breaking news
devulapalli krishnasastri
-
దేవులపల్లి పాటకు పట్టాభిషేకం
దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటకు పట్టాభిషేకం చేసిన 'మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం' కార్యక్రమానికి.. 'వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్' 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్'లో గౌరవ స్థానం దక్కింది. సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో తానా, వంగూరి ఫౌండేషన్, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్, సీపీ బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్), దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, తెలుగు అసోసియేషన్ సిడ్నీ, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, వేగేశ్న ఫౌండేషన్ వారి సమిష్టి సౌజన్యంతో.. కళాప్రపూర్ణ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవులపల్లి కృష్ణశాస్త్రి 123వ జయంతి సందర్భంగా 'మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం' అత్యంత వైభవంగా నిర్వహించారు. నవంబర్ 1 ఆదివారం రోజున 12 గంటలపాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. కళాబ్రహ్మ సేవామహాత్మ శిరోమణి వంశీ రామరాజు స్వాగత వచనాలతో ప్రారంభమైన ఈ సభకు దేవులపల్లి మనుమరాళ్ళు, ప్రముఖ కార్టూనిస్ట్ బుజ్జాయి కుమార్తెలు అయిన రేవతి అడితం (అమెరికా), రేఖ సుప్రియ (చెన్నై) జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా తమ తాతగారి జ్ఞాపకార్థం జరుగుతున్న ఈ కార్యక్రమం చారిత్రాత్మక మైనది అని అభినందనలు తెలుపారు. కృష్ణ శాస్త్రితో వారికున్న అనుబంధాన్ని గురించి సభాముఖంగా పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సాహితీవేత్త కేవీ రమణ.. దేవులపల్లి రచనా వైశిష్ట్యం గూర్చి తెలుపుతూ అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేశారు. వారు రచించిన 'జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ' పాటకు జాతీయగీతం కావాల్సిన స్థాయి ఉంది' అన్నారు. సింగపూర్ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ.. దేవులపల్లి వంటి మహానుభావులకు నివాళిగా ఇటువంటి కార్యక్రమం చేయడం తమ సంస్థకు దక్కిన గౌరవం అన్నారు. భారత్, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, హాంకాంగ్, స్వీడన్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి 58 మంది గాయనీ గాయకులు పాల్గొని దేవులపల్లి వారు రచించిన 100 పాటలతో రాత్రి 11 గంటల వరకు శతగీతార్చన గావించారు. ప్రముఖ గాయని సురేఖ మూర్తి ప్రార్థనా గీతం ఆలపించగా, దేవులపల్లి వారిపై వీరుభొట్ల హరి శ్రీనివాస్ విరచిత గీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆడియోను సభలో వినిపించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమం 12 గంటల పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడి, ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది కృష్ణశాస్త్రి అభిమానులకు వీనులవిందు చేసింది. రాధిక మంగిపూడి నిర్వహణలో సాయంత్ర సభలో.. సురేఖ మూర్తి, సీతా రత్నాకర్, విజయలక్ష్మి, శశికళ మొదలగు ప్రముఖ గాయనీ మణులు కృష్ణశాస్త్రి పాటలను ఎంతో శ్రావ్యంగా ఆలపించి అలరించారు. సింగపూర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలు అక్షర మరో ఇద్దరు పిల్లలు కలసి 'నారాయణ నారాయణ' అనే బృందగానం ఆలపించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం సాహితీవేత్త, ప్రముఖ సినీ రచయిత భువన చంద్రకి 'దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి జాతీయ సాహిత్య పురస్కారం' సగౌరవంగా అందజేశారు. ఈ సందర్భంగా భారత్ నుండి సుద్దాల అశోక్ తేజ, రేలంగి నరసింహారావు, వెన్నెలకంటి, మహాభాష్యం చిత్తరంజన్, అమెరికా నుంచి వంగూరి చిట్టెన్ రాజు, తోటకూర ప్రసాద్, జయశేఖర్, శారద, దేవులపల్లి కుటుంబ సభ్యులు రత్నపాప, ఆస్ట్రేలియా నుంచి కొంచాడ రావు, మధు, న్యూజిలాండ్ నుంచి శ్రీలత, లండన్ నుంచి జొన్నలగడ్డ మూర్తి, వీపీ కిల్లీ, దక్షిణాఫ్రికా నుంచి సీతారామరాజు మొదలగు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం దేవులపల్లికి నివాళులర్పించి, భువనచంద్రకి శుభాకాంక్షలు అందజేశారు. రాధిక మంగిపూడి సింగపూర్, విజయ గొల్లపూడి- ఆస్ట్రేలియా, జయ పీసపాటి- హాంకాంగ్, రాధికా నోరి- అమెరికా నుంచి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. -
ఆంధ్ర నాటకానికి నవ వసంతాలు
ఆంధ్ర నాటక కళాపరిషత్... నాటక కళ క్షీణ దశకు చేరుతున్న తరుణంలో నాటక పునరుజ్జీవం లక్ష్యంతో భారతదేశంలోనే తొలిగా తెనాలిలో ఏర్పాటైన నాటక సంస్థ. రంగస్థల నాటకానికి పునర్వికాసం కల్పించి తెలుగుదేశాన నాటక కళ పరిఢ విల్లేందుకు అవిరళ కృషే చేసింది. ఆధునిక సమాజంలో ఇంకా నాటకం అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నదంటే ఇలాంటి సంస్థల కృషి ఫలితమే. ఇంతటి ఘనచరిత్ర కలిగిన సంస్థను దశాబ్దకాలం కిత్రమే పునరుద్ధరించారు. ఎనిమిది దశాబ్దాల ఉత్సవాలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 90 వసంతాల వేళ, విజయవాడ మొగల్రా జపురంలోని సిద్ధార్థ కళాపీఠంలో గురువారం నుంచి నాలుగురోజులపాటు జాతీయ బహుభాషా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నందున ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆవిర్భావం, కృషిని గుర్తు చేసుకోవటం సందర్భోచితం... ఇతర రాష్ట్రాల నుంచి... పూర్వం ఇతర రాష్ట్రాల నుంచి నాటక కంపెనీలు వచ్చి ఆంధ్ర దేశంలో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. 1880 తర్వాత తెనాలితో సహా అయిదారు పట్టణాల్లో నాటక కంపెనీలు ఏర్పాటయ్యాయి. పురాణాల నుంచి కథాంశాలను ఎన్నుకొని నాటకాలను తీసుకొచ్చారు. జాతీయోద్యమ ప్రభావంతో పౌరాణిక అంశాలతో నాటకాలను రూపొందించి, సందర్భోచితంగా బ్రిటిష్ వారిని దుయ్యబడుతూ వచ్చారు. ఆ రకంగా తెలుగునాట నాటక ప్రదర్శనలు విస్తారంగా జరుగుతున్న 1919లోనే నాటక పోటీలు ఆరంభమయ్యాయి. నాటక ప్రాభవం క్రమేపీ తగ్గిపోవడానికి, అపసవ్య ధోరణులకు ఈ పోటీలే దారితీయటం విశేషం! ఏ నటుడు ఎక్కువసేపు రాగం తీస్తే, ఆ నటుడికే ప్రేక్షకుల నుంచి ‘వన్స్‌మోర్’ వస్తుండటంతో నాటకానికి అర్ధం మారింది. నటనకు ప్రాధాన్యత తగ్గి గానం, సంగీతమే ప్రధానమైంది. నాటకాలు పాటకచేరీలు అన్నట్టుగా తయారయ్యాయి. నటులను సంస్కరిస్తే నాటకాలు బాగుపడతాయన్న భావనతో 1924లో తొలిసారిగా విజయవాడలో నాటక పాఠశాల ఏర్పాటుచేసి శిక్షణనిచ్చిన తర్వాత కూడా పద్ధతి మారలేదు. నటులు వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడారు. వైషమ్యాలు పెరిగి, నాటక సమాజాలు నష్టాల్లో పడ్డాయి. క్రమంగా మూతపడ్డాయి. సినిమాలు అప్పుడప్పుడే వస్తున్నందున కొందరు ఆ రంగానికి వెళ్లారు. నాటకరంగం అధోగతిలో పడింది. నాటక రంగంలోని అపసవ్య ధోరణులను అరికట్టడానికి అనేకులు రకరకాలుగా ప్రయత్నించారు. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’ అనే ఆశయంతో ఔత్సాహికులు రంగంలోకి దిగి తెలుగు నాటకం ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషిచేశా రు. నాటక సంస్కరణలకు మార్గాలను అన్వేషించారు. ఇలాంటి తరుణంలో ‘సురభి’ నాటక కంపెనీ పితామహుడు వనారస గోవిందరావు ఆరునెలలపాటు కష్టపడి రాష్ట్రంలోని ప్రముఖులను కూడగట్టి, ఎంతో వ్యయంచేసి ‘ఆంధ్ర నాటక కళా పరిషత్’ ఆవిర్భావానికి దోహదపడ్డారు. సంస్థ ఆవిర్భావ సభలు 1929 జూన్ 19, 20, 21 తేదీల్లో తెనాలిలో వైభవంగా నిర్వహించారు. దశమార్చిన మారిన సభలు మూడురోజుల సభలతో ఆంధ్ర నాటక కళాపరిషత్, తెలుగు నాటక రంగానికి దశ, దిశానిర్దేశం చేసింది. స్పష్టమైన నియమాలను రూపొందించింది. పరిషత్ నిర్వహణతో రాష్ట్రంలో ఔత్సాహిక సమాజాలు వందలకొద్దీ పుట్టుకొచ్చాయి. కొత్త రచయితలు, నటీ నటులు, సంగీత కళాకారులు నాటక రంగంలోకి అడుగుపెట్టారు. పరిషత్తుల్లో బహుమతులు సాధించిన రచయితలు, నటులకు సినిమారంగంలో ప్రవేశం లభించింది. మొదటి సభలకు అతిథులు వీరే.. బుర్రా శేషగిరిరావు, వక్కలంక అచ్యుతరావు, భమిడిపాటి చిన యజ్ఞనారాయణ శర్మ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు సుబ్బారావు, తల్లావఝుల శివశంకరశాస్త్రి, కాళ్లకూరి గోపాలరావు, బళ్లారి రాఘవ ప్రభృతులు హాజరయ్యారు. మొదటిరోజు ‘నాటక రచన’, రెండోరోజు ‘నటన’, చివరిరోజున ‘నాటక ప్రయోగం’ అంశంపై చర్చలు జరిగాయి. ప్రతిరోజు రాత్రి నాటకాలను ప్రదర్శించారు. ముగింపు సభలో ‘దేశోద్ధారక’ కాశీనాధుని నాగేశ్వరరావు, గోవిందరావు, ఆచంట సాంఖ్యాయన శర్మ, చట్టి చినపూర్ణయ్య పంతులు, విశ్వనాధ కవిరాజు, కొత్తపల్లి లక్ష్మయ్య, నీలంరాజు వేంకట శేషయ్యతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వనారస గోవిందరావును ‘ఆంధ్ర నాటక కళోద్ధారక’ బిరుదుతో సత్కరించారు. తెనాలి నేపధ్యమే ప్రేరణ.. ‘సురభి’ నాటక సమాజం నాటక ప్రదర్శనలిస్తూ తెనాలికి వచ్చిన సందర్భంలో ఆ కంపెనీ నిర్వాహకుడు వనారస గోవిందరావుకు ఇక్కడి సాంస్కృతిక వాతావరణం నచ్చింది. అందుకే ఇక్కడ కళాపరిషత్ ఆవిర్భావానికి కృషి చేశారు. సాహితీ సమితి ఏర్పాటై ఉంది. రచయితలు, కళాకారులు, నాటక సమాజాలు ఉన్నాయి. తెనాలి నుంచి అప్పట్లో 20 వరకు దిన, వార, మాసపత్రికలు వెలువడుతుండేవి. ఇంత అనుకూలంగా ఉన్నందునే పరిషత్ విజయవంతమైంది. – నేతి పరమేశ్వరశర్మ, సీనియర్ కళాకారుడు పరిషత్ అనుమతిస్తే గొప్పే! ఆ రోజుల్లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌లో ప్రదర్శనకు ఏదైనా నాటకానికి అనుమతి లభించిందంటే గొప్ప గౌరవంగా భావించేవారు. ‘కాళరాత్రి’, ‘మరో మొహంజదారో’, ‘ఎన్జీవో’, ‘ఈనాడు’, ‘దొంగవీరడు’, ‘పల్లెపడుచు’, ‘అన్నాచెల్లెలు’, ‘మావూరు’, ‘ఎదురీత’, ‘పెత్తందారు‘, ‘నటనాలయం’, ‘కనక పుష్యరాగం’, ‘కళ్లు’ వంటి అద్భుత కళాఖండాలు తెలుగు నాటక రంగంలో వెలుగులోకి రావడానికి కళాపరిషత్ దోహదపడింది. తర్వాత 1951 లో మున్సిపల్ చైర్మన్ నన్నపనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మళ్లీ తెనాలిలో నాలుగురోజులు ఆంధ్ర నాటక కళాపరిషత్ సభలు జరిగాయి. ఆవిర్భావ సభల్లో పాల్గొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సభలను, పోటీ నాటకాలను సినిమా దర్శకుడు వైవీ రావ్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్, ఆ నాటి సభల్లో నృత్యం చేయటం మరో విశేషం. కళారంగంలో జాజ్వలమానంగా ప్రకాశించేందుకు ఎంతో కృషిచేసిన ఈ పరిషత్ పదేళ్లు విరామం అనంతరం, బొల్లినేని కృష్ణయ్య, అన్నమనేని ప్రసాదరావు సారధ్యంలో పూర్వవైభవానికి కృషిని కొనసాగిస్తోంది. ఆ క్రమంలో 2009లో తెనాలిలో ఎనిమిది పదుల నాటకోత్సవాలను జరుపుకోవటం విశేషం. -
సంధ్యాకాశంలా జీవితం...
గ్రంథపు చెక్క జీవితమంటే సుఖదుఃఖాలు రెండూ కలిసి ఉంటాయి. సంధ్యాకాశంలా ఉంటుంది జీవితం. వెలుగు చీకట్లు కలిసి. అయితే ఒక్కొక్కడి బ్రతుకు ఉదయసంధ్యలాగ ఉంటుంది. మరొక్కడిది సాయం సంధ్యలాగ ఉంటుంది. మొదటి రకం జీవితాన్ని చూస్తే మనకు ఉల్లాసం కలుగుతుంది. దానిలో వెలుగు పాలెక్కువ. రెండో రకపు దానిలో రక్తఛాయ ఎక్కువ. చీకట్ల పాలెక్కువలా ఉంటుంది. అందరి జీవితాల్లాంటిదే కవి జీవితమూను. ఎంత అల్పమైనదైనా ఒక్కొక్క అనుభూతి కవిని ఎక్కువ ఊపేయవచ్చు. కానీ, మొత్తం మీద, రకరకాల సుఖదుఃఖాలతో, ఇతర మానవ జీవితాల్లాగానే ఇతని జీవితమూ ఉంటుంది. అలాగే కొందరు కవుల జీవితాలను గూర్చి వివరాలను తెలుసుకున్నా, వారి రచనలు చదివినా... ఏదో చల్లగా, నిదానంగా అతగాడు నిండుగా బ్రతికాడనిపించి మనకు హాయిగా అనిపిస్తుంది. వర్డ్స్‌వర్త్, టెన్నీసన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి కవులలాగ. మరి కొందరి జీవితగాథలు తెలుసుకుంటే దిగులు వేస్తుంది. తమ బ్రతుకుల్ని కాలరథచక్రాల క్రింద పారేసి, మార్గానికి కూడా రక్తపు మరకల్ని అంటించి, బలవంతంగా ముగించినట్టు తోస్తుంది. వీళ్ల రచనలు కూడా చెప్పలేని బెంగా, భయం కలిగిస్తాయి. - దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘కవి పరంపర’ నుంచి.