breaking news
gorati
-
విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 330 ఎకరాల భూమిని చూపినా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరారు. శనివారం శాసనమండలిలో ‘గిరిజన సంక్షేమం–పోడు భూములకు పట్టాల పంపిణీ’పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. పోడు భూముల వివాదాల్లో తలెత్తిన కేసులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎత్తివేసేందుకు అటవీశాఖ, డీజీపీలతో కూడిన కమిటీ కసరత్తు ప్రారంభించిందని చెప్పారు. 2023–24 లో 15 వేల మంది గిరిజన రైతుల ప్రయోజనాల కోసం ‘గిరివికాసం’కింద రూ.150 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని, 500 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ల హయాంలోనే పోడుభూములకు పట్టాలు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. -
గోరటి వెంకన్నకు ‘కాళోజీ’పురస్కారం
మట్టి మనిషి కిరీటంలో మరోతురాయి పాలమూరు మట్టిబిడ్డకు మరో గౌరవం తెలకపల్లి/మహబూబ్‌నగర్ కల్చరల్: ‘పల్లే్లకన్నీరు పెడుతుందో’ అని విలపించినా, ‘వాగులెండిపాయేరా’ అని బాధపడినా, ‘సంత మావురు సంతా’ అని సంబరపడినా, ‘ఏమిమారే ఏమీమారేరా’ అని చింతచేసినా గోరటి వెంకన్న పాట వినిపిస్తుంది. ప్రముఖ కవి, సినీగేయ రచయిత, ప్రకృతి కవి, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రకటించింది. ఈనెల 9న కాళోజీ జయంతి రోజున ప్రభుత్వం భాషా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ఆయనకు ఈ అందజేయనున్నారు. గోరటి వెంకన్న తెలకపల్లి మండలం గౌరారం స్వగ్రామం. ఆయన చిన్నతనం నుంచే తండ్రి గోరటి నర్సింహ్మ, తల్లి ఈరమ్మ యక్షగానం, భజన కీర్తనలు, మంగళ హారతుల పాటలతో వెంకన్న మనసును పాటల వైపు మళ్లింది. పచ్చటి పల్లెపొలాలు, దుందుభీ వాగు తీరాన్ని చూస్తూ పెరిగిన ఆయన ప్రకృతే తన పాటకు వస్తువుగా మార్చుకున్నారు. వెంకన్న విద్యాభ్యాసం జిల్లాలోనే కొనసాగింది. ప్రస్తుతం ఆయన నాగర్‌కర్నూల్ డివిజన్ కోఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊతమిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటడమే కాక స్వరాష్ట్ర ఆవశ్యకతను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వెంకన్న పాటలు ఆకట్టుకుంటాయి. అచ్చతెలుగు మాండలికానికి చిరునామా గోరటి వెంకన్న. మన బాస, యాసను మరిచిపోతున్న తరుణంలో ఆయన రాసిన ప్రతి గేయంలో, పాటలో మాండలిక గుభాళిలిస్తాయి. పల్లె పాటలకు ప్రాణం 1984లో ‘నీ పాట ఏమాయెరో కూలన్నా, నీ ఆట ఎటుపాయెరో మాయన్నా’ అంటూ మొదటిసారి రాసిన పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ‘రాజహింస పెరుగుతున్నాదో.. పేదోళ్ల నెత్తురు ఏరులై పారుతున్నదో’ అనే పాట ప్రముఖ సినీదర్శకుడు శంకర్‌ను ఆకర్షించింది. ఆయన పాటలు రాయాలని పట్టుబట్టడంతో ‘ఎన్కౌంటర్’ సినిమాకు ‘జైబోలో.. జైబోలో అమరవీరులకు జైబోలో’ అంటూ అమరవీరులను స్మరిస్తూ పాటరాశారు. అప్పట్లో ఏ నోట విన్నా ఇదే పాట మార్మోగింది. ‘కుబుసం’లో పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..’ అంటూ పల్లెగోషను వినిపించారు. ఆ పాటే వెంకన్నకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. దీంతోపాటు ఆర్.నారాయణపూర్తి సినిమాల్లో లెక్కకుమించి పాటలెన్నో రాశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వెంకన్న పాటలేని ధూం..ధాం కార్యక్రమమే లేదు. ‘మందెంట పోతుంటే ఎలమంద’, ‘సేతానమేడుందిరా సేలన్నీ బీడాయెరా’, ‘గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది, జిల్లేడన్నా జిట్టా’, గుమ్మాలకు బొమ్మలోలె..’ ‘ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా’, ‘ఇండియా పాకిస్తాన్ వలె ఇనుప కంచె పడుతుందా’ అనే పాటలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. పురస్కారాలు.. తాత్వికుడిగా, వాగ్గేయకారుడిగా పాటలతో విశిష్టతను సాధించుకున్న గోరటి అనేక పురస్కారాలు అందుకున్నారు. 2006లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారం అందించి ఘనంగా సత్కరించింది. 2014లో కర్ణాటకకు చెందిన లంకేష్ సాహితీ సమితి జాతీయ పురస్కారం అందుకున్నారు. డాక్టర్ సినారే సాహితీ సంస్థ పురస్కారం దక్కించుకున్నారు. అధికార భాషా సంఘం 2007లో తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గేయకావ్యం, తెలుగు సాహిత్య అవార్డును అందించింది. అపర కష్ణశాస్త్రి, విశాలాంధ్ర, తెరా ఇటీవల ఖమ్మంలో జీవితసాఫల్య పురస్కారం అందించింది.