breaking news
good services
-
ఖాతాదారులకు మెరుగైన సేవలు
టీజీబీ చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ గుండ్లపల్లిలో టీజీబీ శాఖ ప్రారంభం బెజ్జంకి : ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు విస్తృతపరుస్తున్నట్లు ఆ బ్యాంకుల రాష్ట్ర చైర్మన్ బీఆర్జీ ఉపాధ్యాయ అన్నారు. మండలంలోని గుండ్లపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు నూతన శాఖను గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.10,682 కోట్లు, జిల్లావ్యాప్తంగా రూ.1919.13 కోట్ల టర్నోవర్‌తో బ్యాంకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు పంటరుణాలు, వ్యాపారులకు, మహిళ సంఘాలకు, విద్యార్థులకు విద్య రుణాలతో పాటు వాహనాల రుణాలు కూడ ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే మిషన్‌కాకతీయలో చెరువుల మట్టిని తరలించేందుకు ఎకరాకు రూ.5 వేలు రైతులకు రుణసౌకర్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. జీఎం ఎస్.పాదం, ఆర్ఎం రవీందర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీపాద్, మేనేజర్ అనిల్‌రెడ్డి, క్యాషియర్ వేణుగోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచులు కృష్ణమోహన్‌రెడ్డి, గువ్వ వీరయ్య, ఎంపీటీసీ కొర్వి సంధ్యారాణి, ఉపసర్పంచ్ కాల్వ పెద్ద కొమురయ్య, ముల్కనూర్, రీజీనల్ ఆఫీసర్ ఐలయ్య, అల్గునూర్ బ్రాంచ్‌ల మేనేజర్లు సతీశ్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
డాక్టర్ ‘చైతన్య’సుధ
గర్భిణులకు మెరుగైన సేవలు రాయికల్ ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు ఆదర్శం దూర ప్రాంతాల నుంచి ‘సర్కార్’ వైద్యం కోసం వస్తున్న మహిళలు రాయికల్ : వైద్యోనారాణో హరి. దేవుళ్లతో సమానంగా వైద్యులను కొలుస్తారు. అవును ఆమె కనిపించే దేవతే!.. రాయికల్ ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు చైతన్యసుధ. పేరుకుతగట్టు సేవలందిస్తున్నారు.. వైద్య వృత్తికే వన్నె తెస్తున్నారు.. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నాన ంటూ భరోసా కల్పిస్తున్నారు. రోగుల మన్ననలు అందుకుంటున్నారు.. అవార్డులు.. రివార్డులు సొంతం చేసుకుంటున్నారు. రాయికల్ 30 పడకల ప్రభుత్వాసుపత్రి.. రోగులు ఇక్కడికి రావాడానికి భయపడేవారు. సర్కారు దవాఖానా కదా... సేవలు సరిగ్గా అందుతాయో లేదోనని ప్రైవేట్ ఆస్పత్రుల బాట పట్టేవారు. మూడేళ్ల క్రితం పరిస్థితులు మారాయి. 2013లో చైతన్యసుధ స్త్రీవైద్య నిపుణులు ఆస్పత్రి వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరినవెంటనే మండల ప్రజలతో సమావేశం ఏర్పాటుచేసి రోగులందరూ స్థానికంగా చికిత్స పొందేలా అవగాహన కల్పించారు. గర్భిణులు స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించారు. అలా ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ప్రభుత్వ వైద్యంపై నవ్ముకాన్ని పెంచారు. పెరిగిన ప్రసవాలు.. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలగడంతో రాయికల్ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య క్రమంగా పెరిగింది. 2013లో 150 ప్రసవాలు, 2014లో 282, 2015లో 300 ప్రసవాలు జరిగాయి. ఇందులో ఎక్కువగా సాధారణ ప్రసవాలే జరగడం విశేషం. డాక్టరమ్మ సేవలను గుర్తించిన చాలామంది రాయికల్‌లో చికిత్సల కోసం క్యూకడుతున్నారు. జగిత్యాల డివిజన్లోని రాయికల్, మల్లాపూర్, సారంగపూర్, కోరుట్ల, మెట్పల్లి, మేడిపెల్లి మండలాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు వైద్య సేవలకోసం వస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన ఉన్నతాధికారులూ మూడుసార్లు ఉత్తమ వైద్యురాలిగా ఎంపికచేశారు. పలుమార్లు ప్రశంసించారు. కు.ని.లో రికార్డు.. ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో సైతం చైతన్యసుధ రికార్డు నెలకొల్పారు. జగిత్యాల డివిజన్లో కోరుట్ల, మల్యాల, కొడిమ్యాల, ధర్మపురి, సారంగాపూర్, మెట్‌పెల్లి, రాయికల్ ప్రభుత్వాసుపత్రిలో వారంకు ఒకరోజు చొప్పున కేటాయిస్తు ఆపరేషన్లు చేస్తున్నారు. 2013లో 400, 2014లో 600, 2015లో 600లకు పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా ఉత్తమ వైద్యురాలిగా చైతన్యసుధ ప్రశంసపత్రాన్ని అందుకున్నారు. మల్లాపూర్ నుంచి వచ్చిన.. – నాగమణి, రాఘవపేట్, మల్లాపూర్ మండలం మాది మల్లాపూర్ మండలం రాఘవపేట. రాయికల్ హాస్పిటల్ చైతన్యసుధ డాక్టరమ్మ మంచిగా వైద్యం చేస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. జాయిన్ చేసుకుని వైద్యసేవలు అందించారు. వారం రోజుల క్రితం బాబు పుట్టాడు. బాబు, నేను క్షేమంగా ఉన్నాం. నమ్మకంతో వస్తున్నాం.. – భూమిక, రేచ్పెల్లి సారంగపూర్ మండలం మాకు జగిత్యాల దగ్గరగా ఉన్నప్పటికీ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయికల్ ప్రభుత్వాసుపత్రికి వస్తున్నాం. ఇక్కడి వైద్యురాలి పర్యవేక్షణలో కాన్పు చేయించుకున్నాను. నాకు పాప పుట్టింది. ఇద్దరం క్షేమంగా ఉన్నాం. సేవలు బాగున్నాయ్.. – కవిత, భూపతిపూర్ రాయికల్ ప్రభుత్వాస్పత్రిలో సేవలు బాగున్నాయ్. గర్భిణులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. పలుగ్రామాల గర్భిణిలు ఇక్కడ కాన్పు చేయించుకుంటున్నారు. వైద్యసేవలతో సంతృప్తి – చైతన్యసుధ, వైద్యురాలు గర్భిణిలు నన్ను నమ్మకుని ఆస్పత్రికి వస్తారు. కాన్పు చేసే సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నప్పుడే నాకు నిజమైన సంతృప్తినిస్తుంది. మొట్టమొదటిసారిగా పాప ఏడుపు...తల్లిలో చిరునవ్వు చూడగానే ఆనందంగా ఉంటుంది.