ఉత్తరాఖండ్ కంటే దారుణంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు
► ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటున్నాం
► ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అభివృద్ధి కోరుకోలేదు
► ఎన్నికైన ఎమ్మెల్యేలు చివరివరకు అదే పార్టీలో ఉండాలి
► లేకపోతే ప్రజాస్వామ్యానికి, వాస్తవానికి సంబంధం ఉండదు
► వైఎస్ఆర్సీపీ పోరాటానికి పార్లమెంటులో, లోపల పూర్తి మద్దతు
► సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ
ఉత్తరాఖండ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఏపీలో జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని తాము సీరియస్గా తీసుకుంటున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'సేవ్ డెమొక్రసీ' యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సీపీఎం ప్రధాన కార్యాలయంలో ఏచూరిని కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా సాగుతున్న ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అవినీతి కార్యకలాపాలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం వైఎస్ జగన్, ఇతర నేతలతో కలిసి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు.
ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అవినీతి, దిగజారుడు తనాలను దేశంలో ఎక్కడా చూడలేదని, ఈ వివరాలన్నింటినీ వైఎస్ జగన్ తనకు చెప్పారని అన్నారు. అసలు దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరగడాన్ని ఎక్కడా చూడలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి వాళ్లకు పదవులు ఇవ్వడం సరికాదన్నారు. చట్టాలను బైపాస్ చేసి ఇలా చేయడం ఆశ్చర్యకరమైన విషయమని, దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే ప్రయత్నం కూడా చేస్తామన్నారు.
ఆంధ్రదేశం అభివృద్ధి చెందాలని అంతా అనుకుంటున్నాం గానీ, ఇలా అభివృద్ధి చెందడం అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం తరఫున దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రకమైన అవినీతిని ఆపలేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని అన్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు చివరివరకు అదే పార్టీలో ఉండకపోతే.. ప్రజాస్వామ్యానికి, వాస్తవానికి సంబంధం లేకుండా పోతుందని, ఇది చాలా ప్రమాదకరమని.. ఇలా కొనసాగితే అసలు వ్యవస్థను మనం కాపాడలేమని అన్నారు. ఈ సమస్యను ఎక్కడ వీలైతే అక్కడ తాము ప్రస్తావిస్తామని సీతారాం ఏచూరి చెప్పారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తేవాల్సిన అవసరం కచ్చితంగా ఉందని, పార్లమెంటులో ఆ అంశాలను ప్రస్తావిస్తామని అన్నారు. అలాగే ఈ అంశాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటానికి తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు దేశమంతా అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంటూ రాజ్యాంగంలో ఆయన చెప్పిన చివరి మాటలను ప్రస్తావించారు. ''ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం పోతే.. ఈ రాజ్యాంగాన్ని ఎవరూ కాపాడలేరు, దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలి'' అని అంబేద్కర్ అన్నారన్నారు. సీతారాం ఏచూరిని కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు మేకపాటి రాజమోహనరెడ్డి , బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇంకా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.