ సిద్ధమవుతాడు. ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో మానవ జాతిని అంతం చేయడానికి ఒక రాక్షసుడు ఎంటర్ అవుతాడు. అతనిపై పోరాటానికి వీరిద్దరితో పాటు మరో సూపర్‌ఉమన్ ‘వండర్ ఉమన్’ తోడవుతుంది. వీళ్ళంతా కలసి ప్రపంచాన్ని ఎలా కాపాడారనే ఇతివృత్తంతో తెరకెక్కిన సీక్వెల్ ‘బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్’. గతంలో ‘300’, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ చిత్రాల ద్వారా ప్రసిద్ధికెక్కిన జాక్ స్నైడర్ ఈ చిత్రానికి దర్శకుడు. హాలీవుడ్ నటుడు బెన్ ఎఫ్లిక్ బ్యాట్‌మ్యాన్‌గా నటిస్తుంటే, ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’తో సూపర్‌మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన హెన్రీ క్యావిల్ ఈ చిత్రంలో కూడా అదే పాత్ర పోషించనున్నారు. విడుదల: మార్చి 25 ఆమె కూతురి కథ: 14 ఏళ్ల క్రితం ఏ మాత్రం స్టార్ వాల్యూ లేకుండా చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం - ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్’. దాదాపు రూ. 33 కోట్లతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 2400 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్-2’ ఈ సమ్మర్‌కి రానుంది. నవ్వులు పంచడానికి సిద్ధమవుతోంది. మొదటి భాగంలో గ్రీక్ కుటుంబానికి చెందిన కథానాయిక తన దేశస్థుడిని కాకుండా ఓ అమెరికన్‌ను ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా ఆ ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకెళ్లిందనేదే ఈ చిత్ర కథాంశం. ఇప్పుడీ సీక్వెల్లో కథానాయిక కూతురు ఎవరిని ప్రేమించి, పెళ్లి చేసుకుందనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. పైగా కథానాయిక కుటుంబం వెనుక దాగి ఉన్న ఓ రహస్యం ఇతివృత్తంగా ఈ సినిమా సాగనుంది. మొదటి భాగానికి కథ-స్క్రీన్‌ప్లే అందించిన కథానాయిక నియో వర్డోలాస్ ఈ చిత్రానికి కూడా కథను అందించడం విశేషం. దాదాపు ప్రీక్వెల్‌లో కనిపించిన నటీనటులే సీక్వెల్లో కూడా కనిపించనున్నారు. విడుదల :మార్చి 25 మోగ్లీ సాహసాలు: మోగ్లీ, బాలూ....ఇలాంటి పాత్ర లు వింటే జంగిల్ బుక్ ఠక్కున గుర్తొస్తుంది. దూరదర్శన్ ఏలుతున్న రోజుల్లో ఈ యానిమేషన్ సీరియల్ ఓ సంచలనం. అప్పట్లో చాలా మంది పిల్లలకు ఎంతో ఇష్టమైన కార్టూన్ సీరియల్. ఇప్పుడు అదే సినిమా రూపంగా రానుంది. అడ విలో ఓ పిల్లాడు తప్పిపోతాడు. ఎలుగుబంటి, చిరుతపులి, గొర్రిల్లా - ఇంకా మిగతా జంతువులు అతణ్ణి పెంచుతాయి. మరి తర్వాత ఆ పిల్లాడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్రం. భారత సంతతికి చెందిన పదేళ్ళ నీల్ సేథీ ఈ చిత్రంలో మోగ్లీగా కనిపించనున్నారు. ఇందులో మోగ్లీ పాత్ర తప్ప అన్నీ యానిమేషన్లోనే రూపొందించారు దర్శకుడు జాన్ ఫెవ్రూ. ప్రముఖ హాలీవుడ్ తారలు బిల్ ముర్రే, బెన్ కింగ్స్లే, స్కార్లట్ జొహాన్సెన్, ఫ్రిదా పింటో వంటివారు ఇందులోని యానిమేషన్ పాత్రలకు గాత్రం అందించారు. ఇక ఈ చిత్రం హిందీ వెర్షన్‌కు ప్రియాంకా చోప్రా, ఇర్ఫాన్‌ఖాన్, నానా పటేకర్, ఓంపురి డబ్బింగ్ చెప్పారు. విడుదల: ఏప్రిల్ 15 హంట్స్ మ్యాన్: నాలుగేళ్ల క్రితం విడుదలైన ఫ్యాంటసీ- యాక్షన్ థ్రిల్లర్ ‘స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్’. దానికి సీక్వెల్‌గా ‘హంట్స్ మ్యాన్: ద వింటర్ వార్’ ఇప్పుడు ప్రేక్షకులను మళ్లీ గ్రాఫిక్స్‌తో కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రజలను ఇబ్బంది పెట్టే క్వీన్ రవెన్నాను, ఆమె సోదరి ఫ్రేయాలను నాయకా నాయికలు ఎలా ఎదుర్కొన్నారనేదే ఈ చిత్ర కథాంశం. సెడ్రిక్ నికోలాస్-ట్రాయోన్ ఈ చిత్రానికి దర్శకుడు. విడుదల: ఏప్రిల్ 22 తెరపై రామానుజన్ జీవితం: గణితశాస్త్రంలో కొత్త పుంతలు తొక్కి, ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు ఆద్యుడైన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా ఓ హాలీవుడ్ చిత్రం రూపొందింది. 1991లో రాబర్ట్ కనిగల్ రాసిన ‘ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ అనే నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు మాథ్యూ బ్రౌన్. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ దేవ్ పటేల్ ఈ చిత్రంలో రామానుజన్ పాత్ర పోషించారు. మొదట రామానుజన్ పాత్రకు సౌతిండియన్ హీరో మాధవన్‌ను అనుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు కావాలని దేవ్పటేల్ను ఎంపిక చేసుకుంది చిత్ర బృందం. ఇప్పటికే ఈ చిత్రం టొరంటో, దుబాయ్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదల: ఏప్రిల్ 29 ఈ సారి ఐరన్‌మ్యాన్, స్పైడర్మ్యాన్లతో: బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, స్పైడర్మ్యాన్ల తర్వాత ఈ జనరేషన్ సూపర్‌హీరోలలో ఐరన్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా సూపర్‌హీరో పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కెప్టెన్ అమెరికా సూపర్‌హీరో కథతో 2011లో ‘కెప్టెన్ అమెరికా: ద ఫస్ట్ ఎవెంజర్’ వచ్చింది. దానికి సీక్వెల్ ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడీ కెప్టెన్ అమెరికాకు మూడో భాగంగా రానున్న ‘సివిల్ వార్’లో ఐరన్‌మ్యాన్ కూడా జతకలిశాడు. వీరిద్దరి సాహసాలతో పాటు స్పైడర్‌మ్యాన్ కూడా ఈ భాగంలోనే సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎవెంజర్స్గా ప్రపంచాన్ని కాపాడే పదిమంది అతీంద్రియ శక్తులున్న సూపర్‌హీరోలు అనుకోని కారణాలతో విడిపోతారు. చివరకు, కెప్టెన్ అమెరికా, ఐరన్మ్యాన్లు ఒక్కటై ప్రపంచాన్ని ఎలా కాపాడారనేది కథ. ఆంటోని రుస్సో, జోయ్ రుస్సోల ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదల: మే 6 ఎక్స్‌మెన్ మళ్లీ వస్తున్నారు: 16 ఏళ్లు...ఎనిమిది భాగాలతో ప్రేక్షకులను అలరించిన ఎక్స్‌మెన్ మళ్లీ ‘ఎపోకిలిప్స్’ టైటిల్‌తో సినీ అభిమానులను పలకరించనుంది. ఇటీవలే ఎనిమిదో భాగంగా వచ్చిన ‘డెడ్‌పూల్’ ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంతో ‘ఎపోకిలిప్స్’ను విడుదల చేయనున్నారు. ప్రపంచాన్ని కాపాడడానికి ఎక్స్‌మెన్ టీమ్ ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్రియాన్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. విడుదల: మే 27 -
హాలీవుడ్ యవనికపై వెలుగుతారా?
బాలీవుడ్ అవకాశం వస్తేనే ఎగిరి గంతేస్తుంటారు మన కథానాయికలు. కానీ... అనుష్క, నయనతారలకు ఏకంగా హాలీవుడ్ ఛాన్సే దక్కేట్టు కనిపిస్తోంది. త్వరలో ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఓ భారీ హాలీవుడ్ సినిమాలో నటించే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయనేది చెన్నయ్ టాక్. వివరాల్లోకెళ్తే... సిల్వెర్స్టర్ స్టాలోన్, స్క్రిప్టు సమకూర్చిన హాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో ‘ది ఎక్స్‌పెండబుల్స్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో తెలిసిందే. ఇప్పుడు నెక్ట్స్ సిరీస్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన సిరీస్‌ని తలదన్నేలా ఈ చిత్రాన్ని నిర్మించి, వ్యాపార పరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే మన దేశానికి సంబంధించిన కథానాయికల వైపు దృష్టి సారించారు. కథానుగుణంగా ఇందులో ఏడుగురు కథానాయికలు ఉంటారు. ఏడూ విభిన్న పాత్రలే. ఈ పాత్రలు పోరాటాలు, సాహసాలు చేయాలి. ఈ ఏడు పాత్రల్లో.. మూడు పాత్రలకు దక్షిణాది కథానాయికలను తీసుకోవాలని హాలీవుడ్ నిర్మాణ సారథులు భావిస్తున్నారట. త్వరలో ముంబై, చెన్నైల్లో కథానాయికల ఆడిషన్ టెస్ట్ నిర్వహించనున్నారు. దక్షిణాది నుంచి నయనతార, అనుష్క, లక్ష్మీరాయ్, నీతూచంద్ర పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే.. వీరిలో నయన, అనుష్కలకే ఎక్కువ అవకాశాలున్నాయనేది చెన్నయ్ సమాచారం. అదే కనుక నిజమైతే... హాలీవుడ్ యవనికపై వెలిగిన దక్షిణాది తారలుగా నయనతార, అనుష్క నిలిచిపోతారు.