గొల్లపూడి వద్ద దేవినేని ఉమ అరెస్ట్
విజయవాడ : టీడీపీ మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆమరణ దీక్ష చేయటానికి శిబిరానికి బయల్దేరిన ఆయనను గొల్లపూడి హైవే వద్ద శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దేవినేని ఉమను పోలీసులు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తమ నాయకుడిని తక్షణమే విడుదల చేయాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు .దాంతో విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా అవనిగడ్డ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దేవినేని ఉమ దీక్షకు అనుమతి లేదని, అందువల్లే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీక్షకు అనుమతి లేదని తాము ముందు నుంచి చెబుతున్నామని, అయినా దేవినేని ఉమ దీక్షకు బయల్దేరటంతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దీక్ష అనుమతికి ఎన్నికల కమిషన్ కు లేఖ రాశామని, ఈసీ అనుమతి లభిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.