breaking news
FAST Rule
-
రాజకీయం చేయొద్దు
-
ఫీజులే ప్రధాన సమస్య
* అడ్మిషన్ల వివాదం తొలగినా.. రీయింబర్స్మెంట్ ఎలా? * 1956కు ముందు తెలంగాణ వారికే ఫీజులు ఇస్తామన్న టీ-సర్కారు * అక్కడ నివసిస్తూ చదువుకుంటున్న ఏపీ విద్యార్థులపై మల్లగుల్లాలు * 11న సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టత వస్తుందని ఏపీ సర్కారు నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ నెల ఏడో తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన జరుపుకోవచ్చని, ఆగస్టు నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టంచేసింది. అడ్మిషన్ల వరకు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం పరిష్కారమైనా.. అసలు సమస్య ఇపుడే ప్రారంభమవుతోంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, దానితో ముడిపడి ఉన్న స్థానికత అంశంపై ఏం చేయాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటివరకు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా ‘ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సాయమందించే ఈ పథకాన్ని తెలంగాణ స్థానికులకే అందిస్తామని ఆ ప్రభుత్వం స్పష్టంచేసింది. 1956కు ముందు తెలంగాణలో నివసిస్తున్న వారే స్థానికులని ఆ రాష్ట్ర సర్కారు చెప్పడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఈ నిబంధన వల్ల తెలంగాణలో స్థిరపడి ఉన్న లక్షలాది మంది సీమాంధ్ర విద్యార్థులకు ఆర్థికసాయం అందకుండా పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. విద్యార్థులు తమ స్థానికతతో పాటు తమ వార్షిక ఆదాయాన్ని తెలిపే ధ్రువపత్రాలను పరిశీలన సమయంలోనే అధికారులకు అప్పగిస్తారు. సంబంధిత విద్యార్థి లేదా విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడా లేదా అని అపుడే నిర్థారించి రికార్డుల్లో పొందుపరుస్తారు. ఆ రికార్డుల ఆధారంగా సీటు కేటాయించిన తరువాత కళాశాలల్లో చేర్చుకుంటారు. హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర విద్యార్థులు 1956 నుంచి ఉన్నట్లు నిరూపించుకుంటేనే అక్కడ స్థానిక ధ్రువపత్రాలు అందుతాయి. లేనిపక్షంలో స్థానికేతరులుగా మిగిలిపోతారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలోని కళాశాలల్లో ఉమ్మడి ప్రవేశంలో సీట్లు సంపాదించినప్పటికీ స్థానికేతరులుగా ఆర్థిక సాయం అందుకోలేరు. అదే సమయంలో వీరు ఆంధ్రప్రదేశ్ వారా? తెలంగాణ ప్రాంతం వారా? అనే స్పష్టత ధ్రువపత్రాల్లో ఉండదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తానని చెప్పిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కూడా అర్హులు కాకుండాపోయే ప్రమాదముంది. అయితే ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు తుది తీర్పులో దీనిపైన కూడా స్పష్టత వస్తుందని, ఆ తీర్పు తర్వాత తదుపరి చర్యలపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలపై చంద్రబాబు హర్షం ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సర్టిఫికెట్లను పరిశీలించటంతో పాటు అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం పట్ల చంద్రబాబు సోమవారం సామాజిక వెబ్సైట్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. -
రాజకీయం చేయొద్దు
* విద్యార్థులు నష్టపోకూడదు - 31లోగా అడ్మిషన్లు ముగించండి * ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య * తెలంగాణ సర్కారు గడువు కోరటం వెనుక ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది * కౌన్సెలింగ్ నుంచి ఏపీ విద్యార్థులను తప్పించాలని చూస్తున్నట్లుగా ఉంది 371డీ ప్రకారమే అడ్మిషన్లు జరిగితే ఇక రెండు రాష్ట్రాల ప్రస్తావనెందుకు?.. తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వారిని లోకల్ కాదంటే ఎలా? * తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు * ‘ఫాస్ట్’ నిబంధనల రూపకల్పనకు గడువు కావాలని వినతి * రాష్ట్రం విడిపోయాక ఏపీ విద్యార్థులకు ఫీజులు ఎలా చెల్లిస్తామని ప్రశ్న * ఫీజుల పథకం జోలికి వెళ్లని ధర్మాసనం.. కౌన్సెలింగ్‌కు పచ్చజెండా * ఈ నెల 11వ తేదీన సమగ్ర ఉత్తర్వులు వెలువరిస్తామని వెల్లడి * అక్టోబర్ 31 వరకూ గడువు కోరిన టీ-సర్కారు పిటిషన్‌పై విచారణ సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణకు అక్టోబర్ 31 వరకు గడువు కోరుతూ వేసిన పిటిషన్ వెనక వేరే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అడ్మిషన్ల వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని పేర్కొంటూ.. అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు 31 వరకూ నిర్వహించుకునేందుకు గడువిచ్చింది. గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సుదాంశు జ్యోతి ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణకు రాగానే తొలుత జస్టిస్ ముఖోపాధ్యాయ ‘అడ్మిషన్ కౌన్సెలింగ్‌కు షెడ్యూలు ఉంది కదా.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన కౌన్సెలింగే కదా.. ఇప్పుడు విడిపోయారు.. ఈ ప్రక్రియను ఎలా చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎ.కె.గంగూలీ వివరిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది..’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఒక నెల గడువు ఇస్తే సరిపోతుంది..’ అని పేర్కొన్నారు. స్థానికతను ఎలా నిర్వచిస్తారు? దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీష్‌సాల్వే తన వాదనలు వినిపిస్తూ ‘మా సమస్య ఏంటంటే.. ఒకసారి ప్రక్రియ మొత్తం చూడండి. అడ్మిషన్లు 70:30 నిష్పత్తి ప్రకారం జరుగుతాయి. 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో జరుగుతాయి. మిగిలినవి మేనేజ్మెంట్ కోటా సీట్లు. కన్వీనర్ కోటాలో తొలుత 15 శాతం ఓపెన్ మెరిట్ కోటాలో రాష్ట్రవ్యాప్త విద్యార్థులెవరైనా సరే పోటీపడొచ్చు. అలా భర్తీ అయ్యాక మిగిలిన 85 శాతం లోకల్ కేటగిరీకి రిజర్వ్ అయి ఉంటాయి. ఇవి స్థానికులతో భర్తీ చేస్తారు..’ అని వివరించారు. విద్యార్థుల స్థానికతను, పూర్వాపరాలను పరిశీలించేందుకు తమ వద్ద తగినంత మంది సిబ్బంది లేరని.. కాబట్టి కౌన్సెలింగ్ ప్రక్రియకు మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ జోక్యం చేసుకుంటూ ‘స్థానికతను ఎలా నిర్వచిస్తారు..?’ అని ప్రశ్నించగా.. ‘అది 371డీ చట్టం ప్రకారమే జరుగుతుంది. గతంలో ఉన్న ప్రకారమే..’ అని హరీష్‌సాల్వే వివరించబోయారు. సెటిలయిన వారిని నాన్‌లోకల్ అంటే ఎలా? తిరిగి న్యాయమూర్తి కల్పించుకుని ‘మీ ప్రధాన ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను కౌన్సెలింగ్ ప్రక్రియ నుంచి ఎలిమినేట్ (తప్పించడం) చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. అదే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది.. వాస్తవానికి విద్యార్థులకు రాష్ట్ర విభజనతో ఏ రకంగానూ సంబంధం లేదు. దీనిని రాజకీయం చేయకూడదు.. విద్యార్థులకు సమాన అవకాశాలు ఉండాలి.. అది అటువారైనా ఇటువారైనా సరే.. విభజనకు ముందు ఎలా ఉందో అలాగే జరగాలి..’ అని పేర్కొన్నారు. దీనిపై హరీష్‌సాల్వే మాట్లాడుతూ.. ‘అందులో నుంచి మేం ఏమాత్రం పక్కకు పోవడం లేదు. 371డీ ప్రకారమే వెళుతున్నాం..’ అని పేర్కొన్నారు. వెంటనే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వారిని లోకల్ కాదంటే ఎలా?’ అని ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణ న్యాయవాది మాట్లాడుతూ ‘2011 నోటిఫికేషన్ చూడండి.. అందులో ఉన్న నిబంధనల ప్రకారమే మేం ముందుకు వెళుతున్నాం.. మేం అడ్మిషన్ల విషయంలో కొత్త నిబంధనలు రూపొందించడం లేదు..’ అని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే జోక్యం చేసుకుంటూ ‘మీరు విద్యార్థులకు పరిమితులు విధిస్తున్నట్టుగా ఉంది.. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారం చేయండి..’ అని పేర్కొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో రాజకీయం వద్దు హరీష్‌సాల్వే వాదనలు వినిపిస్తూ ‘విభజనకు ముందు ఉన్నట్టుగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 371డీ ప్రకారం ఓయూ రీజియన్ పరిధిలో 10 తెలంగాణ జిల్లాలు, ఏయూ రీజియన్ పరిధిలో 9 జిల్లాలు, ఎస్వీయూ రీజియన్ పరిధిలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. ఏ రీజియన్ వారు ఆ రీజియన్‌లో దరఖాస్తు చేసుకుంటే లోకల్ అవుతారు. ఒక రీజియన్ విద్యార్థి మరోచోట నాన్ లోకల్ అవుతారు. ఇందులో గందరగోళం ఏమీలేదు. పాత విధానం ప్రకారం నడుచుకుంటాం. కానీ మా సమస్య అది కాదు.. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయాలనుకుంటోంది. అందుకు ఫాస్ట్ పేరుతో ఒక స్కీమ్ రూపొం దించింది. దానికి నిబంధనలు రూపొందించుకునేందుకు కొంత సమయం కావాలి.. అదీ మా సమస్య..’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ ‘మీరు అడ్మిషన్లను 371డీ ప్రకారం ఓయూ, ఎస్వీయూ, ఏయూ రీజియన్ల పద్ధతిలో భర్తీ చేస్తే.. ఇక తెలంగాణ, నాన్ తెలంగాణ అన్న అంశం ఎక్కడ వస్తోంది? ఏ విద్యార్థి ఎక్కడైనా అడ్మిషను పొందవచ్చు కదా? అడ్మిషన్ల ప్రక్రియలో రాజకీయం ఉండకూడదు...’ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులు నష్టపోకూడదు.. హరీష్ సాల్వే కోర్టుకు తన వాదన వినిపిస్తూ ‘ఫాస్ట్ స్కీమ్ మా విద్యార్థుల కోసం రూపొందించుకుంటున్నాం. రాష్ట్రం విడిపోయాక ఏపీ విద్యార్థులకు మేమెలా భరిస్తాం..?’ అని అన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ ‘మేం దాంట్లోకి వెళ్లడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అడ్మిషన్ నిబంధనలు పాటించండి..’ అని పేర్కొన్నారు. జస్టిస్ ఎస్.ఎ.బాబ్దే కూడా ఇంతకుముందు ఉన నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంలో సాల్వే మాట్లాడుతూ ‘ఫాస్ట్ స్కీమ్‌కు సంబంధించి హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.. ఒకవేళ అవసరమైతే దానిపై మేం మిమ్మల్ని ఆశ్రయిస్తాం..’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ ముఖోపాధ్యాయ మాట్లాడుతూ ‘ఈ ప్రతిష్టంబన ఇలాగే కొనసాగుతుందా..? నేను ఏ రాష్ట్రానికి చెందుతానో నాకే తెలియని పరిస్థితి. నేను బీహార్‌కు వెళితే మీరు జార్ఖండ్‌కు చెందినవారు అంటారు.. జార్ఖండ్‌కు వెళితే మీరు బీహార్‌కు చెందిన వారు అంటారు! విద్యార్థులు నష్టపోకూడదు. ఆగస్టు 31 కల్లా అడ్మిషన్ల ప్రక్రియ ముగించండి. ఈ కేసులో తదుపరి సమగ్ర ఉత్తర్వులు ఆగస్టు 11న జారీచేస్తాం. అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించవచ్చు’ అని పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన హరీష్‌సాల్వే అంగీ కరించారు. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలంసహానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అడ్మిషన్లకు తెలంగాణ సర్కారు మరింత గడువు కోరటం తదితర అంశాలపై ఈ నెల 11వ తేదీన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.