breaking news
GRP Railway police
-
ఆయుధమున్నా .. ఫలితం సున్నా!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో రైళ్లను టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్న ముఠాలు పెరుగుతున్నాయి. మొన్న బెంగళూరు ఎక్స్‌ప్రెస్... నిన్న హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్... తాజాగా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్... ఇలా వరుసపెట్టి దుండగులు పంజా విసురుతున్నారు. వీటిని నిరోధించడంతో పాటు ప్రయాణికులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో రైళ్లల్లో విధుల్లో ఉంటున్న గవర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆర్పీ) సిబ్బంది సఫలీకృతులు కాలేకపోతున్నారు. ఇదిలా ఉండగా... రైళ్లలో దోపిడీకి యత్నించే దొంగలను కాల్చివేయాలని రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. ప్రతి రైలులోనూ అవసరమైన సంఖ్యలో పోలీసు సిబ్బంది ఉండట్లేదు. నాలుగైదు బోగీలకు కలిపి కేవలం ఒకరో ఇద్దరో కానిస్టేబుళ్లను నిమమిస్తున్నారు. దీంతో ఏదైనా చోరీ జరిగినప్పుడు ఆ సమాచారమే వీరికి తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా... వారు అప్రమత్తమయ్యే లోగా దొంగలు తమ ‘పని’ పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నారు. దీంతో పాటు రైలు బోగీల్లో భద్రతా విధుల్లో ఉండే సిబ్బందికి ఇస్తున్న ఆయుధం కూడా కొత్త సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ సిబ్బందికి కార్బైన్ తుపాకులు ఇస్తున్నారు. వీటిని భుజానికి తగిలించుకుని పని చేయడం వరకు ఇబ్బంది లేదు. అయితే ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురై ఆ ఆయుధాన్ని జన సమర్థ ప్రాంతంగా ఉండే రైలు బోగీలో వినియోగించాలంటే మాత్రం పోలీసులే భయపడాల్సి వస్తోంది. పోలీసు విభాగం వాడే ఆయుధాల్లో అఫెన్సివ్, డిఫెన్సివ్ వెపన్స్ వేర్వేరుగా ఉంటాయి. జన సమర్థ ప్రాంతాల్లో రక్షణావసరాల కోసం అఫెన్సివ్ వెపన్స్ వినియోగించకూడదు. కార్బైన్ మెషిన్ గన్ అఫెన్సివ్ వెపన్ కోవలోకే వస్తుంది. ప్రముఖుల వెంట ఉండే గన్‌మెన్స్ భుజాలకు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. 30 తూటాలు నింపే సామర్థ్యం ఉన్న మ్యాగ్జైన్తో కూడిన ఈ గన్ రేంజ్ 50 మీటర్ల వరకు ఉంటుంది. రైలు బోగీలు వంటి మూసి ఉన్న, జనం ఎక్కువగా ఉన్న చోట్ల దీనిని వినియోగించి ఓ దొంగని టార్గెట్ చేస్తూ కాల్పులు జరపడం ప్రమాదహేతువు. ఏమాత్రం కంగారుపడి కాల్పులు ప్రారంభించినా దొంగ మాట అటుంచి బోగీలోని ప్రయాణికులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే జీఆర్పీ పోలీసులు తమ వద్ద ఉన్న కార్బైన్‌ను కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే మార్చుకుంటున్నారనే విమర్శ ఉంది. ఇలాంటి చోట విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి కచ్చితంగా షార్ట్ వెపన్స్‌గా పిలిచే రివాల్వర్, పిస్టల్ మాత్రమే అందించాల్సి ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే ఆ తరహా ఆయుధాల కొరత నేపథ్యంలో ప్రతి రైలులో ఉండే జీఆర్పీ బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారికి మాత్రమే షార్ట్ వెపన్స్ ఇస్తూ మిగిలిన వారిలో కొందరికి కార్బైన్స్ ఇవ్వక తప్పలేదన్నారు. భద్రతా విధుల్లో ఉండే సిబ్బంది మాత్రం తమకు కచ్చితంగా షార్ట్ వెపన్స్ కేటాయించడంతో పాటు సిబ్బంది సంఖ్యను పెంచితేనే రైళ్లను టార్గెట్ చేస్తున్న ముఠాల ఆట కట్టించడం, అధికారులు ఆదేశించినట్లు కాల్చి పారేయడం సాధ్యమవుతుందని సిబ్బందే పేర్కొంటున్నారు. -
జీఆర్పీ ఎస్సై అరెస్టు
బరంపురం : విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్ సాగర్‌పై బరంపురం రైల్వే స్టేషన్లో దాడి చేసి గాయపరిచిన కేసులో బరంపురం జీఆర్పీ పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజేంద్ర కుమార్ ముండా అరెస్టయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 17వ తేదీ రాత్రి విల్లుపురం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఖుర్దా నుంచి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న బరంపురం జీఆర్పీ స్టేషన్ ఎస్సై రాజేంద్ర కుమార్ ముండాను బి–1 కోచ్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్ సాగర్ టికెట్ అడగడంతో వాగ్వాదం జరిగింది. బరంపురం రైల్వేస్టేషన్ రాగానే బి.కిరణ్ సాగర్‌ను జీఆర్పీ ఎస్సై, ఇతర జీఆర్పీ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితుడు బి.కిరణ్ సాగర్ విశాఖపట్నం జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఏడీజీ జీఆర్పీ బరంపురం పోలీస్‌స్టేషన్ ఐఐసీ రాజేంద్ర కుమార్ ముండాపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం ఈ కేసును బరంపురం జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో గురువారం బరంపురం జీఆర్పీ పోలీసులు ఎస్సై రాజేంద్ర కుమార్ ముండాను ఆరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఎస్సై రాజేంద్ర కుమార్ ముండా పెట్టుకున్న బెయిల్‌ను ఎస్డీజేఎం కోర్టు తిరస్కరించింది. -
రైలులో రేషన్ బియ్యం పట్టివేత
ఒంగోలు క్రైం : ప్యాసింజర్ రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఒంగోలు రైల్వే జీఆర్పీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. విజయవాడ-ఒంగోలు (ట్రైన్ నంబర్-67263) ప్యాసింజర్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం ఒంగోలు రైల్వే జీఆర్పీ సీఐ కె.వెంకటేశ్వరరావుకు అందింది. దీంతో ఆయన తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం ఒంగోలు రైల్వేస్టేషన్‌కు ప్యాసింజర్ రైలు రాగానే ఎస్సై పి.భావనారాయణ రైలు బోగీలన్నీ కానిస్టేబుళ్లతో తనిఖీ చేయిం చారు. రైలు పెట్టెకు ఒక బస్తా చొప్పున 11 రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి. ఒక్కో బియ్యం బస్తా బరువు సుమారు 40 నుంచి 50 కేజీల వరకు ఉంది. అంటే దాదాపు అరటన్ను బియ్యమన్నమాట. వెంటనే ఆ బియ్యాన్ని ఒంగోలు రైల్వేస్టేషన్లో దించి వాటిని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బియ్యం పట్టుకున్న వారిలో ఎస్సైతో పాటు హెడ్‌కానిస్టేబుల్ వీఆర్కే రెడ్డి, స్టేషన్ రైటర్ చలపతిరావుతో పాటు సిబ్బంది ఉన్నారు. సమాచారాన్ని ఒంగోలు సివిల్ సప్లయిస్ అధికారులకు అందజేశారు. బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని గోడౌన్‌కు తరలిస్తారు. అయితే ఈ బియ్యం తమవని ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.