సర్కారుపై ఆటోవాలాల సమరం
తణుకు అర్బన్ : ఆటో కార్మిక రంగాన్ని కుదేలుచేసే 894 జీవో రద్దుకోరుతూ తణుకులో ఆటో కార్మికులు కదం తొక్కారు. ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్వోబీ నుంచి ప్రారంభమైన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా రవాణా శాఖ కార్యాలయం వద్దకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్సపోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ముజుఫర్ అహ్మద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాయని విమర్శించారు. ఇటీవల ఆటో వాహనాలపై విపరీతంగా ఫీజులు పెంచడంతో పాటు ఫిట్నెస్ చేయించుకోని ఆటోలపై రోజుకు రూ.50 అపరాధ రుసుం విధించేలా జీవోను తీసుకురావడం దారుణమన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోగా వారిని అప్పులపాలుచేసేలా జీవోలు తేవడం సరికాదన్నారు. ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పంగం రాంబాబు మాట్లాడుతూ జీవోల పేరుతో అధికారులు కార్మికులను వేధిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ తణుకు ఏరియా నాయకులు బొద్దాని నాగరాజు, వైస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కౌరు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు పీవీ ప్రతాప్, కేతా గోపాలన్, సబ్బిత లాజర్, పైబోయిన సత్యనారాయణ తదితరులు మట్లాడారు. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నెక్కంటి శ్రీనివాస్‌కు నాయకులు, కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు. త ణుకు, తణుకు మండలం, ఉండ్రాజవరం, అత్తిలి, ఇరగవరం, పెరవలి, పెనుమంట్ర మండలాల నుంచి 30 యూనియన్లకు చెందిన ఆటో కార్మికులు భారీగా తరలివచ్చారు.
జీవో రద్దు కోరుతూ ధర్నా
ఏలూరు (సెంట్రల్): రవాణా రంగంలో పెంచిన చార్జీలను తగ్గించాలని కోరుతూ నరసాపురం, ఆచంట, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాలకు చెందిన ఆటో కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. జీవో 894ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మద్దతు తెలిపారు. అధిక సంఖ్యలో ఆటో కార్మికులు తరలివచ్చారు.
సీపీఎం మద్దతు
ఫీజులు పెంచి కార్మికులను దోపిడీ చేస్తున్న బీజేపీ తన విధానాన్ని మార్చుకుని రవాణా కార్మికులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం ఒక ప్రకటనలో తెలి పారు. ఆటో కార్మికుల ధర్నాకు మద్దతు తెలిపారు. 7న రాష్ట్రవ్యాప్త సమ్మె
రవాణా చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 894 జీవోను రద్దు చేయాలని కోరుతూ వచ్చేనెల 7న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె, ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు.