breaking news
eethakota
-
రెప్ప వేయని రాత్రి
ఒకటా రెండా? ఎన్ని యుగాలు నడిచిపోలేదు సూర్యుడి చిటికెనవేలు పట్టుకొని రాత్రైతే చంద్రదీపం వెలిగించుకొని వర్తమానం నుంచి చరిత్ర గుమ్మం వరకు. ఒకరా, ఇద్దరా? ఎందరెందరు విడిచిపోలేదు పంచభూతాలల్లిన మాంసపంజరాన్ని మానవతా వాదాన్ని తలకెత్తుకున్న వాళ్లు. మనం మానవులం అని నిరూపించుకున్నవాళ్లు మంచిని పెంచి, వంచించిన వాళ్లని కాలరాసి తడిలేని హృదయాల తలుపులు తడుతూ తమని తాము దీపాలుగా వెలింగిచుకున్న వాళ్లంతా చివరికి చీకటిపాలైన ఉదంతాలన్నీ చరిత్ర పుటల్లో మురిగిపోతున్నాయి. ఇప్పుడు మనుషులు మనుషుల్లా లేరు పడగల్ని తలపుట్టల్లో దాచుకొని పెదవులపై వెన్నెల పండగలు జరుపుకుంటూ లోలోపల అగ్ని పర్వతాలై బద్దలై పోతున్నారు. వాతావరణంతో పాటు కలుషితమై పోతూ జనారోగ్యంపై రోగాలదోమలై వాలిపోతున్నారు. రేపటి వసంతానికి పట్టిన చీడపురుగులై కులాల సంతల్లో పాయలై ప్రవహిస్తున్నారు. ప్రతి వొక్కడు తన అజెండాతో ఓ జెండా మోస్తూ ఐకమత్యానికి పురిటిరోగమై ప్రవభవిస్తున్నాడు. రేపటి సూర్యుడి కోసం నిరీక్షించే నేత్రాలు మాత్రం ఆకాశం చిట్టచివ్వరి తెర వరకూ చూపులుసారిస్తూ విశ్వనరుడి ఆవిర్భావం కోసం రాత్రి రెప్పవేయటం లేదు. - ఈత కోట సుబ్బారావు -
కలకలం.. కలవరం..
- పెళ్లిబృందం లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 22 మందికి గాయాలు - సురక్షితంగా బయటపడిన వరుడు - త్రుటిలో తప్పిన పెనుముప్పు - ఈతకోట టోల్గేట్ వద్ద ఘటన రావులపాలెం : వివాహ వేడుక వేళ జరిగిన ఓ ప్రమాదం.. వధూవరుల కుటుంబాల్లో కలవరం రేపింది. పెళ్లిబృందంతో వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ట్యాంకర్ డ్రైవర్‌తోపాటు లారీలో ఉన్న 22 మంది గాయపడ్డారు. రావులపాలెం మండలం ఈతకోట వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ప్రత్తిపాడుకు చెందిన మర్రి సత్యనారాయణ వివాహం శనివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వధువు ఇంటివద్ద జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లికొడుకు సత్యనారాయణతోపాటు ప్రత్తిపాడు, గోకవరం ప్రాంతాలకు చెందిన అతడి తరఫు బంధువులు సుమారు 80 మంది ఒక లారీలో శుక్రవారం సాయంత్రం పాలకొల్లు బయలుదేరారు. రాత్రి 8 గంటల సమయంలో ఈతకోట టోల్గేట్ వద్దకు వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్లు ఉండటంతో లారీ వేగాన్ని డ్రైవర్ తగ్గించాడు. అదే సమయంలో వెనుకగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అది గమనించకుండా వేగంగా దూసుకువచ్చి పెళ్లిబృందం లారీని ఢీకొట్టాడు. దీంతో పెళ్లిబృందం లారీ అదుపు తప్పి డివైడర్ మీదుగా కుడివైపు రోడ్డులోకి దూసుకుపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో లారీలో ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడిపోయి, గాయపడ్డారు. దీంతో భయాందోళనలకు గురైన మహిళలు, పిల్లలు ఆర్తనాదాలు చేశారు. ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ సిద్ధి ప్రసాద్‌యాదవ్ అందులో చిక్కుకు పోయాడు. సమాచారం అందుకున్న రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు, ఎస్సై పీవీ త్రినాథ్‌లు సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్ డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. క్షతగాత్రులను హైవే, 108 అంబులెన్సులలో తొలుత కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన చెరుకూరి యాకోబు, మేకల మహాలక్ష్మి, కల్లూరి మహేష్, మర్రి రమణలను మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ సిద్ధి ప్రసాద్‌యాదవ్, మర్రి ముత్యాలరావు, మర్రి త్రిమూర్తులు, చెరుకూరి రాజు, అచ్చిబాబులను కూడా రాజమహేంద్రవరం తరలించారు. మర్రి సత్తిబాబు, కల్లూరి విజయ్, మర్రి కృపావతి తదితరులు కొత్తపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుడు సత్యనారాయణ సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో వివాహానికి ఆటంకం కలగకుండా అతడితోపాటు కుటుంబ సభ్యులను ప్రత్యేక వాహనంలో పోలీసులు పాలకొల్లు పంపారు. నిర్లక్ష్యమే కారణం! ఈ ప్రమాదానికి టోల్గేట్ అధికారులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. టోల్గేట్ వద్ద ఇరువైపులా స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేసినా వాటికి రేడియం స్టికర్లు కానీ రంగు కానీ వేయలేదు. దీంతో రాత్రి వేళల్లో అవి కనిపించడంలేదు. అలాగే టోల్గేట్ వద్ద లైటింగ్ కూడా అంతంతమాత్రంగా ఉంటోంది. గతంలో కూడా ఈ కారణంగా ఇక్కడ పలు ప్రమాదాలు జరిగాయి. 2015 డిసెంబర్లో టోల్గేట్ ప్రారంభమైన కొత్తలో పొగమంచులో స్పీడ్ బ్రేకర్లు కనిపించక ఒక హైటెక్ బస్సును ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కూడా పలువురు గాయపడ్డారు. టోల్గేట్ నిర్వాహకులపై విమర్శలు వస్తున్నా ఎలాంటి చర్యలూ కానరావడం లేదు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా లారీలో భారీగా జనాన్ని పెళ్లికి తరలించడాన్ని పోలీసు, రవాణా అధికారులు పట్టించుకోకపోడం ప్రమాదానికి మరో కారణంగా భావిస్తున్నారు.