breaking news
Development of forest
-
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో..తెలంగాణకు తొమ్మిదో స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 163 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. 1,025 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరుగుదలతో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. భారత అటవీ నివేదిక–2019లో (ఐఎస్ఎఫ్ఆర్) ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ 16వ ఐఎస్ఎఫ్ఆర్ నివేదికను సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. అటవీ విస్తీర్ణం పెరుగుదల కనిపించిన రాష్ట్రాల్లో కేరళ మూడో స్థానంలో నిలిచింది. కేరళలో 823 చదరపు కి.మీ. మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో అటవీ విస్తీర్ణం–వనరుల వినియోగంపై భారత అటవీ సర్వే (ఎఫ్ఎస్ఐ) రెండేళ్లకోసారి నివేదిక రూపొందిస్తుంది. దీని ప్రకారం గత రెండేళ్లలో దేశంలో 5,188 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: ప్రకాష్ జవదేకర్ నల్లమలలో యురేనియం నిక్షేపాల ఉనికిపై అధ్యయనం చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. ఐఎస్ఎఫ్ఆర్ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధిత అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. యురేనియం సహా ఏ ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
తరిగిపోతున్న పచ్చధనం
- యథేచ్ఛగా వృక్షాల నరికివేత - ఆక్రమణల పాలవుతున్న అడవులు - చోద్యం చూస్తున్న అటవీ శాఖాధికారులు అనంతపురం : పచ్చదనం తరిగిపోతోంది. అటవీ ప్రాంత అభివృద్ధిలో భాగంగా కోట్లాది రూపాయలతో ఏటా లక్షలాది మొక్కలు నాటుతున్న అధికారులు వాటి పర్యవేక్షణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా పచ్చదనం రోజురోజుకూ తగ్గిపోతోంది. స్వార్థపరులు విచక్షణా రహితంగా వృక్షాలు నరికి వేయడం, అటవీ భూముల దురాక్రమణ కారణంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 1,98,930 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీని పరిరక్షణకు అటవీ శాఖతో పాటు 284 వన సంరక్షణ సమితుల్లోని 75,300 మంది సభ్యులు కృషి చేస్తున్నారు. ఈ అడవుల్లో రూ.12 కోట్ల వ్యయంతో 2011-12లో 300 హెక్టార్లలో 1.20 లక్షల నారేపి, తపసి మొక్కలు, 2012-2013లో 300 హెక్టార్లలో 1.20 లక్షల అటవీ జాతుల మొక్కలతోపాటు, 12లక్షల యూకలిప్టస్, 2013-14లో 900 హెక్టార్లలో వివిధ రకాల మొక్కలను అటవీ శాఖ నాటింది. సాధారణంగా అటవీ జాతుల మొక్కలు మూడేళ్లలో 8 నుంచి 10 అడుగులు, యూకలిప్టస్ మొక్కలు 15 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికి మూడేళ్లు దాటుతున్నా అడవుల్లో ఆ మేరకు పెరిగిన చెట్లు కనిపించడం లేదు. పైగా అధికారులు నాటిన మొక్కల సంఖ్యకన్నా, నరికివేతకు గురైన వృక్షాల సంఖ్యే అధికంగా ఉంటోందన్న వాదన వినిపిస్తోంది. జనారణ్యంలోకి వన్యప్రాణులు అడవుల్లోని వృక్షాలు విచ్చలవిడిగా నరికివేతకు గురికావడంతో ఒకప్పుడు పచ్చని అడవులుగా ఉన్నప్రాంతాలు ప్రస్తుతం బోడికొండలు, గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు ఆవాసంగా కలిగిన వన్య ప్రాణులకు ఆహారం, తాగునీటి కొరత ఏర్పడుతోంది. దీంతో వాటిని వెతుక్కుంటూ వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడుతూ, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన సంరక్షణ సమితుల పనితీరును మెరుగుపరచాలి. స్వార్థపర శక్తుల చేతుల్లో పడి అటవీ ప్రాంతాలు నాశనమై పోకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నిరంతరం అటవీ ప్రాంతాల్లో నిఘా ఉంచడమే కాకుండా, అటవీ చట్టాలను సైతం కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విచ్చలవిడిగా నరికివేత అడవుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైఫల్యమే అవి విస్తరించకపోవడానికి కారణమవుతోంది. దీనికి తోడు కొన్నేళ్లుగా స్మగ్లర్లు వృక్ష సంపదను యథేచ్ఛగా దోచుకోవడంతోపాటు, అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. వారం క్రితం తాడిమర్రి మండలం సమీపంలోని అటవీ ప్రాంతంలో టీడీపీకి చెందిన కొందరు కబ్జా చేసేందుకు భూమిని చదును చేస్తుండగా, స్థానికులు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు దాడి చేసి జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో 540 హెక్టార్లు, ఎల్లుట్ల రిజర్వులో 150 హెక్టార్ల మేర దురాక్రమణకు గురైనట్లు అధికారులు చెబుతున్నా.. రికార్డులకు ఎక్కని ఆక్రమణలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ చర్యలు తీసుకుంటున్నాం అడవుల పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఏటా మొక్కలు నాటుతున్నా.. కొంత మంది వాటిని ధ్వంసం చేస్తున్నారు. 2014-15లో 600 హెక్టార్లలో 5.50 లక్షల మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నాం. అడవుల నరికివేతను అరికట్టేందుకు కట్టుదిట్టమైనప్రణాళిక రూపొందిస్తున్నాం. - రాఘవయ్య, డీఎఫ్ఓ, అనంతపురం