breaking news
governemt
-
కదిలిరావమ్మా!
సాక్షి, కరీంనగర్: ‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి.. కానీ, గిన్నెలన్నింటిపైన మా నాన్నపేరే..’ అంటూ పురుషాధిక్య సమాజాన్ని ప్రశ్నించారు ఓ రచయిత్రి. ఆవిడ మాటలు మరోసారి అక్షర సత్యమయ్యాయి. ఆకాశంలో సగం, అవనిలో సగమైన ఆడవాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభైశాతం స్థానాలు కేటాయించి మహిళా సాధికారతకు ప్రభుత్వం పట్టం కట్టగా ఆచరణలో పతుల పెత్తనమే కొనసాగుతోంది. మహిళలకు కేటాయించిన స్థానాల్లో గెలిచినవారు స్వతంత్రంగా వ్యవహరించకపోవడం, కుటుంబసభ్యుల పెత్తనం కొనసాగుతుండడం వల్ల మహిళా సాధికారత నీరుగారుతోంది. జిల్లాలో 1207 పంచాయతీలుండగా, 604 సర్పంచ్ స్థానాలు మహిళలకే దక్కాయి. 11,924 వార్డు స్థానాల్లో 5,966 వార్డులకు మహిళలు ఎన్నికయ్యారు. జిల్లాలో పదవులు పొందిన 604 మంది మహిళా సర్పంచుల్లో అత్యధికులు స్వశక్తి సంఘాల సభ్యులే. దేశంలో సాధికారతకు నిదర్శనంగా భావించే స్వయం సహాయ బృందాల్లో సభ్యులుగా ఉన్నవారు పాలన పగ్గాలు అందుకున్నారు. విద్యాధికులైన యువతులు కూడా పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. వీరిలో ఎంతమంది సొంతంగా పంచాయతీ పాలన సాగిస్తారన్నది సందేహాలను కలిగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి పరిశీలిస్తే.. మహిళా సాధికారత సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల దగ్గర నుంచి ఎన్నికల వరకు అడుగడుగునా కుటుంబసభ్యుల పెత్తనమే కనిపించింది. ప్రచారమంతా భర్తలు, ఇతర కుటుంబసభ్యులే నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా అధికారిక సమావేశాలకు కూడా చాలా చోట్ల భర్తలే హాజరయ్యారు. ప్రచార బాధ్యతల్లో ఉన్నందున అభ్యర్థులకు వీలుకాలేదని అప్పుడు సర్ధిచెప్పుకున్నా.. బాధ్యతల స్వీకారంలోనూ వారిదే హవా కొనసాగడం ఆశ్చర్యపరిచింది. విద్యాధికులని గెలిపించిన వారు కూడా కొన్ని చోట్ల నిరాశ పరిచారు. ఆయా పార్టీల్లో నాయకులుగా ఉన్నవారు రిజర్వేషన్ల కారణంగా తమ భార్యలను బరిలోకి దింపారు. వారికున్న బలంతోనే గెలిచారు. ఇక్కడ గెలిచిన మహిళా ప్రతినిధులు భర్తల కనుసన్నల్లోనే పనిచేయక తప్పడం లేదు. రాజకీయాల్లో అప్పటికే పలుకుబడి కలిగిన వారు కావడంతో అధికారిక వ్యవహారాలను సైతం భర్తలే చక్కబెడుతున్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా సర్పంచులకు పోలీస్స్టేషన్లలో అవగాహన సదస్సులు నిర్వహించారు. చాలా చోట్లా మహిళా సర్పంచుల భర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకావడం అధికారులను విస్మయానికి గురిచేసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టినందువల్ల కుటుంబసభ్యుల సలహాలు, సూచనలు స్వీకరిస్తే తప్పులేదు.. కానీ ఇదే వ్యవహారం కొనసాగితే పాలన అపహాస్యమవుతుందనడం అతిశయోక్తికాదు. -
‘పర్యాటకం’..పరిహాసం!
రాజులు, సంస్థానాదీశులు, నిజాం నవాబుల కాలం నాటి ఆలయాలు, బురుజులు..వాటిలో అద్భుతంగా చెక్కిన శిల్పాలు పాలమూరు పర్యాటక కేంద్రాల సొంతం. జిల్లాలో ఉన్న అతి పురాతన ఆలయాలతో పాటు, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం అందించే బృహత్తర కార్యక్రమం ముందుకు సాగడం లేదు. పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించినా..ఎవరు ముందుకురాకపోవడంతో పర్యాటకం కళ తప్పింది. విడుదల చేసిన నిధులు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. కలెక్టరేట్/గద్వాల, న్యూస్‌లైన్: జిల్లాలో ఉన్న పురాతన ఆలయాలతో పాటు, పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదం అందించే ప్రక్రియ ఏడాదిగా ముందుకుసాగడం లేదు. 11 పర్యాటక కేంద్రాల్లో పనులు చేపట్టేందుకు ఇంతకుముందే టెండర్లు ఆహ్వానించారు. ఎవరూ ముందుకురాకపోవడంతో తాజాగా మరోసారి మంగళవారం టెండర్లదాఖలుకు తుది గడువు విధించగా ముగ్గురు మాత్రమే ముందుకొచ్చారు. ఎనిమిది కేంద్రాలకు టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకురాలేదు. జిల్లావ్యాప్తంగా ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నా..ముందుగా 11 కేంద్రాలను మాత్రమే అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిలో 9పురాతన ఆలయాలు కాగా, రెండు పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. కానీ టెండర్లు పూర్తిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.7.99కోట్లు మంజూరుచేసింది. ఏడాదిలోపే వీటిని వినియోగించాలని నిబంధనలు విధించినా, అధికారులు వాటిని వినియోగించుకోలేకపోయారు. ఇప్పటికీ వాటిని ఖాతాకే పరిమితం చేశారు.