breaking news
Ghulam Nabi Azad on Kashmir
-
జమ్మూకశ్మీర్‌ను తుక్‌డాలు.. తుక్‌డాలు చేసింది
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్య ద్రోహపూరితమైనదని, ప్రభుత్వ చర్య దేశం తలను నరికేసేలా ఉందని ధ్వజమెత్తారు. కేవలం ఓట్ల కోసం చేపట్టిన ఈ చర్యతో జమ్మూకశ్మీర్ చరిత్ర, సంస్కృతి ధ్వంసమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ను, జమ్మూకశ్మీర్‌ను కలిపే వంతెన ఆర్టికల్ 370 అని, దీనిని రద్దు చేయడం ద్వారా బీజేపీ సర్కారు భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆజాద్ మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌ను విభజించడం ద్వారా దేశం తలను నరికేయడమే కాకుండా.. రాష్ట్రాన్ని బీజేపీ ‘తుక్‌డ తుక్డా’ లు (ముక్కలు ముక్కలు) చేసిందని మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. చైనాతో, పాకిస్థాన్‌తో, పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సరిహద్దులు కలిగిన రాష్ట్ర ప్రజలతో ఇలాంటి ఆటలు ఆడటం ప్రమాదకరమని, ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలు లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం దేశద్రోహం లాంటిదేనని ఆజాద్ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను రద్దు చేసి.. రాష్ట్రానికి బలగాలను పంపించి.. మాసీ సీఎంలైన మెహబుబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహనిర్బంధంలో ఉంచి కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని, జమ్మూకశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ సర్కారు వమ్ము చేసిందని తప్పుబట్టారు. -
ప్రజలూ మీ దృష్టిలో మిలిటెంట్లేనా?
న్యూఢిల్లీ: అశాంతితో అట్టుడుకుతున్న కశ్మీర్ అంశం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ కశ్మీరీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడంలో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘పౌరులనూ మిలిటెంట్ల మాదిరిగా చూస్తారా’ అంటూ ఆయన ప్రశ్నించారు. ‘పౌరులను మిలిటెంట్ల మాదిరిగా చూస్తూ.. వారికి మరో ప్రత్యామ్నాయం లేకుండా చేయకండి. వ్యాలీలోని ప్రజల పట్ల అనుచితమైన బలప్రయోగాన్ని చూపకండి’ అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల పట్ల కూడా జవాన్లు తూటాలు, పెల్లెట్లు ఉపయోగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆజాద్ తాను ఎంతో బాధాతప్తుడినై ఈ సభ ముందు ఉన్నానని చెప్పారు. ‘మిలిటెన్సీని అంతం చేయడంలో మేం ప్రభుత్వానికి అండగా ఉంటాం. కానీ పౌరుల పట్ల ఇలా ప్రవర్తించడాన్ని మాత్రం సమర్థించం’ అని ఆయన పేర్కొన్నారు. మిలిటెంట్ బుర్హన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్ లో కొనసాగుతున్న ఈ అశాంతిపై రాజ్యసభలో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో మొదట ఆజాద్ మాట్లాడారు.