breaking news
faction villages
-
ఫ్యాక్షన్ వర్గాలపై ప్రత్యేక నిఘా
– గొలుసు దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు – రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు ఉంటే పేరు తొలగింపు - ఎస్పీ అశోక్‌కుమార్ ధర్మవరం: జిల్లాలో ఫ్యాక్షన్ వర్గాలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున ఇక్కడకు ఎస్ఐని కేటాయిస్తామని తెలిపారు. సిబ్బంది కొరతను తీర్చేందుకు క్రైం రేటు తక్కువగా ఉన్న స్టేషన్ల నుంచి సిబ్బందిని ధర్మవరం స్టేషన్‌కు బదిలీ చేస్తామని వివరించారు. నాటుసారా, బెల్టుషాపులు లేకుండా తమ సిబ్బంది చర్యలు చేపడుతున్నారన్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 100, లేదా 9989819191 నంబర్లకు సమాచారం ఇస్తే ప్రత్యేక టీం వచ్చి బెల్టుషాపులు లేకుండా చేస్తుందన్నారు. పట్టణంలో మట్కా నిర్వాహకులను గుర్తించి వారిలో అవగాహన తీసుకొచ్చి, మట్కా రూపుమాపుతామని పేర్కొన్నారు. గొలుసు దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికడతామన్నారు. పట్టణంలో మున్సిపాలిటీ, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అదనంగా సీసీకెమెరాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను ప్రజలు డౌన్లోడ్ చేసుకోవాలని, ఎవరైనా యాప్‌లో మెసేజ్ పెడితే మీ ఇంటికి సీసీకెమెరా ఏర్పాటు చేస్తామని దొంగతనాలు జరగకుండా నిఘా ఉంచుతామన్నారు. ధర్మవరానికి 7 సీసీ కెమెరాలు కేటాయించామని ఎక్కువమంది యాప్‌లో మెసేజ్ చేస్తే పోలీసు సిబ్బందితో నిఘా పెడతామని తెలిపారు. ప్రజలు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు ఉంటే వారి పేర్లను పోలీస్ రికార్డ్ల నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తామని ఎస్పీ చెప్పారు. -
ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు, న్యూస్‌లైన్: రాబోవు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. అర్ధవార్షిక నేర సమీక్షలో భాగంగా బుధవారం సబ్ డివిజన్ అధికారులతో పాటు సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని డ్వామా సమావేశ మందిరంలో ఎస్పీ రఘురామిరెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, ఆర్ఐలు రంగముని, రెడ్డప్పరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ విభాగం సీఐలు వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, తేజేశ్వర్, కమ్యూనికేషన్ సీఐ రామాంజనేయులుతో పాటు పీపీలు, ఏపీపీలు పాల్గొన్నారు. సబ్ డివిజన్ అధికారులతో పాటు సీఐలు, ఎస్సైలు వారి వారి ప్రాంతాల్లోని తహశీల్దార్ల కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కర్నూలు సబ్ డివిజన్‌కు సంబంధించి డీఎస్పీ వైవీ రమణకుమార్తో పాటు పట్టణంలోని సీఐలు, కర్నూలు తహశీల్దార్ కార్యాలయం, మరికొంత మంది కల్లూరు, కోడుమూరు తహశీల్దార్ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా హింసాత్మక సంఘటనలకు అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని సబ్ డివిజన్ అధికారులను ఆదేశించారు. ఎవరి పరిధిలో వారు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వైరి వర్గాలకు సంబంధించిన కదలికలపై సమాచారం రాబట్టాలని సూచించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయని, నిఘాను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై కూడా నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారి పట్ల గౌరవంగా మసులుకొని కచ్చితంంగా ఫిర్యాదును రిజిష్టర్ చేయాలని ఆదేశించారు.