సేవకు పట్టం!
పురస్కారం
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా సామాజిక సేవారంగంలో ప్రభుత్వ అవార్డు అందుకుంటున్నారు యాకూబ్‌బీ. ఆమెది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం. ప్రస్తుతం కాజీపేట, ప్రశాంత్‌నగర్‌లో వయోవృద్ధుల కోసం ఆశ్రమాన్ని స్థాపించి సేవలందిస్తున్నారు. పదేళ్ల కింద ఇద్దరితో మొదలైన ఆశ్రమం ఇప్పుడు 70మందికి ఆశ్రయానిస్తోంది.
ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం తప్పనిసరి. నేటి ఆధునిక యుగంలో ప్రపంచంలో మలి వయసులో కన్నవారి బాగోగులు చూసే వారి సంఖ్య క్రమేపి తగ్గుతోంది. భార్య,భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేగాని గడవని రోజులివి. ముసలివాళ్లయిన తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇది మంచి పరిణామం కాదు. అయినా ఇది కొనసాగుతూనే ఉంది. ఆ పిల్లలు నిర్వర్తించాల్సిన బాధ్యతను నేను తీసుకుంటానంటూ ముందుకొచ్చారు యాకూబ్‌బీ.
ఆశ్రమ స్థాపనకు ప్రేరణ!
హుజూరాబాద్ మండలంలో బాగా బతికిన ఓ మహిళ... చూసే వాళ్లు లేక, బిక్షాటన ఇష్టంలేక బస్టాండు మీద నుంచి దూకి మరణించిన ఘటన యాకూబ్‌బీ çహృదయాన్ని కలిచి వేసింది. నా అనేవాళ్లు లేని అనాథ వృద్ధులకు సహాయం చేయాలేమా అనే ఆలోచనకు కార్యరూపమే సహృదయ ఆశ్రమం.
అన్నీ తామే అయ్యి ...
తొళినాళ్లలో ఆశ్రమంలో ఇద్దరు, ముగ్గురికి మించి ఉండేవారుకాదు. ప్రస్తుతం ఆ సంఖ్య 70కి చేరింది. యాకూబ్‌బీ భర్త చోటూ, పిల్లలు, అత్త ఆశ్రమంలోని వారి కోసం శ్రమిస్తున్నారు. ఎవరి ఆదరణలేని వారిని, చివరి దశలో ఉన్నవారిని ఆశ్రమంలో చేర్చుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యం చేయించి బాగోగులు చూస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఆరుగురు వృద్ధులు అపస్మారక స్థితిలో ఉన్నారు. కొందరు పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆశ్రమంలో ఉన్న వారికి వంట యాకూబ్‌బీ కుటుంబ సభ్యులే చేస్తారు. ఎనిమిది మంది పనివాళ్లు స్నానం వంటి ఇతర పనులు చేస్తున్నారు.
అంత్యక్రియలూ ఇక్కడే...
దాతలు పండుగలు, పుట్టిన రోజు సందర్భాల్లో ఆశ్రమానికి వచ్చి తోచిన సహాయం చేస్తుంటారు. ఆశ్రమ నిర్వహణ ఖర్చుల కోసం... మూడు డెడ్‌బాడీ ఫ్రీజర్బాక్స్లను, అంబులెన్స్‌లు, టాటా ఏసీ వ్యానులను కొని అద్దెకిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేని వారికి వాహనాలు, ఫ్రీజర్బాక్స్లను ఉచితంగా ఇస్తారు. ఆశ్రమంలో ఉన్న వారు మరణిస్తే వారి బంధువులకు సమాచారం తెలియచేస్తారు. ఎవరూ రాకపోతే అంత్యక్రియలు కూడా యాకూబ్‌బీ, చోటూలే పూర్తి చేస్తారు. ముస్లిం, హిందూ, క్రిస్టియన్లు... ఎవరి మతానుసారం వారి కర్మకాండలు చేస్తారు.
కౌన్సెలింగ్ సెంటర్...
పిల్లలతో గొడవపడి కోపంతో ఆశ్రమానికి వచ్చే వృద్ధులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి వెనక్కి పంపించడానికి జిల్లాకు చెందిన న్యాయవాది వీరమల్ల వెంకటేశ్వర్రావుతో ఆశ్రమంలో కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వృద్ధుల పిల్లలను పిలిపించి కౌన్సెలింగ్ చేసి సమాధానపడిన వారిని తిరిగి ఇళ్లకు పంపిస్తుంటారు. విధిలేని పరిస్థితుల్లో ఉన్న వారిని, ఇంటికి వెళ్లడానికి ఇష్టపడని వారిని ఆశ్రమంలోనే కొనసాగిస్తారు.
వైద్యసేవలు ముమ్మరం...
వీరి సేవల పట్ల విశ్వాసం కలిగిన తర్వాత పట్టణంలోని ప్రముఖులు వారి సేవలందించడానికి ముందుకొస్తున్నారు. దత్తాశ్రమం నుండి వైద్యులు ఆశ్రమానికి వచ్చి వృద్ధులకు అవసరమైన పరీక్షలు, మందులను ఉచితంగా అందిస్తుంటారు. సైకియాట్రిస్టు రామారావు, డాక్టర్లు రాంరెడ్డి, బిక్షపతిలు వైద్యసహాయంలో చేయూతనందిస్తున్నారు. చనిపోయిందని వదిలేసిన మాచపత్రి రాజమ్మ అనే వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్పించి బతికించడం ఆనందంగా ఉందంటారు యాకూబ్‌బీ.
కాలాక్షేపానికి గ్రంధాలయం...
ఆశ్రమంలో గడిపే వృద్ధులకు కాలక్షేపంగా ఉండటానికి దాతల సహాయంతో విలువైన పుస్తకాలను సమకూర్చుకున్నారు యాకూబ్‌బీ దంపతులు. ఆశ్రమంలోని వారికి పూర్తిగా ఫ్యూరిఫై అయిన వాటర్‌నే ఇస్తున్నారు. ఇంటి నుంచి వచ్చేసిన వారికే కాక, జైలు నుంచి విడుదలయ్యి, ఇంటికి వెళ్లలేక, తన వాళ్లెక్కడున్నారో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఆశ్రమంలో చోటిస్తోంది యాకూబ్‌బీ.
ఇటీవలి కాలంలో ధనవంతులు ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు, పండుగలు, వివాహా వేడుకలు జరుపుకోవడం ఎక్కువైంది. ఇది ఆశ్రమంలో ఉంటున్న వారికి మానసిక ధైర్యాన్నిస్తోంది.
– బత్తిని రాజేందర్, ఖాజీపేట్, వరంగల్ జిల్లా
వృద్ధాప్యం కారాదు శాపం...
వృద్ధాప్యం శాపం కారాదనే ఉద్దేశంతో ఆశ్రమాన్ని నెలకొల్పాలనుకున్నాను. అందుకు నా భర్త కూడా సహకరించారు. మా పిల్లలు కూడా ఆశ్రమంలోనే ఉంటారు. ఉన్నంతలో తోటివారికి సాయం చేస్తే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందనే భావనతోనే ఇంటిల్లిపాదిమీ సేవ చేస్తున్నాం. నేను చేస్తున్న సేవలు మామూలువే అనుకున్నాను. కానీ అవార్డులు వస్తుంటే ఇంత పెద్ద పని చేస్తున్నానా అనిపిస్తోంది. ఇవన్నీ నా బాధ్యత పెద్దదని గుర్తు చేస్తున్నాయి. సేవలను విస్తృతం చేయాలనే ఉత్సాహం వస్తోంది. పదిహేను రోజుల కిందట సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నాను. ఇప్పుడు ప్రభుత్వ అవార్డు ఇస్తున్నారు. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. భగవంతుడు నాకు ఇంతటి అదృష్టాన్నిచ్చాడు.
నిలువ నీడ దొరికింది!
మాది కరీంనగర్ జిల్లా మలాపూర్ గ్రామం. కనిపెంచిన ఒక్కగానొక్క కొడుకు బతుకుదెరువు నిమిత్తం వలస వెళ్లాడు. నేను వెంట ఉంటే భారంగా భావించి వదిలేసి వెళ్లాడు. మా సర్పంచ్ నా బాధను చూడలేక ఈ ఆశ్రమంలో చేర్పించాడు. అనారోగ్యంతో బాధపడే నేను ఆశ్రమంలో ఉచితంగా వైద్యం పొందుతున్నాను. వేళకు మంచి తిండి తిని, కంటినిండా నిద్రపోతున్నాను.
– కాంతమ్మ (వృద్ధురాలు)