మనిషితో శునకం అనుబంధానికి 40 వేల ఏళ్లు
లండన్: శునకం... విశ్వాసానికి మారుపేరు. అందుకే మనిషి దీంతో తరతరాలుగా అనుబంధం కొనసాగిస్తున్నాడు. మనిషి-కుక్కల మధ్య బంధానికి ఇప్పటిదాకా అనుకుంటున్నదానికంటే ఎక్కువ చరిత్రే ఉందని తాజాగా స్పష్టమైంది. దాదాపు 27 వేల నుంచి 40 వేల ఏళ్ల క్రితమే మనిషి శునకాలను మచ్చిక చేసుకొని, తన వెంట తిప్పుకున్నాడని వెల్లడైంది. ప్రాచీన తోడేలు శిలాజం ఇటీవల సైబీరియాలోని తైమిర్ దీవిలో బయటపడింది. స్వీడన్ పరిశోధకులు దీని డీఎన్ఏను విశ్లేషించారు. రేడియో కార్బన్ పరీక్ష ద్వారా ఇది 35 వేల ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు.
దీన్నిబట్టి చూస్తే మనిషి-శునకం మధ్య అనుబంధానికి 27 వేల నుంచి 40 వేల ఏళ్లని తెలుస్తోంది. మనం నమ్ముతున్న దానికంటే చాలా ముందుగానే మనిషి ఇంటిలో కుక్క కూడా కుటుంబ సభ్యురాలిగా చేరిందని ‘స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’ లవ్ డాలెన్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలు ‘కరెంట్ బయాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి.