నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్ డ్రామా..!
ఫరిద్ కోట్ (పంజాబ్) : తనను కిడ్నాప్ చేశారంటూ ఓ నర్సింగ్ విద్యార్థి సీన్ క్రియేట్ చేసింది, పంజాబ్ లోని ఫరిద్ కోట్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫరిద్ కోట్ డీఎస్పీ విశాల్‌జిత్ సింగ్ కథనం ప్రకారం... గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజీకి చెందిన 20 ఏళ్ల ఓ వైద్య విద్యార్థిని తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ స్నేహితులతో కలిసి నాటకం ఆడింది. కిడ్నాప్ విషయాన్ని ఆమె స్నేహితులు శుక్రవారం పోలీస్ స్టేపన్లో ఫిర్యాదు చేయగా, ఇది నిజమని నమ్మిన వారు దర్యాప్తు చేశారు.
ఇదిలా ఉండగా కిడ్నాప్ నాటకం ఆడిన విద్యార్థిని తన స్నేహితులకు మళ్లీ ఫోన్ చేసి జలందర్ బస్టాప్‌లో వదిలివెళ్లారని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు జలంధర్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి ఆమెను ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. శనివారం కిడ్నాపర్ల గురించి ఆరాతీయగా.. అసలు విషయం బయటపడింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, పోలీసులు తనను కనిపెట్టగలరో లేదో తెలుసుకోవాలని, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలుసుకుందామని అలా చేశానని అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. నర్సింగ్ విద్యార్థినిపై ఎటువంటి చర్య తీసుకోలేదని డీఎస్పీ పేర్కొన్నారు. అమ్మాయి ఎటువంటి దురుద్దేశం లేకుండా ఈ నాటకాన్ని ప్లే చేసిన కారణంతో చర్యలు తీసుకోలేదని కారణాన్ని వివరించారు.