కరాటే కారన్‌లో కొడుకులే హీరోలు
ఏ తల్లి అయినా కన్నపిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటుంది. అందులో భాగంగా ఇక్కడో తల్లి తన కొడుకులను ఏకంగా హీరోల్ని చేసేస్తోంది. ఆ చిత్రానికి తండ్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఫైట్‌మాస్టర్ స్టంట్ శివ కాగా ఆయన భార్య లెనిహూ చిత్ర నిర్మాత. వీరి కొడుకులు కెవిన్, స్టీఫెన్ హీరోలుగా పరిచయం అవుతున్న చిత్రం కరాటే కారన్. లెనిహూ కథ, కథనం సమకూర్చి ముఖ్య పాత్ర నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టంట్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర వివరాలకు నిర్మాత లేనిహూ తెలుపుతూ తన తండ్రి పదహారణాల తమిళుడని తెలిపారు. తాను కరాటే విద్యలో బ్లాక్‌బెల్ట్ పొందానని చెప్పారు. నా భర్త స్టంట్ శివ ఫైట్‌మాస్టర్ కావడంతో పిల్లల్ని ఈ ఫైట్స్ జీవితానికి దూరంగా ఉన్నత చదువులు చదివించాలని ఆశించామన్నారు. అయితే వారి రక్తంలోను ఫైట్స్ కళ జీర్ణించుకుందని గ్రహించి ఆ ప్రతిభను బహిర్గతం చేసే విధంగా ఒక చిత్రం చేయాలని భావించామన్నారు. ఇంతకుముందు జాకీచాన్ కరాటే విద్య నేపథ్యంలో కరాటే కిడ్ అనే చిత్రాన్ని రూపొందించారన్నారు.
ఆ చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని తయారు చేసిన కథతో నిర్మిస్తున్న చిత్రం కరాటే కారన్ అని వివరించారు. ఈ చిత్రం ద్వారా హీరోలుగా పరిచయం చేస్తున్న తన కుమారులకు మూడేళ్లపాటు తానే కరాటేలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అలాంటి ఒక బ్రహ్మాండమైన చిత్రాన్ని మనం కూడా చేయగలం అని నిరూపించుకోవాలన్న ప్రయత్నమే ఈ కరాటే కారన్ చిత్రం అని లెనిహూ చెప్పారు. ఈ చిత్రంలోనూ హీరోలకు శిక్షకురాలిగా తాను ముఖ్య భూమికను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు.