మృత్యువునే ఏడిపించిన ప్రేమకథ!
►‘నీతో గడిపిన పది నిమిషాలు...
►నీతో గడపని పది యుగాలతో సమానం!’
► వారి ప్రేమ ఎలా మొదలైంది?
► గెలిచిందా? ఓడిందా?
► మృత్యువునే ఎందుకేడ్పించింది?
వర్షాకాల సాయంత్రాన రెస్టారెంట్లో కూర్చొని వేడివేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది రోడెన్కి. తాగాక ‘అనవసరంగా తాగాను’ అనిపిస్తుంది. ‘ఏమైంది నాకు? ఏ పనీ చేయాలనిపించదు. ఏ పని చేసినా నచ్చదు’ అనుకున్నాడు. తన ఆలోచనను స్నేహితుడితో పంచుకున్నాడు. ‘‘ఇది నీ సమస్య కాదు... యవ్వన సమస్య. ప్రతి యవ్వనుడి సమస్య’’ అని గట్టిగా నవ్వి ‘‘వీలైనంత త్వరగా ఒక అమ్మాయిని ప్రేమించు’’ అని సలహా ఇచ్చాడు అతని కంటే అయిదేళ్లు పెద్దవాడైన స్నేహితుడు. అలాంటి సందర్భంలోనే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది లైజీ.
రోడెన్కు ఆడవాళ్లతో మాట్లాడాలంటే కాస్త బెరుకు. కానీ లైజీతో మాట్లాడితే ఆ బెరుకు మాయమైపోతుంది. ఆమె ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. ఏదైనా ఒకరోజు లైజీ తనతో మాట్లాడకుంటే బొత్తిగా తోచదు. ఒక వర్షాకాలపు సాయంత్రం... లైజీతో కలిసి కాఫీ తాగాలనిపిస్తుంది. తాగితే ఎంత రుచిగా ఉంటుంది! ఒక సెలవు రోజు లైజీతో కలిసి సినిమా చూడాలనిపిస్తుంది. చూస్తే ఎంత చెత్త సినిమా అయినా ఎంతో బాగుంటుంది! ఈ విషయాలన్నీ చెబుతూ ఓ రోజు ‘ఐ లవ్ యూ’ అనేశాడు రోడెన్. ‘‘ఇంత ఆలస్యంగానా చెప్పేది!’’ అంటూ ఆమె అందంగా నవ్వింది. వాళ్ల పెళ్లి ఖాయమైంది. ఇద్దరికీ రోజూ తేనె కలలు! అంతలో ఒకరోజు గుండె పగిలే వార్త తెలిసింది లైజీకి. రోడెన్కు లివర్ క్యాన్సర్! అప్పటికే రోడెన్ పూర్తిగా డీలా పడి పోయాడు. కంటి నుంచి నీరు తప్ప నోటి నుంచి మాటలు రావడం లేదు.
చాలా రోజుల తరువాత మాత్రం ‘‘దేవుడు ఇలా ఎందుకు చేశాడు!’’ అన్నాడు చిన్నగా. ‘‘క్యాన్సర్ వచ్చి దాని నుంచి బయట పడినవాళ్లు ఎంతోమంది ఉన్నారు... నువ్వేమీ అధైర్యపడకు. నువ్వు ఖచ్చితంగా క్యాన్సర్ని జయిస్తావు’’ అంటూ రోజూ ధైర్యవచనాలు చెప్పేది లైజీ. క్యాన్సర్ నుంచి బయటపడ్డ విజేతల ఆత్మకథల పుస్తకాలు చేతికందించేది. మెల్లగా రోడెన్లో ధైర్యం పెరిగింది. కానీ తాను కచ్చితంగా బతుకుతానన్న నమ్మకం మాత్రం కలగలేదు. దాంతో ఒకరోజు లైజీని పిలిచి ‘‘నువ్వు వేరే ఎవరినైనా పెళ్లిచేసుకో. ఆ పెళ్లి చూసి నేను తృప్తిగా చనిపోతాను’’ అన్నాడు రోడెన్. ‘‘అలా ఎప్పటికీ జరగదు... పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను’’ అంది లైజీ దృఢంగా.
మరుసటి రోజే మనీలా (ఫిలిప్పీన్స్) హాస్పిటల్లో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. చుట్టాలు, పక్కాలు, మిత్రులు హాస్పిటల్కు వచ్చారు. లైజీ పెళ్లి కూతురు గౌన్లో వచ్చింది. బెడ్ మీద ఉన్న రోడెన్ను నవ్వుతూ పలకరించింది. తెల్లటి పెళ్లి గౌన్లో లైజీని చూసి... రోడెన్ కళ్లలో మెరుపు! ఆ మెరుపు అన్ని విషాదాలనూ తుడిచి పారేసేంత శక్తిమంతంగా ఉంది. ఆ క్షణంలో అతనికి తొలిసారి తాను బతకుతానన్న నమ్మకం ఏర్పడింది. తమ్ముడు హసెట్ను దగ్గరగా పిలుచుకొని చెవిలో ఇదే విషయం చెప్పాడు. శాస్త్రీయ సంగీతం వినిపిస్తుండగా వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.
కానీ దురదృష్టం... పెళ్లయిన పది గంటల తరువాత రోడెన్ ఈ లోకాన్ని, లైజీని విడిచి వెళ్లిపోయాడు! రోడెన్ మృత దేహంపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది లైజీ. నువ్వు లేని ఈ జీవితానికి అర్థం ఏముంది అంటూ కన్నీరు మున్నీరైంది. నీ తలపుల తోనే బతుకంతా గడుపుతాను అంటూ అతడి చేతిలో చేయి వేయి ఒట్టు వేసింది. బహుశా ఆ దృశ్యం చూసి మృత్యువు సైతం కంటతడి పెట్టి ఉంటుంది!