breaking news
g.ramesh
-
ఉత్తీర్ణత తగ్గితే బాధ్యత మీదే
కల్హేర్,న్యూస్‌లైన్: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలు తప్పనిసరిగా సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి జి.రమేష్ సూచించారు. శనివారం మండలంలోని సిర్గాపూర్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక, ఉర్దూ మీడియం, కస్తుర్బా పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో విద్యార్థుల ఉతీర్ణతా శాతం తగ్గితే ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు గణితం, వివిధ సబ్జెక్టులపై ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. గణితంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నట్లు డీఈఓ పరిశీలనలో తేలింది. దీంతో ఎంఈఓ మన్మథ కిశోర్, సంబంధిత గణిత టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గణితం టీచర్లు పవన్‌కుమార్, మహేశ్వర్‌రావు, రహీం ఇంక్రిమెంట్ కట్ చేస్తామని డీఈఓ తెలిపారు. పదో తరగతి పరీక్షలపై దృష్టిపెట్టడం లేదనే కారణంతో ఎంఈఓ మన్మథ కిశోర్‌కు మెమో జారీ చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. పాఠశాలలోనే ‘మధ్యాహ్న’భోజనం చేశారు. అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను సందర్శించారు. ఉర్దూ మీడియం పాఠశాల నిర్వహణ సరిగాలేదని మండిపడ్డారు. ఉర్దూ పాఠశాల హెచ్ఎం అజీమొద్దీన్‌కు మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించారు. ఇక్కడ ప్రత్యేకాధికారిగా పనిచేసిన గుండయ్య కొత్తగా వచ్చిన ప్రత్యేకాధికారి లలితకు బాధ్యతలు అప్పగించకపోవడంతో వెంటనే బాధ్యతలు అప్పగించాలని అదేశించారు. గుండయ్యపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. -
పిల్లలను బడికి పంపకపోతే ‘సంక్షేమం’ కట్
సంగారెడ్డి మున్సిపాలిటీ/మెదక్, న్యూస్‌లైన్: తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోతే ఆ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పదో తరగతి అర్ధవార్షిక పరీక్ష ఫలితాల పై బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో ప్రధానోపాధ్యాయులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. త్రైమాసిక పరీక్ష ఫలితాలతో పోల్చితే అర్ధవార్షిక పరీక్షల ఫలితాల్లో గణనీయమైన వృద్ధి కన్పించిందన్నారు. అయితే విద్యార్థుల హాజరు శాతం పడిపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశా రు. జిల్లాలోని 556 పాఠశాలల్లో 31,100 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా అందులో 27,930మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. మిగతా 3,170 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరుశాతం చాలా తక్కువగా ఉన్నచోట అవసరమైతే తాను సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. హాజరుశాతాన్ని పెంచేం దుకు సంబంధిత సర్పంచ్ల సహకారం తీసుకోవాలని అవసరమైతే వారితో మాట్లాడతానని చెప్పారు. గత త్రైమాసిక పరీక్షల్లో జిల్లాలో కేవలం 38.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ప్రత్యేక కార్యాచరణ, క్విజ్ పోటీలు, ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత, సన్నిహిత అధికారుల నియామకం తదితర చర్యల వల్ల అర్ధవార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత 56.92 శాతానికి పెరిగిందన్నారు. జోగిపేట డివిజన్లో 57 శాతం, మెదక్ డివిజన్లో 54, సంగారెడ్డిలో 56, సిద్దిపేట డివిజన్లో 59 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. తగ్గిన రెడ్ జోన్ పాఠశాలలు.. త్రైమాసిక పరీక్షల్లో 226 పాఠశాలలు రెడ్‌జోన్‌లో ఉండగా, ఈసారి కేవలం 18 పాఠశాలలు మాత్రమే ఆ జోన్లో ఉం డటం సంతోషకరమని కలెక్టర్ తెలిపా రు. ఇప్పుడున్న 18 పాఠశాలలపై ప్ర త్యేక దృష్టి సారించాలని డీఈఓను ఆదేశించారు. ఈసారి ఫలితాలు అన్ని గ్రేడ్ల లో మెరుగ్గా ఉన్నాయన్నారు. త్రైమాసిక పరీక్షల్లో బ్లూ జోన్లో ఉన్న నల్లవాగు పాఠశాల ఈసారి అట్టడుగుస్థాయికి పడిపోవడం దారుణమన్నారు. వచ్చే మార్చి 14న జరగబోయే ప్రీఫైనల్ పరీక్షల్లో కనీ సం 80 శాతం, పబ్లిక్ పరీక్షల్లో వందశా తం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని హెచ్ఎంలకు సూచిం చారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా 40 రోజుల ప్రత్యేక కార్యాచరణను కలెక్టర్ ప్రారంభించారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత తీర్చాం: డీఈఓ జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరతను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఈఓ జి.రమేశ్ తెలిపారు. కలెక్టర్ కృషితో ఈసారి జిల్లాకు వంద అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ల పోస్టులు మంజూరైనట్టు చెప్పారు. వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఉపాధ్యాయులను వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశామన్నారు. 40 రోజుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను తయారుచేశామని తెలిపారు. దానికి అనుగుణంగా పదో తరగతి విద్యార్థులకు బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.