breaking news
goods market
-
సరుకుల రవాణాకు ‘ఈ–పర్మిట్’
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి దిగుబడి ఏటా 35 లక్షల క్వింటాళ్లకు పైగా వస్తుంది. రైతులు పూర్తిగా విక్రయించినా మార్కెట్ దస్త్రాల్లో సగం కూడా నమోదు కావడం లేదు. మరి మిగతా సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయి.. కొనుగోలుదారులు కట్టాల్సిన పన్నులను ఎవరు తన్నుకుపోతున్నారు.. సర్కారు ఖజానాకు ఏ మేరకు గండిపడుతోంది..? కొన్నేళ్లుగా అందరిలో వెల్లువెత్తుతున్న సందేహాలు ఇవి. ఆలస్యంగానైనా మేల్కొన్న రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అవినీతికి తెరదింపేందుకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, సరుకుల రవాణా, పన్నుల వసూళ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై లెక్కలు పక్కాగా చూపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీగా ప్రధాన పంటల దిగుబడులు.. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్, రబీ కలుపుకొని ఏటా 6.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో రెండు లక్షల హెక్టార్లు పత్తి, మూడు లక్షల హెక్టార్లు వరి, లక్ష హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తారు. 35 లక్షల నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి, 1.80 కోట్ల క్వింటాళ్ల వరి, 50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఇరు సీజన్లలో క్రయవిక్రయాలు సాగుతాయి. వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా సేకరిస్తుండగా, పత్తిని పూర్తిగా మిల్లర్లు, ట్రేడర్లు కొంటున్నారు. నిబంధనల ప్రకారం.. వ్యాపారులు సరుకుల కొనుగోళ్ల వివరాలను రోజూ మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, ఇతర అపరాల ఎగుమతికి కార్యదర్శి నుంచి రవాణా పర్మిట్ తీసుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొనుగోలు చేసిన సరుకుల విలువలో ఒకశాతం పన్నుగా చెల్లించాలి. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి.. కొందరు వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొన్న సరుకులు, మార్కెట్‌కు చూపుతున్న లెక్కలకు పొంతన ఉండడం లేదు. ప్రధానంగా మిల్లుల్లో కొంటున్న సరుకులను పూర్తిస్థాయిలో చూపడంలేదు. అధికారులకు రోజూ ఇవ్వాల్సిన వివరాలను నెలకు ఒక్కసారి కూడా సమర్పించడం లేదు. అడిగే దిక్కులేక చాలామంది వ్యాపారులు తప్పుడు లెక్కలతో మార్కెట్ ఆదాయానికి గండికొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోపాయికారీ ఒప్పందాలతో మాన్యువల్ పర్మిట్లు తీసుకుంటూ సరుకులను రవాణా చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా పత్తి, ధాన్యం, మక్కలు ఖరీదు చేస్తున్న దళారులు ఆయా చెక్‌పోస్టుల్లో చేతివాటం ప్రదర్శిస్తూ సరుకులను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా ఏటా లక్షలాది క్వింటాళ్లు వక్రమార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాలిల్లుతోంది. ఇది బహిరంగమే అయినా అధికారుల్లో చలనం కరువైంది. నామమాత్రపు తనిఖీలతో అక్రమ వ్యాపారానికి అడ్డులేకుండా పోయింది. ఎట్టకేలకు మేల్కొన్న మార్కెటింగ్‌శాఖ.. ఏళ్లుగా సాగుతున్న అవినీతిని ఎట్టకేలకు మార్కెటింగ్‌శాఖ గుర్తించింది. కొనుగోళ్లలో పారదర్శకత, పూర్థిసాయిలో పన్నుల వసూళ్లకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సదరుశాఖ రూపొందించిన వెబ్సైట్లో తొలుత మిల్లర్లు, ట్రేడర్లు వారి సంస్థలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్ అధికారులు పరిశీలించాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. భద్రత కోసం పాస్వర్డ్ మార్చుకునే వీలుంది. వ్యాపారులు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక సరుకుల కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. యార్డులో అయితే కమీషన్ ఏజెంట్ ద్వారా ఎన్ని క్వింటాళ్లు కొన్నారనేది చూపితే సరిపోతుంది. ఎందుకంటే రైతుల వివరాలను మార్కెట్ సిబ్బంది రికార్డుల్లో చేరుస్తారు. గ్రామాల్లో, మిల్లుల్లో నేరుగా కొంటే.. సరుకులు అమ్మిన రైతుల వివరాల(చిరునామా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్)ను వ్యాపారులు పూర్తిగా నమోదు చేయాలి. నెలవారీ కొనుగోళ్ల ప్రకారం ప్రతినెలా పదో తేదీ లోపు పూర్తిగా పన్ను(సరుకుల విలువలో ఒకశాతం) చెల్లించాలి. ఇవి పాటిస్తేనే బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, అపరాలు తదితర ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో ఈ–పర్మిట్ జారీచేస్తారు. ఈ విధానం గతనెల 26న ఉమ్మడి జిల్లాలో అమల్లోకి రాగా.. మిల్లర్లు, ట్రేడర్లు క్రమంగా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు. రంగంలోకి విజిలెన్స్ బృందాలు.. ఇకపై వ్యాపారులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు తీసుకునే వీల్లేదు. సరుకుల కొనుగోళ్ల మేరకే పర్మిట్లు ఇచ్చేలా వెబ్సైట్ రూపొందించారు. లెక్కల్లో చూపని వాటికి రవాణా అనుమతులు రాకుండా రూపకల్పన చేశారు. ఒకవేళ అక్రమ రవాణా చేస్తే చెక్‌పోస్టులో నిలిపివేస్తారు. చేతివాటంతో అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా దాన్నీ అడ్డుకునేందుకు మార్కెటింగ్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రహదారులపై తనిఖీకి విజిలెన్స్ బృందాలను నియమించింది. ఈ–పర్మిట్ లేకుండా రవాణా చేస్తూ పట్టుబడితే వ్యాపారులు చెల్లించాల్సిన పన్ను కంటే 5 నుంచి 8 రెట్లు అధికంగా జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. దొంగ దందాతో సర్కారు ఖజానాకు తూట్లు పొడుస్తున్న దళారులపై కూడా విజిలెన్స్ ఉక్కుపాదం మోపనుంది. ఇకనుంచి అధికారులు గ్రామాల్లో నేరుగా జరిగే కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే దళారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
అంగన్వాడీ అక్రమాలు .. అంగట్లో సరుకులు
వంగర, న్యూస్‌లైన్: స్థానికంగా ఉండని.. సక్రమంగా పని చేయని అంగన్వాడీ కార్యకర్తలు.. వారికి వత్తాసు పలికే ఐసీడీఎస్ సూపర్వైజర్లు.. అందుకు ప్రతిఫలంగా కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు, పౌష్టికాహారంలో కోత విధించి.. మిగుల్చుకోవడం.. ఫలితంగా గర్భిణులు, బాలింత లు, చిన్నారులకు తగిన మోతాదులో అందని పౌష్టికాహారం.. వీరఘట్టం ఐసీడీఎస్ పరిధిలో ఉన్న వంగర మండలంలో అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు, స్వాహాపర్వానికి అంతూపొం తూ లేకుండాపోతోంది. పెద్ద మొత్తంలోనే సరుకులు దారి మళ్లుతున్నా అడిగే దిక్కు లేదు. భారీ కోత.. దారి మళ్లింపు మండలంలో 66 మెయిన్ అంగన్వాడీ కేం ద్రాలు, మూడు మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 56 మంది కార్యకర్తలు పని చేస్తుండగా.. 4395 మంది 07-5 సంవత్సరాల చిన్నారులు, 576 మంది గర్భిణులు, 572 మంది బాలింతలు ఉన్నారు. వీరి ఓసం గత నెలలో సుమారు 13 టన్నుల బియ్యం, 17 క్వింటాళ్ల కందిపప్పుతోపాటు జాతీయ పోషకాహార సంస్థ తరఫున మాడిఫైడ్ థెరాఫిటిక్ ఫుడ్(పౌష్టికాహారం) 412 బస్తాలు, ఒక్కో కేంద్రానికి రెండు చొప్పున స్నాక్స్ ప్యాకెట్లు విడుదల చేశారు. అయితే కేంద్రాలకు అందజేసిన సరుకులో మాత్రం భారీ కోత కనిపించింది. స్థానికంగా ఉంటున్న అంగన్వాడీ కార్యకర్తలు నడిపే కేంద్రాలకు బియ్యం, కందిపప్పులో 40 శాతం తగ్గించి సరఫరా చేశారు. ఇతర ప్రాంతాల్లో నివాసముంటూ అప్పుడప్పుడు వచ్చి పోయే కార్యకర్తల కేంద్రాలకైతే సగానికి సగం కోత విధించారు. ఒక్కో కేంద్రానికి రెండు క్వింటాళ్ల బియ్యం, 50 కేజీల కందిపప్పు అందాల్సి ఉండగా.. కేంద్రాన్ని బట్టి 1.30 నుంచి 1.50 క్వింటాళ్ల బియ్యం మాత్రమే అందాయి. కందిపప్పులో సైతం అదే స్థాయిలో కోత పడింది. ఈ విధంగా ఒక్క గత నెలలోనే మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు సుమారు 4 టన్నుల బియ్యం, ఒక టన్ను కందిపప్పు దారి మళ్లినట్లు తెలుస్తోంది. తక్కువ అందజేస్తున్నా.. పూర్తి సరుకు అందినట్లుగానే అక్విటెన్స్లపై అంగన్వాడీ కార్యకర్తలతో సంతకాలు చేయించుకుంటున్నారు. ప్రతి రోజు కేంద్రాల్లో సరుకుల వినియోగం వివరాలను రిజిస్టర్లలో పెన్సిళ్లతో నమోదు చేస్తున్నారు. వీరఘట్టం ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ప్రతి నెలా సరుకులు పంపిస్తుం టారు. రవాణాను పర్యవేక్షిం చేందుకు రూట్ ఆఫీసర్ ఉండాలి. ఇక్కడ మాత్రం సూపర్వైజర్ల సమక్షంలోనే పంపిణీ జరుగుతోంది. మద్దివలస కేంద్రమే ఉదాహరణ మండలంలోని మద్దివలస గ్రామంలో ఒక మెయిన్, ఒక మినీ అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. ఒకే కార్యకర్త నిర్వహిస్తున్న ఈ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు కలిపి మొత్తం 185 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా మూడున్నర క్వింటాళ్ల బియ్యం, 80 కేజీల కందిపప్పు అవసరం కాగా గత నెలలో ఈ క్వింటాళ్ల బియ్యం, 30 కేజీల కందిపప్పు మాత్రమే అందాయి. కేంద్రాల పరిస్థితి దయనీయం మండలంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు దారుణంగా ఉంది. చాలా కేంద్రాలను వారంలో ఒక రోజు తెరిచినా గొప్పే. సూపర్వైజర్లు సరుకుల్లో కోత విధించి స్వాహా చేస్తుంటే.. చుట్టపుచూపుగా వచ్చీపోయే కార్యకర్తలు తమ లోపాలను, అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు వారు చెప్పినట్లే సంతకాలు చేసేస్తున్నారు. కాగా బాగా పనిచేస్తున్న కార్యకర్తలపై సూపర్వైజర్లు వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు కేంద్రాలను తెరుస్తున్నా సరుకుల్లో కోత విధిస్తున్నారని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తమను మరింతగా వేధిస్తారని ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ కేంద్రాలతోపాటు ప్రీస్కూల్స్ కూడా సక్రమంగా పని చేయడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధాహ్న భోజన పథకం కనుమరుగైంది. ఆటపాటలతో కూడిన విద్య దూరమైంది. నెలకోసారే గుడ్లు సరఫరా చేస్తున్నారు. అసలు కేంద్రాలే తరవని చోట బోగస్ లబ్ధిదారుల పేర్లు నమోదు చేసి సరుకులు స్వాహా చేస్తున్నారు. ఫలితంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందకుండాపోతోంది. పట్టించుకోని అధికారులు మారుమూలనున్న వంగర మండలంలో కేంద్రాలను అధికారులు పట్టించుకోవడం లేదు. నెలల తరబడి కేంద్రాలు పనిచేయకపోయినా అడిగే నాథుడే లేడు. మూడు నెలలకోసారైనా కేంద్రాలను పరిశీలించిన దాఖలాలు లేవు. దాంతో స్థానికంగా ఉండే సూపర్వైజర్లదే ఇష్టారాజ్యం. దాదాపు ప్రతి నెలా లక్షలాది రూపాయల విలువైన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. ఐసీడీఎస్ పీడీ వివరణ సరుకులు, పౌష్టికాహారం గోల్‌మాల్‌పై వీరఘట్టం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ వి.రమాదేవి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరైక్టర్ జి.చక్రధరరావును సంప్రదించగా అటువంటివేవీ తమ దృష్టికి రాలేదన్నారు. ఇటువంటి ఫిర్యాదులపై స్థానిక ప్రాజెక్టు ఆఫీసర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంటూ దీనిపై విచారణ జరపాలని అక్కడి పీవోను ఆదేశిస్తానని చెప్పారు.