breaking news
Four private medical colleges
-
ప్రైవేటుకు చెక్
► అనుమతి నిరాకరణ ► వైద్య సీట్ల భర్తీ లేనట్టే ► వందలాదిగా తగ్గనున్న సీట్ల సంఖ్య నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలలకు కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య విద్యా కౌన్సిల్ చెక్ పెట్టింది. మూడు కళాశాలలకు రెండేళ్లు, ఓ కళాశాలకు ఓ సంవత్సరం వైద్య సీట్ల భర్తీకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వందలాదిగా వైద్య సీట్ల సంఖ్య తగ్గనుంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 22 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ఈనెల తొమ్మిదో తేదీన పుదుకోట్టైలో ప్రారంభం కానుంది. మొత్తంగా మూడు వేలసీట్లు ఉండగా, పదిహేను శాతం కేంద్ర కోటాకు ఇది వరకు అప్పగించే వాళ్లు. మిగిలిన సీట్లను ప్లస్‌టూ మార్కుల ఆధారంగా వైద్య విద్యా విభాగం కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరిగేది. అలాగే, ఆరు స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలు, మరికొన్ని ప్రైవేటు కళాశాలల్లోని ప్రభుత్వ కోటా సీట్లు వైద్యవిద్యా విభాగం భర్తీ చేయడం జరిగేది. అయితే, ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చిన దృష్ట్యా, ఈ సీట్ల భర్తీ పర్వం మీద గందరగోళం బయలు దేరింది. నీట్ వ్యవహారం కోర్టుకు చేరడంతో వైద్య విద్యా సీట్ల భర్తీ మరింత జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నాలుగు ప్రైవేటు కళాశాలలకు చెక్ పెడుతూ, కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య విద్యా కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఆయా కళాశాలల్లో మౌలిక వసతుల కరువు, విద్యా బోధనలో నాణ్యత తగ్గుముఖం, పరిశోధనా కేంద్రాలు అంతంత మాత్రమే...ఇలా పలు కారణాలను చూపుతూ ఆ కళాశాలలకు ఈ ఏడాది సీట్ల భర్తీకి అనుమతి నిరాకరిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ అయ్యారు. నాలుగుకు అనుమతి నిరాకరణ : ఇటీవల భారత వైద్య విద్యా కౌన్సిల్ నిర్వహించిన పరిశీలన, తనిఖీల్లో ఆయా కళాశాలల్లో కరువైన వసతులను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోని నాలుగు ప్రైవేటు కళాశాలలకు చెక్ పెట్టారు. ఇందులో మూడు కళాశాలలు రెండేళ్ల పాటు సీట్ల భర్తీ చేసుకునేందుకు వీలు లేకుండా కొరడా ఝుళిపించారు. ఇక, ఓ కళాశాలకు మాత్రం ఈ ఏడాది బ్రేక్ వేశారు. ఇందులో కాంచీపురంలోని అన్నై వైద్య కళాశాల, మేల్ మరువత్తురు ఆది పరాశక్తి వైద్యకళాశాల, మాత వైద్య కళాశాలలు 2017–18, 2018–19 సంవత్సరాలకు వైద్య సీట్ల భర్తీకి అనుమతి నిరాకరించారు. కోయంబత్తూరులోని కర్పుగం కళాశాలకు ఓ ఏడాది పాటు బ్రేక్ వేశారు. ఒక్కో కళాశాలలో సరాసరిగా రెండు వందల సీట్ల వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రసుత్తం పడ్డ బ్రేక్‌తో రాష్ట్రంలో ఈ ఏడాది 800 వంద వరకు సీట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అసలే నీట్ పుణ్యమా తమ సీట్లు, ఇతరరాష్ట్రాల విద్యార్థులు ఎక్కడ తన్నుకు వెళ్తారోనన్న ఆందోళన విద్యార్థుల్ని వెంటాడుతున్న నేపథ్యంలో, తాజా ఉత్తర్వులతో వందలాదిగా సీట్లు తగ్గడంతో ఆందోళన రెట్టింపు అవుతోంది. -
కొత్తగా 4 వైద్య కళాశాలలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలలు రానున్నాయి. ఆయా కాలేజీలకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే ప్రభుత్వాల పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. కొత్తగా వచ్చేవాటిలో ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఒక కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రెండు కళాశాలలకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, మరో రెండు కళాశాలలకు సంబంధించి ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నట్లు వైద్యవిద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కాగా అన్ని కళాశాలల యాజమాన్యాలు 150 ఎంబీబీఎస్ సీట్లకు తక్కువ కాకుండా దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1,900 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కొత్తగా మరో కళాశాలలు ఏర్పాటైతే ఎంసీఐ అనుమతులను బట్టి 350 నుంచి 450 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. తెంగాణలో కూడా మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ‘108’ అంబులెన్స్‌లను నిర్వహిస్తున్న జీవీకే సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద ఒకటి, నెల్లూరు జిల్లాలో మరో కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ‘అపోలో’ యాజమాన్యం చిత్తూరు జిల్లాలో ప్రైవేటు వైద్య కళాశాల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. కళాశాలకు క్లినికల్ అటాచ్మెంట్ పేరుతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని మూడేళ్లు లీజుకిచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం విదితమే. విజయనగరం జిల్లాలో మన్సాస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యాజమాన్యం కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ విజయనగరం ప్రభుత్వాసుపత్రిని క్లినికల్ అటాచ్మెంట్ కింద తీసుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. అది సాధ్యం కాకపోతే సొంతంగా ఆస్పత్రిని నిర్మించి, వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.