breaking news
EU Elections
-
జార్జియా అధ్యక్షునిగా సాకర్ ఆటగాడు.. ఈయూ అంశం ఇక లేనట్లేనా?
టిబిలిసీ: జార్జియాను ఈయూ(యూరోపియన్ యూనియన్)లో కలపాలనే తీవ్ర నిరసనల నడుమ జార్జియా అధ్యక్షుడిగా మాజీ సాకర్ ఆటగాడు మైకేల్ కవెలాష్విలి)53) ఎంపికయ్యారు. 1990 ప్రాంతంలో ఇంగ్లిష్ సాకర్ టీమ్ మాంచెష్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహించిన కవెలాష్విలి.. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రష్యా చేతిలో పావుగా మారే అధికార పార్టీ ఈయూలో జార్జియాను కలపడానికి నిరాకరిస్తుందనే తీవ్ర నిరసనల అనంతరం ఆ దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కవెలాష్విలి ఒక్కరే అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు. మొత్తం 300(ఎంపీలు- స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు)మంది సభ్యులకు గాను 225 మంది సభ్యులు పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ మేరకు 224 మంది కవెలాష్విలి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో కవెలాష్విలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయ్యింది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎన్నికను నిర్వహిస్తుందని ఆరోపిస్తూ ఈ ఏడాది అక్టోబర్ నుంచి నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంట్‌ను బహిష్కరించడం కూడా కవెలాష్విలి ఏకగీవ్రంగా ఎన్నిక కావడానికి ఒక రకంగా దోహదం చేసింది.అయితే పశ్చిమ దేశాల ఆధిపత్యంపై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడే కవెలాష్విలికి రాబోయే కాలం మరింత కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రష్యా అనుకూల శక్తులు, మరొకవైపై యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనకారుల నడుమ ఉద్రిక్త పరిస్థితులను కవెలాష్విలి ఏ విధంగా నియంత్రిస్తారో అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.నేను ఇక్కడే ఉన్నా.. !మాజీగా మారిన అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచివలి మాత్రం అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివర్ణించారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడే ఉన్నానని, మళ్లీ వస్తాననని యూరోపియన్ యూనియన్ నిరసనకారులకు అనుకూలంగా ఉన్న ఆమె అంటున్నారు.అసలు ఏం జరిగింది..?యురోపియన్ యూనియన్‌లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ఇటీవల ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి.వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. -
మసిబారిన ‘పొదుపు రాణి’ ప్రాభవం!
ఈయూ ఎన్నికల్లో యూరప్ ప్రజలు ‘పొదుపు చర్యల’కు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో యూరప్‌పై మర్కెల్ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ బడ్జెట్ లోటు, రుణాలపై పరిమితులను విధించే ‘స్టెబిలిటీ ప్యాక్ట్’ను సరళతరం చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. నిన్నటి వరకు ‘యూరో సామ్రాజ్ఞి’గా వెలుగొందిన ఏంజెలా మర్కెల్ హఠాత్తుగా అన్ని వైపుల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. యూరోపియన్ యూనియన్ అధ్యక్షునిగా జీన్ క్లాడ్ జంకర్ అభ్యర్థిత్వాన్ని అయిష్టంగానే సమర్థించాల్సిన దుస్థితి అందులో ఒకటి. లక్సెంబర్గ్ మాజీ ప్రధాని జంకర్ కూడా మర్కెల్లాగే మధ్యేవాద మితవాద నేత. కానీ ఈయూ సంక్షోభానికి పరిష్కారంగా మర్కెల్ యూరప్‌పై రుద్దుతున్న ఆస్టిరిటీ (పొదుపు) కార్యక్రమాల విషయంలో మాత్రం ఆయన ఆమెకు బద్ధ వ్యతిరేకి. మేలో జరిగిన ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యయాల తగ్గింపు పేరిట సంక్షేమ వ్యయాలపై కోతలు, ఉద్యోగాలు, వేతనాలలో కత్తిరింపుల పొదుపు చర్యలను వ్యతిరేకించే పార్టీలకే ఆధిపత్యం లభించింది. ఈయూ స్వభావానికి తగ్గట్టే దాని పార్లమెంటులోని ప్రజాస్వామ్యం కూడా నేతి బీరలోని నెయ్యే. ఈయూ అధ్యక్షుణ్ణి యూరప్ ప్రజా ప్రతినిధులు ఎన్నుకోరు. 28 సభ్య దేశాల అధినేతలు, ప్రభుత్వాలే నియమిస్తాయి. మర్కెల్ ఎవరిని బలపరిస్తే వారే అధ్యక్షుడని అంతా అనుకున్నట్టే ఆమె అనుకున్నారు. జంకర్ అభ్యర్థిత్వాన్ని ఆమె తీవ్రంగానే వ్యతిరేకించారు. విరుద్ధ ధృవాల మధ్య ఆకర్షణలాగా మర్కెల్‌కు, ఈయూ సమావేశాల్లో ఎప్పుడూ శిరోభారమై నిలిచే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు జంకర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంలో ఐక్యత కుదిరింది. కాకపోతే బ్రిటన్‌కు అల వాటుగా మారిన ‘ఈయూ నుంచి నిష్ర్కమణ’ బ్లాక్‌మెయిలింగ్ టెక్నిక్‌ను కామెరాన్ సందర్భశుద్ధి లేకుండా జంకర్ అభ్యర్థిత్వంపై ప్రయోగించారు. దీంతో జంకర్ పరిస్థితి తంతే బూరెల గంపలో పడ్డట్టయింది. ఈయూను విచ్ఛిన్నం చేసే శక్తులతో మర్కెల్ కలుస్తున్నారంటూ జర్మనీలో గగ్గోలు రేగింది. చాన్సలర్ మర్కెల్ మొట్టమొదటిసారిగా తన వైఖరిని తలకిందులు చేసి జంకర్‌కు మద్దతు ప్రకటించక తప్పింది కాదు. జంకర్ అధ్యక్ష పీఠానికి చేరువయ్యారే తప్ప దక్కించుకోలేదు. జంకర్ తలనొప్పి అలా ఉండగా ‘ఆస్టిరిటీపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించే విధానాలు విఫలమయ్యాయి’ అంటూ జర్మనీ వైస్ చాన్సలర్, ఆర్థిక మంత్రి సిగ్మార్ గాబ్రియెల్ బాంబు పేల్చారు. అధికార కూటమిలోని ఈ తిరుగుబాటు ధోరణికి మీడియా నోళ్లు తెరవాల్సి వచ్చింది. మధ్యేవాద వామపక్షమైన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ నేత గాబ్రియెల్ గాలివాటం కనిపెట్టారు. ఈయూ ఎన్నికల్లో యూరప్ అంతటా వీచిన అస్టిరిటీ వ్యతిరేక పవనాలు మర్కెల్ ఆధిపత్యాన్ని బలహీనపరచాయని గ్రహించారు. ప్రత్యేకించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండె, మర్కెల్‌పై మండిపడుతున్నారు. ఈయూ ఎన్నికల్లో ఫ్రాన్స్‌లోని పచ్చి మితవాద కూటమి ‘ఫ్రంట్ నేషనల్’ 25 శాతం ఓట్లు దక్కించుకుంది. అందుకు ఫ్రాన్స్‌పై రుద్దిన ద్రవ్య సంస్కరణలే కారణమని ఆయన అక్కసు. ఈయూ ‘స్టెబిలిటీ అండ్ గ్రోత్ ప్యాక్ట్’ (సుస్థిరత, వృద్ధి ఒప్పందం) నిబంధనలను సరళతరం చేయాలని ఆయన గట్టిగా డిమాండు చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించే ఈయూ సభ్య దేశాల ప్రభుత్వ బడ్టెట్ లోటు జీడీ పీలో 3 శాతం కంటే, రుణం జీడీపీలో 60 శాతం కంటే తక్కువగా ఉండాలని పరిమితులను విధించారు. ఒకప్పుడు జర్మనీ సహా ఈయూ ప్రధాన శక్తులు వాటిని యథేచ్ఛగా ఉల్లంఘించినవే. మర్కెల్ హయాంలోనే అవి దాటరాని లక్ష్మణ రేఖలుగా మారాయి. వాటిని సరళతరం చేయడమంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను, ఈయూపై మర్కెల్ పట్టును బలహీనపరచడమే. దీన్ని మర్కెల్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కానీ జర్మనీ అధికార కూటమిలోనే ఈ చర్చ జోరుగా సాగుతోంది. గాబ్రియెల్ చొరవతో ఈ నెల 22న వివిధ ఈయూ దేశాల మధ్యేవాద వామపక్ష నేతలంతా సమావేశమై వృద్ధిని మరచిన స్టెబిలిటీ ప్యాక్ట్ నిబంధనలను సడలించడమే సం క్షోభం నుంచి బయటపడటానికి మార్గమంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మర్కెల్ ఆస్టిరిటీ విధానాలకు గట్టి మద్దతుదార్లుగా నిలిచిన హాలెండ్, ఫిన్లాండ్లు కూడా అదే పాట పాడటం ప్రారంభించాయి. ప్రత్యేకించి ఇటలీ ప్రధాని మాటియో రెంజి ఆమెకు మరింత తీవ్ర ప్రత్యర్థిగా తయారయ్యారు. ఈయూ సంస్కరణల కత్తి పీక మీద ఉన్న ఆయన జీడీపీలో 133 శాతం ప్రభుత్వ రుణం, 12.6 శాతం నిరుద్యోగం ఎదుర్కొంటున్నారు. ఆస్టిరిటి విమర్శకులు కోరుతున్నట్టు ఈయూ పొదుపు విధానాలను సవరిస్తే జర్మనీ ప్రజలపైనే భారం పడుతుందని మర్కెల్ గగ్గోలు పెడుతున్నారు. ఈయూ ఎన్నికల్లో ‘సౌహార్ద్రత’ నినాదానికి బదులుగా ఈయూ పొదుపు చర్యలను విడనాడితే మూల్యాన్ని చెల్లించాల్సింది జర్మన్లే అంటూ ప్రచారాన్ని సాగించాల్సిందని ఆమె ఇప్పుడు విచారిస్తున్నారు. -పి. గౌతమ్