breaking news
devichowk
-
భక్తులతో పోటెత్తిన గోకవరం దేవీచౌక్
-
పేరొందిందిలా..
గోదావరి నీడలో ఊరుఊరికీ, పేటపేటకూ ఓ చరిత్ర ‘వాట్ ఈజ్ ఇన్ ఏ నేమ్?’–మహాకవి విలియమ్ షేక్స్పియర్ రచించిన రోమియో అండ్ జూలియట్లో జూలియట్ నోట వెలువడిన పలుకులివి. ‘ఏ పేరుతో పిలిచినా, గులాబీ అదే మధుర గుబాళింపులను ఇస్తుంది కదా–పేరులో ఏముంది?’ ఇది జూలియట్ వాదన. గురజాడ కన్యాశుల్కంలో గిరీశం ఇంచుమించుగా ఇవే మాటలు అంటాడు..’విడో అనేది ఏమిటి? ఏ నేమ్! ఓపేరు. ఆ పేరు మనిషి మొహమ్మీద రాసుందా?.. జూలియట్ అంతరంగానికి, గిరీశం అంతరంగానికి హస్తమశకాంతర భేదం ఉన్నా, ఇద్దరి మాటలు ఒకటే. అయితే, పేరులోనే గలదు పెన్నిధి అనుకునేవారు లేకపోలేదు. ఎవరెలా భావించినా, ఒక ప్రాంతానికి ఆ పేరు రావడానికి అనేక చారిత్రక, సామాజిక కోణాలు ఉండవచ్చు. ఏ పేరయితే ఏమిటని తేలికగా తీసిపడెయ్యక, ఆ పేరు ఎలా వచ్చింది? అని తెలుసుకోవడం ఆసక్తిదాయకం. జిల్లాలో కొన్ని ప్రాంతాలకు, తెలుగువారి సాంన్కృతిక రాజధాని రాజమహేంద్రిలో ఆయా ప్రాంతాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకోవాలని ఉందా.. అయితే చదివేయండి! – రాజమహేంద్రవరం కల్చరల్ నల్లమందు సెంటర్.. మీరు ఆటోవాలాను పిలిచి నల్లమందు సందుకు పోవాలంటే వాడు ఇబ్బంది పడడు. అదే మీరు కందుల వీరరాఘవస్వామినాయుడు రోడ్డుకు పోవాలంటే, వాడు మీ ఒంక ఆశ్చర్యంగా చూస్తాడు. రాజమహేంద్రి మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న కందుల వీర రాఘవస్వామి నాయుడు నగరంలో ప్రముఖ వాణిజ్యకూడలి.1950 వరకు ఒక ముసలమ్మ గంపలో నల్లమందు తీసుకువచ్చి అమ్మేది. నల్లమందు సందు పేరు అలా వాడుకలోకి వచ్చింది. ఆ పేరునే ప్రజ ఖరారు చేసింది. ప్రభుత్వం చేసిన నామకరణం ఏదైనా ’పడినముద్ర చెరిగి పోదురా!అన్నాడుకదా ఓ సినీ కవి. కొన్ని ముఖ్యప్రాంతాలు–వాటి పేర్లు = మూడు లాంతర్ల సెంటరుగా పేరుపొందిన ఆప్రాంతం బత్తిన సోదరులు కోల్కత్తా నుంచి అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని తీసుకువచ్చి, అక్కడ నెలకొల్పడంతో దేవీచౌకైంది. దివ్యజ్ఞానసమాజం నాయకుడు ఆల్కాట్ ఆధ్వర్యంలో దివ్యజ్ఞాన సమాజం ప్రార్థనలు జరిగే ప్రాంతం ఆల్కాట్ గార్డెన్ అయింది. 1865లో నాటి సబ్ కలెక్టర్ ఇన్నిసిస్ వలస స్థావరం ఏర్పరుచుకున్న ప్రాంతం తర్వాత రోజుల్లో ఇన్నీసుపేట అయింది. జానపదగీతాలతో వేదాంతాన్ని, అహింసావాదాన్ని ప్రచారం చేసిన జానపద గాయకుడు యెడ్ల రామదాసు పేరిట రామదాసుపేట ఏర్పడింది. కరువుకాటకాలు తట్టుకోలేక విశాఖ జిల్లా జామి నుంచి ప్రజలు తరలి వచ్చి నివాసం ఏర్పరుచుకున్న ప్రాంతం జామిపేట, రూపాంతరం చెంది జాంపేటైంది. జాంపేట కూడలిలో మహాత్ముని విగ్రహాన్ని అప్పట్లో టంగుటూరి ప్రకాశం ఆవిష్కరించారు. కోటగుమ్మం ప్రాచీనకాలంలో కోటలు ఎత్తయిన ప్రాంతాలలో ఉండి చుట్టూ లోతైన కందకాలు ఉండేది. నేటి గోదావరి స్టేషను ఎదుట రాజరాజు కోట ఉండేదట. ఆ ప్రాంతానికి కోటగుమ్మం అని నేటికీ పేరు. దానికి ఓ పక్క కందకం రోడ్డు పల్లంలోనే నేటికీ ఉంది. మరో పక్కన ఉన్న–గోదావరికి వెళ్లే(పుష్కరాలరేవుకు చేరుకునే) రోడ్డు కూడా పల్లంలోనే ఉంది. కవులు–దేశనాయకుల పేరిట... నన్నయవీధి శ్రీరాంనగర్‌లో ఉంది. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి పేరిట వీధి లలితానగరులో ఉంది. వసురాయకవి పేరిట వీధి ఇన్నీసుపేటలో, డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పేరిటవీధి ఆర్యాపురంలో, డాక్టర్ బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం పేరిట సీతంపేటలో వీధులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇతర ప్రాంతాలు వనవాసంలో పాండవులు నివసించారని చెబు తున్న పాండవులమెట్ట పెద్దాపురంలో ఉంది. శ్రీరాముడు వనవాసకాలంలో ‘సఖీ! ఇది నేటిమన పల్లి’ అన్నప్రాంతానికి సఖినేటిపల్లి అని పేరొచ్చింది. పలివెలగ్రామంలోని ఉమా కొప్పేశ్వరస్వామి ఆలయానికి ఆ పేరు రావడానికి ఒకకథ వాడుకలో ఉంది. గ్రామంలో అర్చకుడు వారకాంత సహచర్యంలో ఎక్కువకాలం గడుపతూ ఉండేవాడు. ఒక నాడు రాజుఆలయ దర్శనానికి వస్తున్నారని తెలిసి, వారకాంత మెడలోని పూలమాలను శివలింగంపై వేస్తాడు. ఆ పూలమాలను రాజు కంఠాన అలంకరించినప్పుడు, అందులో ఒక వెంట్రుక ఆయనకు గోచరించింది. స్వామికి కొప్పు ఉందని మరుసటిచూపుతానని అర్చకుడు రాజుకు చెబుతాడు. ఆ రాత్రి అర్చకులని ప్రార్థనలు ఆలకించిన ఈశ్వరుడు శివలింగానికి కొప్పు వచ్చేటట్టు చేస్తాడు. ఆ రోజునుంచి ఆలయానికి ఉమాకొప్పేశ్వరస్వామి ఆలయమనే పేరు వాడుకలోకి వచ్చింది. -
బాణసంచా పేలుళ్లలో అపశ్రుతి
రాజమహేంద్రవరం క్రైం : దీపావళి సందర్భంగా రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో భారీగా బాణసంచా కాల్చుతున్న సంఘటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానిక దేవీచౌక్‌లో ఉత్సవ కమిటీ అనుమతి లేకుండా బాణసంచాను కాల్చేందుకు భారీ స్థాయిలో దేవీచౌక్ గుడి కింద ఖాళీగా ఉన్న ప్రాంతంలో బాణసంచా ఉంచారు. బాణసంచా కాల్చుతుండగా, భారీగా నిల్వ చేసిన బాణసంచాపై నిప్పురవ్వ పడడంతో పెద్ద ఎత్తున పేలుళ్లతో మంటలు వ్యా పించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు. -
రాగానికి వన్స్‌మోర్..
నాటకం.. నిత్యనూతనం వన్నెతగ్గని రంగస్థల వినోదం యువతరాన్నీ ఆకట్టుకుంటున్న పౌరాణికం దేవీచౌక్ వేదికే సాక్ష్యం తెల్లవారే వరకూ ప్రదర్శనలు దసరా ఉత్సవాల్లో సందడే సందడి వన్స్‌మోర్ అంటూ కేరింతలు ‘బావా ఎప్పుడు వచ్చితీవు’, ‘జెండాపై కపిరాజు’, ‘అదిగో ద్వారక – ఆలమందలవిగో’, ‘అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శత్రుడే యలిగిననాడు’, ‘చెల్లియో,చెల్లకో’ తదితర పద్యాలు నిరక్షరాస్యుల నాలుకలపై సైతం నర్తనమాడటానికి ప్రధాన కారణం నాటకరంగమే. సుమారు అర్ధశతాబ్దం వెనుక వరకు రాత్రి ఏ పదిగంటలకో ప్రారంభమయ్యే ఈ నాటకాలు తెల్లవారేవరకు సాగినా ప్రేక్షకులు ఓపికగా చూసేవారు. అయితే సినిమాలు, టీవీల స్వైరవిహారం ప్రారంభమైన ఈ రోజుల్లో నాటకాలు ప్రాధాన్యం కోల్పోయాయా, వీటిపై నేటితరం ప్రతిస్పందన ఏమిటి, నాటకాలకు ఆదరణ ఎలా ఉంటోంది...తదితర ప్రశ్నలకు సమాధానంగా రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించిన నాటకాల తీరు ... ప్రేక్షకుల అభిరుచిపై ‘సాక్షి’ ఫోకస్ దృష్టి సారించింది. రాత్రి పది గంటలకు ప్రారంభమై వేకువ జామున ఐదు గంటలవరకూ కొనసాగినా ప్రాంగణం పలుచపడలేదు ... ప్రేక్షకుల ఆదరణ చెక్కు చదరలేదు. వృద్ధులతో పాటు మహిళలు, యువత కూడా ఆద్యంతం తిలకించి నేటికీ నాటకాలకు ఆదరణ తగ్గలేదని రుజువు చే శారు. – రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం కల్చరల్ ప్రదర్శించిన పద్య నాటకాలు ఇవే.. ఈ నెల ఒకటో తేదీన హైకోర్టు న్యాయమూర్తి ఆశపు రామలింగేశ్వరరావు, ఎంపీ మాగంటి మురళీమోహన్, ఇతర ప్రముఖులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఒకటిన గుడివాడకు చెందిన రాజరాజేశ్వరీ నాట్యమండలి ఆధ్వర్యంలో కనకదుర్గా మహత్మ్యం, 3న నగరానికి చెందిన జయలక్ష్మి నాట్యమండలి ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర, 5న అదే సంస్థ ఆధ్వర్యంలో మూడు పద్యనాటకాల నుంచి మూడు ప్రధాన ఘట్టాలు, 6న విజయవాడకు చెందిన దుర్గాకళానికేతన్ ఆధ్వర్యంలో మాయాబజారు, 7న ఉమాశ్రీవాణీ కళానికేతన్ ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర, 8న ఇదే సంస్థ ఆధ్వర్యంలో చింతామణి, 10న నగరానికి చెందిన జయలక్ష్మి నాట్యమండలి ఆధ్వర్యంలో బాలనాగమ్మ, 11న సంపత్ నగరానికి చెందిన బాలసరస్వతి నాట్యమండలి ఆధ్వర్యంలో రామాంజనేయ యుద్ధం, 12న జయలక్ష్మి నాట్యమండలి ఆధ్వర్యంలో కురుక్షేత్రం నాటకాలను ప్రదర్శించారు. మధ్య తేదీలలో సంగీత విభావరి కార్యక్రమాలు జరిగాయి. రాజరాజేశ్వరి నాట్యకళామండలి గుడివాడ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటో తేదీ రాత్రి సుమారు 11 గంటలకు కనకదుర్గా మహాత్మ్యం నాటకం ప్రారంభమైంది. రాక్షసులను కనకదుర్గాదేవి మట్టుపెట్టడం ప్రధాన ఇతివృత్తం. శంకరుడు, మహిషాసురుడు, నారదుడు, వీరభద్రుడు, పార్వతి ప్రధాన పాత్రలు. ప్రారంభం రోజున ముఖ్య అతి«థుల ప్రసంగాలు ఉండడంతో మేకప్ పూర్తి చేసుకుని వచ్చిన కళాకారులు స్టేజ్ వెనుక ఉన్న రోడ్డుమీదనే కొద్దిసేపు సేదదీరారు. రాజమహేంద్రవరానికి చెందిన జయలక్ష్మి నాట్యమండలి కళాకారులు మూడో తేదీన ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం తెల్లవారుజాము 4.30 గంటల వరకు కొనసాగింది. హరిశ్చంద్రుని పాత్రలో నలుగురు, నక్షత్రకుడి పాత్రలో ముగ్గురు, చంద్రమతి పాత్రలో ముగ్గురు కనిపించారు. ఉమా శ్రీవాణి కళానికేతన్ కళాకారులు ఏడో తేదీన ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర నాటకం మరుసటిరోజు ఉదయం 4 గంటల వరకు కొనసాగింది. పద్యాలు ఆకట్టుకున్నాయి. జాతీయ కవి చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన గయోపాఖ్యానం నాటకంలోని కృష్ణార్జున సంవాదం, చింతామణిలోని భవానీ,చింతామణి సంవాదం,హరిశ్చంద్రలోని కాటిసీన్లను ఐదో తేదీన ప్రదర్శించారు. విజయవాడకు చెందిన దుర్గాకేశవమండలి కళాకారులు ఆరో తేదీన మాయాబజారు నాటకం ప్రదర్శించారు. ఈ నాటకం ఇతివృత్తం మహాభారతంలో ఎక్కడా కానరాకపోయినా ప్రేక్షకులకు మాయాబజారు సినిమా, నాటకాలు నేటికీ అలరిస్తున్నాయి. ఇందులో కృష్ణుడి వేషధారణలో ఇద్దరు కనిపించారు. కణ్వశ్రీ రచించిన బాలనాగమ్మ నాటకం ఆధారంగా రెండు సినిమాలు గతంలో విడుదలయ్యాయి. జానపదకథకు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ‘కాలానుగుణం’గా మార్పులు, చేర్పులు చేశారు. ఈనెల 10న ప్రదర్శించిన నాటకంలో ప్రత్యేకంగా హాస్యం పేరిట మసాలా సన్నివేశాలను జొప్పించారు. కురుక్షేత్రం నాటకాన్ని ఈనెల 12న ప్రదర్శించారు. దుర్యోధనుడి వేషంలో ముగ్గురు, కృష్ణుడి పాత్రలో ఐదుగురు కనిపించారు. రాజమహేంద్రవరానికి చెందిన ఉమాశ్రీవాణి కళానికేతన్ కళాకారులు ఎనిమిదో తేదీన ప్రదర్శించిన చింతామణి నాటకంలో ‘మసాలా’ పాలు ఎక్కువగా ఉంది. సుమారు శతాబ్దం వెనుక మహాకవి తాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకం వేలాది ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. ఇందులో శ్రీహరి,చింతామణి, రాధ, చిత్ర పాత్రల్లో ఇద్దరేసి కళాకారులు నటించారు. సామాజికసందేశంతో నాటకం ముగుస్తుంది. మాయల ఫకీర్‌గా మన్ననలు 25 ఏళ్లుగా బాలనాగమ్మ నాటకంలో మాయల ఫకీర్‌గా వందలాది ప్రదర్శనల్లో నటించి, ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాను. ఇదే కథతో డాక్టర్.గోవిందరాజులు మాయల ఫకీర్‌గా ఒకసారి, ఎస్వీ రంగారావు మాయలఫకీరుగా మరోసారి సినిమాలు వచ్చాయి. సినిమా ప్రభావం నాటకం మీద లేదు. నాటకం ప్రభావమే సినిమా మీద ఉంది. కణ్వశ్రీ రచించిన ఈ నాటకం నేటికీ ప్రేక్షకులకు నిత్యనూతనమే. – తవిటి నాయుడు. విజయవాడ 20 ఏళ్లుగా సంగుపాత్రలో 20 ఏళ్లుగా రంగస్థలంపై బాలనాగమ్మ నాటకంలో సంగు పాత్రను పోషిస్తున్నాను. కేవలం మాయలఫకీరును అలరించడానికే కాదు, సంగు పాత్రలో కథాపరంగా ఔచిత్యం ఉందని భావిస్తున్నాను. – సురభి సువర్ణ, రాజమహేంద్రవరం వ్యాపారం బాగుంది దేవీచౌక్ ఉత్సవాలల్లో ప్రతిరోజు రాత్రి టీ అమ్ముతున్నాను.రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము మూడింటి వరకు ఉంటాను. రూ.5 చొప్పున సుమారు 200 టీలు అమ్ముతున్నాను. – కృష్ణ చౌతన్య, టీ వ్యాపారి. 1500 నాటకాలు ఆడాను మాది వ్యవసాయ కుటుంబం. కృష్ణా జిల్లా గుడివాడ మా స్వగ్రామం. హాస్య ప్రధానమైన చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ప్రాత పోషిస్తాను. దాదాపు 1500 సార్లు ఈ వేషం వేశాను. మంచి గుర్తింపు వచ్చింది. ద్వందార్థాలు ఎక్కువగా తీయకుండా ప్రేక్షకులను మెప్పిస్తే ఇబ్బంది ఉండదు. దేవీచౌక్‌లో గత కొన్నేళ్లుగా నటిస్తున్నాను. – దాడిశెట్టి సుబ్బారావు నాటకాలు చాలా బాగున్నాయి చిన్నప్పటి నుంచి నాటకాలు చూస్తున్నాం. ఇప్పటి తరం టీవీలకు అతుక్కుపోతోంది. నాటకాల్లో మంచి సందేశం ఉంటుంది. ఇది తెలియజేయడానికి పిల్లలను కూడా తీసుకొస్తున్నాం. నాటకాలల్లో పాత్రలు, సందేశాన్ని వివరిస్తున్నాం. దేవీ చౌక్‌లో ఇలా నాటకాలు ఆడించడం చాలా బాగుంది. – తంగెళ్ల భవాని, ప్రేక్షకురాలు, రాజమహేంద్రవరం ఏడేళ్ల వయసు నుంచీ హార్మోనిస్టుగా.. ఏడేళ్ల వయస్సు నుంచి హార్మోనియం వాయిస్తున్నాను. నటుల గానానికి అనుగుణంగా మేము సంగీతం వినిపించాలి. లేకుంటే నటుడు ఇబ్బంది పడతాడు. నాటకం రక్తి కట్టదు. నాటకాలు ఉన్నా లేకున్నా ప్రతి రోజు ఆనం కళా కేంద్రం వద్దకు వెళ్లి సాధన చేస్తాను. నాటకాలే మాకు జీవనాధారం. – కె.వెంకట రమణ నాటక నిర్వాహకుడిగా.. 1974లో ఉమాశ్రీ వాణీనికేతన్ స్థాపించి, రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ఆడుతున్నాను. దేవీచౌక్ ఉత్సవ సమితి సూచనల మేరకు ఏటా ఇక్కడ జరిగే నాటకాలకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాను. నాటక నిర్వాహకుడిగా ఉన్నాను. – పిడుగు సూర్యనారాయణ, నాటకాల ఆర్గనైజర్ సినిమా చూసి ఇరవై ఏళ్లు మాది రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామం. దేవీచౌక్ నవరాత్ర ఉత్సవాలల్లో ప్రదర్శించే నాటకాలను చూడడానికి ముపె్పౖ ఏళ్లుగా వస్తున్నాను. నాటకాలంటే ఎనలేని ఆసక్తి. సినిమా చూసి 20 ఏళ్లు అవుతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావుల సినిమాలు చూశాను. – ప్రగడ పద్మరాజు, ప్రేక్షకుడు రిపోర్టింగ్ : వారణాసి సుబ్రహ్మణ్యం, పలుకూరి కోటేశ్వరరెడ్డి ఎడిటింగ్ : వద్ది దుర్గారావు డిజైనింగ్ : డి.ఎస్.వి.వి. ప్రసాద్ -
ఒకటి నుంచి ‘దేవీచౌక్’ శరన్నవరాత్ర ఉత్సవాలు
రాజమహేంద్రవరం కల్చరల్ : శ్రీదేవీ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాజమహేంద్రవరం దేవీచౌక్ అమ్మవారి 83వ శరన్నవరాత్ర ఉత్సవాలు ప్రారంభమవుతాయని సమితి అధ్యక్షుడు తోలేటి ధనరాజు తెలిపారు. శ్రీదేవీ కల్యాణ మండపంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి 12.06 గంటలకు అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక వేదికపై ప్రతిషి్ఠస్తామన్నారు. ఒకటో తేదీ ఉదయం 8.48 గంటలకు కలశస్థాపన పూజ జరుగుతుందన్నారు. రెండో తేదీ ఉదయం 108 మంది దంపతులచేత సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు. 12న అన్నసమారాధనతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. రోజూ అమ్మవారిని ఒక్కో అవతారంలో అలంకరిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తామన్నారు.