breaking news
golden threshold
-
చెరకుతీపి చింతపులుపు చిత్తూరు కథ
డైరీ.... జూలై 26 శనివారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ ఆబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్లో షంషాద్ బేగం కవితా సంపుటి ‘ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే’ ఆవిష్కరణ. స్కైజహా, దిలావర్ తదితరులు పాల్గొంటారు.ఆగస్టు 1 శుక్రవారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రసాదమూర్తి కవితా సంపుటి ‘పూలండోయ్ పూలు’ ఆవిష్కరణ. జస్టిస్ బి.చంద్రకుమార్, కె.శివారెడ్డి, ఓల్గా తదితరులు పాల్గొంటారు. జూలై 28 సోమవారం సాయంత్రం 6 గం.లకు హిమాయత్ నగర్ హోటల్ చట్నీస్‌లో సోమరాజు సుశీల ‘ముగ్గురు కొలంబస్‌లు’ ఆవిష్కరణ. వి.రామారావు, సి.సుబ్బారావు, వరకాల ప్రభాకర్, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారు.చిత్తూరు కథ అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు కె.సభా, మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, కేశవ రెడ్డి, నరేంద్ర, మహేంద్ర, నామిని.... వీరంతా ఈ ప్రాంతం నుంచి కథారచనలోకి వచ్చి చెరగని ముద్ర వేసిన రచయితలు. కె.సభా దారి తొలిచి బాట వేస్తే ఆ బాటలోని ఎగుడు దిగుళ్లను సరి చేసి నడిచి చూపినవారు మధురాంతకం రాజారాం. ఆయనను అడ్మైర్ చేసి కలం పట్టిన రచయిత కేశవరెడ్డి. ఇక నామిని- నిర్దిష్టంగా ఒక పల్లెను తీసుకొని అక్కడి జీవనాన్ని విశ్వ జీవనంతో కనెక్ట్ చేయగలిగారు. వేంపల్లి అబ్దుల్ ఖాదర్, పులికంటి కృష్ణారెడ్డి, వి.ఆర్. రాసాని, గోపిని కరుణాకర్, కెఎస్వీ, కె.ఎస్.రమణ, తుమ్మల రామకృష్ణ వీరందరూ చిత్తూరు కథను సంపద్వంతం చేసిన వారే. వర్తమానంలో పసుపులేటి గీత, గూళూరు బాలకృష్ణమూర్తి, మునిసురేశ్ పిళ్లై, పేట శ్రీనివాసులు రెడ్డి, పేరూరు బాలసుబ్రమణ్యం వంటి రచయితలు కథను సీరియస్‌గా సాధన చేస్తున్నారు. ఈ సంకలనంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య, జిల్ల్లెళ్ల బాలాజీ కథలున్నాయిగాని విమర్శలో ఒకరి కృషి, అనువాదంలో మరొకరి కృషి కథకులుగా వారి స్వీయ ప్రతిపత్తిని దాటి వెళ్లాయి. ప్రతి ప్రాంతానికి ఉన్నట్టే చిత్తూరుకు కూడా ఒక విశిష్టమైన సంస్కృతి, భాష, జీవనం ఉన్నాయి. అనంతపురంలా దీనికి తీవ్రమైన కరువు లేదు. కడప కర్నూలులా పాలెగాళ్ల పీడా లేదు. రైతు జీవనం, మధ్యతరగతి బతుకు, ఆధ్యాత్మిక ప్రాభవం, తమిళుల ఛాయ, కూడలి స్వభావం... ఇవన్నీ చిత్తూరు కథకులకు తగిన భూమికను ఏర్పరచి పెట్టాయి. అయితే ప్రతిచోటా జరిగినట్టే ఒక ప్రాంతం నుంచి వచ్చిన రచయితలందరూ ఆ ప్రాంత స్థానిక/నైసర్గిక స్వభావాన్ని తమ రచనల్లో చూపాలని లేదు. కేవలం ఇద్దరు ముగ్గురు రచయితలే ఆ ప్రాంతం మొత్తాన్ని ఒడిసి పట్టేయవచ్చు. మిగిలిన రచయితలు ఇతరత్రా వస్తువులను స్వీకరించవచ్చు. ‘చిత్తూరు కథ’ను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఇక్కడి రచయితలు విస్తారమైన వస్తువును స్వీకరించారనిపిస్తుంది. అలాంటి శైలీ శిల్పాలున్న మంచి కథలు ఇందులో ఉన్నాయి. కాని గోపిని కరుణాకర్- దేవరెద్దు, పులికంటి కృష్ణారెడ్డి- సృష్టికే అందం, గూళూరు బాలకృష్ణమూర్తి- పనసపండు, జిల్లెళ్ల బాలాజీ- సిక్కెంటిక, మహేంద్ర- జర్తె, మధురాంతకం రాజారాం - అంబ పలుకు జగదంబా పలుకూ, వి.ఆర్.రాసాని- తపస్సు, పేట శ్రీనివాసుల రెడ్డి- చిత్తానూరు పంచమి, కె.సభా- మిథున లగ్నం వంటి కథలు చిత్తూరు జీవనాన్ని నిర్దిష్టంగా చూపి ఇవి ఈ స్థలం వల్ల పుట్టిన కథలు అని నిరూపిస్తాయి. ఒక జిల్లా కథలు అన్నప్పుడు పాఠకుడు ఆశించేది ఇలాంటి కథలే. ముఖ్యంగా తిరుమల కథ ఒకటి, తిరుపతి కథ ఒకటి, శ్రీకాళహస్తి కథ ఒకటి అంటే అక్కడి జీవనాన్ని చెప్పే కథలు కూర్చాలనే జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నల్లమల అడవి/గిరిజన జీవితం, ఏనుగుల దాడి/అంతరాయం, హార్స్లీ హిల్స్ ఏకాంతం, అడుగడుగునా ఎదురుపడే పౌరహిత్య జీవనం... వీటిని చెప్పే కథలు ఉంటే ఎంచి ఉంటే చిత్తూరు కథకు పరిపుష్టత చేకూరి ఉండేది. మామిడిపండ్ల మండీ, చింతపండు మార్కెట్, పుత్తూరు వైద్యం, కాణిపాకం కోవెల... ఇవి కదా చిత్తూరు అంటే. ‘పాప నాశనం’ పేరుతో ఒక్క కథా రాయలేకపోయారా? ఈ సంపుటి నేపథ్యంలో చిత్తూరు రచయితలంతా సమావేశమైతే చూడకుండా వదిలేసిన జీవితంపై చర్చించి ముందుకు సాగే వీలు ఉంటుంది. పాప్యులర్ నవలా రచయితలుగా పేరుపడ్డ శైల కుమార్, మేర్లపాక మురళి కథలు ఇందులో ఉన్నాయి. శైల కుమార్ కథ ఓకే. మురళి కథ- కుచ్చిళ్లు నిమిరే దాకా పోతుంది. భక్తికే కాదు రక్తికి కూడా చిత్తూరు క్షేత్రం ఉంది అని చెప్పడానికే దీని ఎంపిక కాబోలు. కేశవరెడ్డి రచన నిడివి ఎక్కువనుకుంటే ఒక భాగమైనా వేయాల్సింది. నామిని కథ లేదు. సంపాదకుడు అడిగి ఉండకపోతే ఆయనను అవమానించినట్టు. అడిగినా ఇవ్వకపోయి ఉంటే ఇందులో ఉన్న రచయితలందరినీ ఆయన అవమానించినట్టు. చాలా కథలు రాసి అనేక బహుమతులు గెల్చుకుని విస్మరణకు లోనైన వీరపల్లి వీణావాణి కథ ఇందులో కనిపించడం ఆనందం కలిగించింది. ఏమైనా ఇది తొలి ప్రయత్నం. కనుక లోపాలు ఉన్నా సాదరంగా ఆహ్వానించాల్సిందే. కథాభిమానుల బుక్‌షెల్ఫ్‌లో ఉండదగ్గ పుస్తకం- చిత్తూరు కథ. -
కళల బంగారులోకం!
గోల్డెన్ త్రెషోల్డ్.. ఒకప్పుడు ‘కవికోకిల’కు బంగారు వాకిలి. ఇప్పుడు కవిసంగమమ్, కవిపుంగవుల కవితా లోగిలి. సాంస్కృతిక వికాసానికి కేంద్రం. థియేటర్ ఆర్ట్స్‌కు వేదిక. కళాభిమానులకు నెలవు. ఇంకా చెప్పాలంటే.. అదో కొత్త ‘బంగారులోకం’! గోల్డెన్ త్రెషోల్డ్ నేపథ్యమిది. స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీనాయుడు తన 13వ ఏటనే 1300 లైన్ల ఇంగ్లిష్ కవితాఖండికను రాశారు. దాని పేరే గోల్డెన్ త్రెషోల్డ్. 1896లో లండన్‌లో, 1905లో హైదరాబాద్ అబిడ్స్‌లోని తన నివాసంలో ఆ కవితాఖండిక ఆవిష్కృతమైంది. అప్పటి నుంచి ఆమె నివాసం ‘గోల్డెన్ త్రెషోల్డ్’గా మారింది. మరిప్పుడు..! గోల్డెన్ త్రెషోల్డ్‌లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పురుడుపోసుకుంది. యూనివర్సిటీ గచ్చిబౌలికి తరలిన అనంతరం ‘సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్’ విభాగాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నారు. లలిత కళలు, నృత్యం, రంగస్థల కళలు, మాస్ కమ్యూనికేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినీవిద్యార్థులతో ఈ ఆవరణ నిత్యం ‘కళ’కళలాడుతోంది! కదిలే థియేటర్! వేర్లు స్థిరంగా ఉంటాయి. శాఖలు విస్తరిస్తాయి. ఈ సూత్రంతో పనిచేస్తోంది ‘థియేటర్ ఔట్రీచ్’. నగర సాంస్కృతిక వేదికగా గోల్డెన్ త్రెషోల్డ్‌కు గుర్తింపు తేవడంలో థియేటర్ ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ అనంతకృష్ణన్ నేతృత్వంలోని టీం కృషి చేస్తోంది. ఇక్కడి రంగస్థల కళల శాఖలో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా, నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా రూపొందారు. నేషనల్ థియేటర్ ఆఫ్ డ్రామాకు చెందిన వివిధ రాష్ట్రాల బృందాలు గోల్డెన్ త్రెషోల్డ్లో వర్క్‌షాప్‌లను నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలు ఇస్తున్నాయి. ఇక్కడ రూపొందించిన అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి, మిస్ మీనా, పతంజలి నాటకోత్సవం, అప్సా రెయిన్బో తదితర నాటికలను రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు తీసుకెళ్లారు! ఆయా ప్రాంతాలలోని కళాకారులను, కళాభిమానులను గోల్డెన్ త్రెషోల్డ్‌కు ఆహ్వానిస్తున్నారు. ఆరుబయలు రంగస్థలం, సమావేశ మందిరం, డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు అనువైన హాల్ తదితర సౌకర్యాలను వివరిస్తున్నారు. ్టజ్ఛ్చ్టిట్ఛౌఠ్టట్ఛ్చఛిజి.ఛిౌఝ ద్వారా తమను సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు. కళల ‘సంగమమ్’ దాదాపు ప్రతిరోజూ సాయంత్రం ఈ ఆవరణ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమానికి వేదిక అవుతోంది. ఫేస్బుక్లో దాదాపు మూడువేల మంది సభ్యులు, అంతకు రెట్టింపు సంఖ్యలో పాఠకులు గల కవిసంగమమ్ సంస్థ సభ్యులు ముఖాముఖి కలుసుకునేందుకు తెలుసుకునేందుకు వేదిక ‘గోల్డెన్ త్రెషోల్డ్’! నెలనెలా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కవులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పిట్టలుగా తామొస్తే చెట్టులా ‘గోల్డెన్ త్రెషోల్డ్’ ఆదరిస్తోందని కవిసంగమమ్ బాధ్యుడు యాకూబ్ కితాబునిచ్చారు! నాటకరంగం కోసం అంకితమై పృథ్వీ థియేటర్ (ముంబై) రంగశంకర (బెంగళూరు) శ్రీరామ్సెంటర్ (న్యూఢిల్లీ) తరహాలో గోల్డెన్ త్రెషోల్డ్‌ను ‘పెర్ఫార్మింగ్ ఆర్ట్’ కేంద్రంగా మలచాలని థియేటర్ ఔట్ రీచ్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ పెద్ది రామారావు నేతృత్వంలోని రాజీవ్ వెలిచేటి, రాజీవ్ కృష్ణన్, విష్ణువర్ధన్, నస్రీన్, భాషా తదితరుల బృందం కృషి చేస్తోంది. పున్నా కృష్ణమూర్తి